Sri Lanka Women Won Against India Women :  శ్రీలంక (Sri Lanka) మహిళల జట్టు సంచలనం సృష్టించింది. టీమిండియా(India)కు షాక్‌ ఇస్తూ తొలి ఆసియా కప్‌ టైటిల్‌ను సాధించింది. దీంతో భారత మహిళల హృదయం ముక్కలైంది. ఈ ఆసియా కప్‌లో సాధికార విజయాలతో ఫైనల్‌ చేరిన టీమిండియా.. ఫైనల్లో మాత్రం లంక పోరాటం ముందు తలొంచింది. తొలుత టీమిండియా నిర్ణీత 20 ఓవర్లలో ఆరు వికెట్ల నష్టానికి 165 పరుగులు చేసింది. అనంతరం లంక కెప్టెన్‌ చమరి ఆటపట్టు, హర్షిత సమరవిక్రమల పోరాటంతో శ్రీలంక మరో ఎనిమిది బంతులు ఉండగానే రెండే వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించింది. 


 

రాణించిన స్మృతి మంధాన

ఈ మ్యాచ్‌లో టాస్‌ గెలిచిన హర్మన్‌ప్రీత్‌ కౌర్‌(Harmanpreet kaur) మరో ఆలోచన లేకుండా బ్యాటింగ్ ఎంచుకుంది. ఓపెనర్లు భారత్‌కు పర్వాలేదనిపించే ఆరంభం ఇచ్చారు. తొలి వికెట్‌కు 44 పరుగులు జోడించి భారీ స్కోరుకు బాటలు వేశారు. షఫాలీ వర్మ అనుకున్నంత వేగంగా ఆడలేకపోయింది. మరో ఓపెనర్‌ స్మృతీ మంధాన మాత్రం వేగంగా బ్యాటింగ్‌ చేసింది. వీరిద్దరూ మరి ధాటిగా ఆడకపోయినా  ఓవర్‌కు ఏడు పరుగుల చొప్పున జోడిస్తూ వచ్చారు. ఈ క్రమంలో 19 బంతుల్లో రెండు ఫోర్లతో 16 పరుగులు చేసిన షెఫాలీ వర్మను దిల్‌హరీ వికెట్ల ముందు దొరకబుచ్చుకుంది. దీంతో 44 పరుగుల వద్ద తొలి వికెట్‌ పడింది. ఆ తర్వాత ఉమా చెత్రి కూడా తక్కువ పరుగులకే వెనుదిరిగింది. కేవలం తొమ్మిది పరుగులే చేసిన ఉమా చెత్రి.. ఆటపట్టు బౌలింగ్‌లో ఎల్బీగా వెనుదిరిగింది. ఆ తర్వాత కెప్టెన్‌ హర్మన్‌ప్రీత్‌ కౌర్‌ కూడా 11 పరుగులకే వెనుదిరిగింది. 11 బంతుల్లో 11 పరుగులే చేసి హర్మన్‌ పెవిలియన్‌కు చేరింది. ఓ వైపు వికెట్లు పడుతున్నా మరోవైపు స్మృతీ మంధాన మాత్రం క్రీజులో నిలబడింది. జెమీమా రోడ్రింగ్స్‌తో కలిసి కీలక భాగస్వామ్యం నెలకొల్పింది. వీరిద్దరూ లంక బౌలర్లను సమర్థంగా  ఎదుర్కొంటూ స్కోరు బోర్డును ముందుకు నడిపించారు. జెమీమా మెరుపు బ్యాటింగ్‌ చేసింది. కేవలం 16 బంతుల్లో మూడు ఫోర్లు, ఒక సిక్స్‌తో జెమీమా 29 పరుగులు చేసింది. స్మృతీ మంధాన 47 బంతుల్లో 10 ఫోర్లతో 60 పరుగులు చేసి అవుటైంది. వీరిద్దరూ అవుటైన తర్వాత రిచా ఘోష్‌ మెరుపులు మెరిపించింది. కేవలం 14 బంతుల్లో 30 పరుగులు చేసింది. రిచా ఇన్నింగ్స్‌లో నాలుగు ఫోర్లు, ఒక సిక్స్‌ ఉన్నాయి. రిచా మెరుపులతో టీమిండియా నిర్ణీత 20 ఓవర్లలో ఆరు వికెట్ల నష్టానికి 165 పరుగులు చేసింది. 

 

చమరి-హర్షిత పోరాటం

166 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన శ్రీలంకకు ఆరంభంలోనే షాక్‌ తగిలింది. ఏడు వికెట్ల వద్దే లంక తొలి వికెట్‌ కోల్పోయింది. గుణరత్నే ఒక్క పరుగే చేసి రనౌట్‌ అయింది. ఆ తర్వాత మరో వికెట్‌ దక్కేందుకు భారత్  12 ఓవర్లు ఎదురుచూడాల్సి వచ్చింది. ఈ మ్యాచ్‌లో భారత బౌలర్లు పూర్తిగా తేలిపోయారు. లంక కెప్టెన్‌ చమరి ఆటపట్టు, హర్షిత సమరవిక్రమ అద్భుతంగా పోరాడారు. భారత బౌలర్లకు అవకాశం ఇవ్వకుండా శ్రీలంకను లక్ష్యం దిశగా నడిపించారు. చమరి ఆటపట్టు 43 బంతుల్లో 9 ఫోర్లు, రెండు సిక్సర్లతో 61 పరుగులు చేసి అవుటైంది. మరో బ్యాటర్‌ హర్షిత సమరవిక్రమ 51 బంతుల్లో ఆరు ఫోర్లు, రెండు సిక్సర్లతో 69 పరుగులు చేసి అజేయంగా నిలిచి లంకకు ఆసియాకప్ అందించింది. మరో కవిశా దిల్‌హరీ 16 బంతుల్లో 30 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచింది. వీరి పోరాటంతో లంక మరో ఎనిమిది బంతులు మిగిలి ఉండగానే కేవలం రెండే వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించి ఆసియాకప్‌ను కైవసం చేసుకుంది.