ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌(IPL) మినీ వేలం ముగిసింది. ఈ వేలంలో మొత్తం 72 మంది ఆటగాళ్లను ఆయా ఫ్రాంచైజీలు దక్కించుకున్నాయి. ఇందులో ఆస్ట్రేలియా ఫాస్ట్ బౌలర్ మిచెల్ స్టార్క్(Mitchell Starc) అత్యంత ఖరీదైనదిగా నిలిచాడు. కోల్‌కతా నైట్ రైడర్స్(KKR) రూ.24.75 కోట్లకు స్టార్క్‌ను కొనుగోలు చేసింది. పాట్ కమిన్స్(Pat Cummins) రెండో అత్యంత ఖరీదైన ఆటగాడిగా నిలిచాడు. 20.50 కోట్లకు కమిన్స్‌ను సన్‌రైజర్స్ హైదరాబాద్(SRH) కొనుగోలు చేసింది. వేలంలో అత్యంత ఖరీదైన భారత ఆటగాడిగా హర్షల్ పటేల్ నిలిచాడు. పంజాబ్ కింగ్స్ అతడిని రూ.11.75 కోట్లకు కొనుగోలు చేసింది. యూపీ తరఫున ఆడిన సమీర్ రిజ్వీ అత్యంత ఖరీదైన అన్‌క్యాప్డ్ ప్లేయర్. సమీర్‌ను చెన్నై సూపర్ కింగ్స్ 8.40 కోట్లకు కొనుగోలు చేసింది. అయితే ఈ వేలం మాత్రం ఎంతో మంది భారత ఫ్యాన్స్‌ను నిరాశపర్చింది. ఇతర దేశాల ఆటగాళ్లకు ఈ స్థాయిలో ధర పలకడం పట్ల టీమిండియా ఫ్యాన్స్, టీమిండియా మాజీలు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. 


దయాళ్‌ వర్సెస్‌ రింకూ సింగ్‌


అయితే ఈ వేలంలో కొన్ని ఆసక్తికర విషయాలు జరిగాయి. 2023 సీజన్‌లో గుజరాత్‌ టైటాన్స్‌ బౌలర్‌ యశ్‌ దయాల్‌ బౌలింగ్‌లో కేకేఆర్‌ విధ్వంసకర బ్యాటర్ రింకూ సింగ్‌ ఆఖరి ఓవర్‌లో చివరి ఐదు బంతులకు ఐదు భారీ సిక్సర్లు బాది జట్టుకు చిరస్మరణీయ విజయాన్ని అందించాడు. ఇది జరిగి ఏడు నెలల కాలం అయిపోయింది.  అయితే నిన్న జరిగిన ఐపీఎల్‌ వేలం తర్వాత ఈ టాపిక్‌ మళ్లీ నెట్టింట హల్‌చల్‌ చేస్తుంది. విషయం ఏంటంటే  ఐపీఎల్‌ వేలంలో గుజరాత్‌ విడిచపెట్టిన యశ్‌ దయాల్‌ను ఆర్సీబీ 5 కోట్ల ఊహించని ధరకు కొనుగోలు చేసింది. దీంతో దెబ్బకు దయాళ్ కోటీశ్వరుడైపోయాడు. ఇక సీన్ కట్ చేస్తే.. ఓ ఓవర్‌లో 5 సిక్సర్లు సమర్పించుకున్న బౌలర్‌ రూ.5 కోట్ల ధర పలికితే.. 5 సిక్సర్లు కొట్టిన ఆటగాడు మాత్రం రూ.55 లక్షల జీతం మాత్రమే తీసుకుంటున్నాడు. దీంతో ఒకే ఓవర్‌లో ఐదు సిక్సర్లు బాదించుకున్న బౌలర్‌కు 5 కోట్ల భారీ మొత్తం దక్కనుండగా.. ఆ ఐదు సిక్సర్లు బాదిన బ్యాటర్‌కు మాత్రం కేవలం 50 లక్షలే లభించనున్నాయి.


కేకేఆర్‌పై విమర్శలు


సిక్సర్లు బాదించుకున్నవ్యక్తికే ఇంత భారీ మొత్తం లభిస్తున్నప్పుడు, ఆ సిక్సర్లు కొట్టిన రింకూ సింగ్‌కు మాత్రం ఎందుకు అంత తక్కువ మొత్తమని అభిమానులు ప్రశ్నిస్తున్నారు. రింకూని కేవలం 50 లక్షలకే దక్కించుకుని, అతన్ని తిరిగి రీటెయిన్‌ చేసుకుని, అతన్ని ఆర్ధికంగా ఎదగకుండా కేకేఆర్‌ కట్టిపడేసిందని ఫ్యాన్స్‌ అభిప్రాయపడుతున్నారు. 



అసలేం జరిగిందంటే 2023 సీజన్‌లో భాగంగా గుజరాత్ టైటాన్స్.. కోల్‌కతా నైట్ రైడర్స్ జట్లు ఓ మ్యాచులో తలపడ్డాయి. ఈ మ్యాచులో ఛేజింగ్‌లో చివరి ఓవర్‌లో వరుసగా 5 సిక్సర్లు బాది.. కోల్‌కతాకు సంచలన విజయం అందించాడు రింకూ సింగ్. ఆ ఓవర్ వేసింది యశ్ దయాళ్. రింకూ దెబ్బకు యశ్ దయాళ్ అనారోగ్యం బారిన పడ్డాడు. మళ్లీ కోలుకునేందుకు చాలా సమయం పట్టింది. ఆ ఇన్నింగ్స్ తర్వాత రింకూ సింగ్ ఫేట్ మారిపోయింది. దెబ్బకు భారత సెలక్టర్ల నుంచి పిలుపు అందుకున్నాడు. అంతర్జాతీయ క్రికెట్‌లో తనదైన శైలిలో చెలరేగిపోతున్నాడు.