ముంబై వాంఖడే వేదికగా ఆస్ట్రేలియాతో జరుగుతున్న ఏకైక టెస్టులో భారత అమ్మాయిలు సత్తా చాటారు. తొలి రోజు ఆటలో పూర్తి ఆదిపత్యం ప్రదర్శించారు. ఇటీవలే ఇంగ్లాండ్‌తో జరిగిన ఏకైక టెస్టులో చరిత్రలోనే అతి భారీ విజయం నమోదు చేసి మంచి ఊపు మీదున్న టీమిండియా.... ఆస్ట్రేలియాతో మ్యాచ్‌లోనూ చెలరేగింది. ఈ మ్యాచ్‌లో టాస్‌ గెలిచిన కంగారులు తొలుత బ్యాటింగ్‌కు దిగారు. తొలి ఇన్నింగ్స్‌లో ఆసీస్‌ను 219 పరుగులకే భారత్‌ ఆలౌట్‌ చేసింది. మొదటి రోజు ఆట ముగిసే సమయానికి టీమ్‌ఇండియా వికెట్‌ నష్టానికి 98 పరుగులు చేసింది. 


టాస్‌ గెలిచి బ్యాటింగ్‌కు దిగిన ఆస్ట్రేలియా ఆరంభంలోనే షాక్‌ తగిలింది.  లిట్చ్‌ఫోల్డ్‌ (0) ఒక్క బంతి కూడా ఎదుర్కోకుండానే రనౌట్‌ రూపంలో పెవిలియన్‌కు చేరింది. దీంతో రెండు పరుగులకే ఆస్ట్రేలియా వికెట్‌ కోల్పోయింది. ఆ తర్వాత వచ్చిన పెరీ కూడా ఎక్కువ సేపు నిలవలేదు. నాలుగు పరుగులు చేసిన పెర్రీని వస్త్రాకర్‌ బౌల్డ్‌ చేసి టీమిండియాకు మరో వికెట్‌ అందించింది. దీంతో జట్టు స్కోరు ఏడు పరుగులు చేరిందో లేదో ఆస్ట్రేలియా రెండో వికెట్‌ కోల్పోయింది. ఆ తర్వాత  రెండో డౌన్‌లో వచ్చిన తహ్లియా మెక్‌గ్రాత్‌తో కలసి ఓపెనర్ మూనీ కీలక ఇన్నింగ్స్‌ ఆడింది. వికెట్‌ పడకుండా జాగ్రత్తగా బ్యాటింగ్‌ చేసిన వీరిద్దరూ ఒక్కో పరుగు చేరుస్తూ జట్టు స్కోరును ముందుకు నడిపారు. మూడో వికెట్‌కు 80 పరుగుల కీలక భాగస్వామ్యం నెలకొల్పి ప్రమాదకరంగా మారిన ఈ జోడీని రాణా విడదీసింది. 56 బంతుల్లో 8 ఫోర్లతో 50 పరుగులు చేసిన తహ్లియా మెక్‌గ్రాత్‌ను రాణా అవుట్‌ చేసింది. దీంతో మూడో వికెట్‌ భాగస్వామ్యాన్ని తెర పడింది. ఆ తర్వాత కాసేపటికే బెత్‌ మూనీ కూడా అవుటైంది. 94 బంతుల్లో 2 ఫోర్లతో 40 పరుగులు చేసిన బెత్‌ మూనీని వస్త్రాకర్‌ అవుట్‌ చేసింది. 103 పరుగులు వద్ద ఆస్ట్రేలియా నాలుగు వికెట్లు కోల్పోయింది.


ఆ తర్వాత  కెప్టెన్ హీలీ కాసేపు క్రీజులో పాతుకుపోయి కాసేపు భారత బౌలర్ల సహనానికి పరీక్ష పెట్టింది. 75 బంతుల్లో 38 పరుగులు చేసిన హీలీని శర్మ బౌల్డ్‌ చేసింది. దీంతో 143 పరుగుల వద్ద ఆస్ట్రేలియా అయిదో వికెట్‌ కోల్పోయింది. ఆ తర్వాత కంగారుల పతనం వేగంగా సాగింది. సదరల్యాండ్‌, గార్డ్‌నర్‌, జాన్సన్, అలియా కింగ్‌ తక్కువ పరుగులకే వెనుదిరిగారు. దీంతో 168 పరుగులకు ఆస్ట్రేలియా ఎనిమిది వికెట్లు కోల్పోయింది. ఇక ఆస్ట్రేలియా రెండు వందల పరుగుల మార్క్‌ను దాటడం కష్టమే అని భావిస్తున్న వేళ కిమ్‌ గార్త్‌ (28) క్రీజ్‌లో పాతుకుపోయి కాసేపు నిలబడి ఆస్ట్రేలియా స్కోరును రెండు వందల మార్కును దాటించింది. కిమ్‌ గార్త్‌ 71 బంతులు ఆడి 28 పరుగులు చేసి అజేయంగా నిలిచింది. కానీ అవతలి పక్క బ్యాటర్లు అవుట్‌ కావడంతో ఆస్ట్రేలియా తొలి ఇన్నింగ్స్‌ను 77.4 ఓవర్లలో 219 పరుగుల వద్ద ముగించింది. భారత బౌలర్లలో పూజా వస్త్రాకర్‌ నాలుగు, స్నేహ్‌ రాణా 3, దీప్తి శర్మ రెండు వికెట్లు తీశారు.


అనంతరం తొలి ఇన్నింగ్స్‌ ఆరంభించిన భారత్‌ సాధికారికంగా బ్యాటింగ్‌ చేసింది. ఓపెనర్లు అదిరే ఆరంభం ఇచ్చారు. పూర్తి ఆత్మవిశ్వాసంతో కనపడ్డ భారత ఓపెనర్లు... తొలి వికెట్‌కు 90 పరుగులు జోడించారు. షెఫాలీ వర్మ 59 బంతుల్లో ఎనిమిది ఫోర్లతో 40 పరుగులు చేసింది. మరి కాసేపట్లో ఆట ముగుస్తుందనగా షెఫాలీని జొనాసెన్  వికెట్ల ముందు దొరకబుచ్చుకుంది. మరో ఓపెనర్‌ స్మృతి మంధాన సాధికారికంగా బ్యాటింగ్‌ చేసింది. వన్డే తరహాలో బ్యాటింగ్‌ చేసిన మంధాన 49 బంతుల్లో 8 ఫోర్లతో 43 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచింది.  స్నేహ్‌రాణా ఎనిమిది బంతుల్లో నాలుగు పరుగులు చేసి క్రీజులో ఉంది. ఓపెనర్లు రాణించడంతో తొలి రోజు ఒక వికెట్‌ నష్టానికి 98 పరుగులు చేసింది. ఒక వికెట్ తీసింది. భారత్‌ ఇంకా 121 పరుగులు వెనుకబడి ఉంది.