India vs Sri Lanka 2nd T20I Highlights: శ్రీలంక( srilanka )తో జరుగుతున్న టీ 20 సిరీస్‌ను భారత్‌(India మరో మ్యాచ్‌ మిగిలి ఉండగానే కైవసం చేసుకుంది. వర్షం అంతరాయం కలిగించిన ఈ మ్యాచ్‌లో భారత్‌ డక్‌వర్త్‌ లూయిస్‌ పద్ధతిలో విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్‌ చేసిన లంక నిర్ణీత 20 ఓవర్లలో తొమ్మిది వికెట్లు కోల్పోయి 161 పరుగులు చేసింది. ఆ తర్వాత భారత్ బ్యాటింగ్‌కు దిగిందో లేదో వర్షం పడింది. చాలా సేపటి వరకూ వర్షం కురవడంతో డక్‌వర్త్‌లూయిస్‌ పద్ధతిలో భారత లక్ష్యాన్ని ఎనిమిది ఓవర్లకు 78 పరుగులుగా నిర్దేశించారు. ఈ లక్ష్యాన్ని మరో తొమ్మిది బంతులు మిగిలి ఉండగానే మూడు వికెట్లు మాత్రమే కోల్పోయి భారత్‌ సునాయసంగా ఛేదించింది. సూర్య, జైస్వాల్‌, హార్దిక్‌ రాణించడంతో భారత్‌ లక్ష్యం తేలికైపోయింది.


 

పోరాడిన లంక

ఈ మ్యాచ్‌లో టాస్‌ గెలిచిన టీమిండియా వర్షం కురిసే అవకాశం ఉండడంతో తొలుత బౌలింగ్‌ ఎంచుకుంది. గత మ్యాచ్‌లో లంకకు మంచి ఆరంభాన్ని ఇచ్చిన ఓపెనర్లు ఈ మ్యాచ్‌లోనూ పర్వాలేదనిపించే ఆరంభాన్ని ఇచ్చారు. 3.3 ఓవర్లలో 26 పరుగులు జోడించారు. ఈ దశలో కుశాల్‌ మెండీస్‌ను అవుట్‌ చేసిన అర్ష్‌దీప్‌ భారత్‌కు తొలి వికెట్‌ను అందించాడు. దీంతో 26 పరుగుల వద్ద లంక తొలి వికెట్‌ కోల్పోయింది. అయితే కుశాల్‌ పెరీరా కీలక ఇన్నింగ్స్‌ ఆడాడు. మరో ఓపెనర్‌ నిసంకతో కలిసి కీలక భాగస్వామ్యం నెలకొల్పాడు. వీరిద్దరూ కలిసి లంక స్కోరు బోర్డును వేగంగా ముందుకు నడిపారు. దీంతో లంక 9 ఓవర్లలోనే 80 పరుగులకు చేరువైంది. ఈ దశలో నిసంకను అవుట్‌ చేసిన భిష్ణోయ్‌ భారత్‌కు బ్రేక్‌ ఇచ్చాడు. 80 పరుగుల వద్ద లంక రెండో వికెట్‌ కోల్పోయింది. ఓవైపు వికెట్లు పడుతున్నా కుశాల్‌ పెరీరా మాత్రం దూకుడుగా ఆడాడు. 34 బంతుల్లో ఆరు ఫోర్లు, రెండు సిక్సర్లతో 53 పరుగులు చేసి పాండ్యా బౌలింగ్‌లో అవుటయ్యాడు. కవిందు మెండీస్‌ కూడా 26 పరుగులతో రాణించాడు. టాపార్డర్‌ రాణించిన మిడిల్‌, లోయర్ ఆర్డర్లు రాణించకపోవడంతో లంక అనుకున్న దానికంటే తక్కువ పరుగులే చేసింది. రవి బిష్ణోయ్‌ ఒకే ఓవర్లో రెండు వికెట్లు తీసి లంకను దెబ్బ కొట్టాడు. ధనుశ్‌ షనక, వనిందు హసరంగను వరుస బంతుల్లో అవుట్‌ చేసిన భిష్ణోయ్‌ లంకను చావు దెబ్బ కొట్టాడు. ఆ తర్వాత వచ్చిన బ్యాటర్లు కూడా త్వరగానే పెలివియన్‌కు చేరడంతో పరుగులు రావడం గగనమైపోయింది. దీంతో  లంక  నిర్ణీత 20 ఓవర్లలో తొమ్మిది వికెట్లు కోల్పోయి 161 పరుగులు చేసింది. 





 

అడ్డుపడిన వర్షం

162 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన భారత్‌కు వరుణుడు స్వాగతం పలికాడు. తొలి ఓవర్‌లో రెండు బంతులు ఆడారో లేదో భారీ వర్షం కురిసింది. దీంతో  డక్‌వర్త్‌ లూయిస్‌ పద్ధతిలో భారత లక్ష్యాన్ని ఎనిమిది ఓవర్లకు 78 పరుగులుగా నిర్దేశించారు. భీకర బ్యాటర్లు ఉన్న టీమిండియా ముందు ఈ లక్ష్యం చిన్నబోయింది. ఓపెనర్‌ యశస్వీ జైస్వాల్ 15 బంతుల్లో 30.. సూర్యకుమార్‌ యాదవ్‌ 12 బంతుల్లో 26, హార్దిక్‌ పాండ్యా 9  బంతుల్లో 22 పరుగులతో మెరుపులు మెరిపించారు. దీంతో మరో తొమ్మిది బంతులు మిగిలి ఉండగానే మూడు వికెట్లు మాత్రమే కోల్పోయి భారత్‌ సునాయసంగా ఛేదించింది.  ఈ విజయంతో మరో మ్యాచ్‌ మిగిలి ఉండగానే టీమిండియా సిరీస్‌ కైవసం చేసుకుంది.