India vs srilanka 2nd t 20 Preview and Prediction: శ్రీలంక(Srilanka)తో జరిగిన తొలి టీ 20లో ఘన విజయం సాధించి మంచి ఊపు మీదున్న టీమిండియా (India)రెండో టీ 20కి సిద్ధమైంది. ఈ మ్యాచ్‌లోనూ విజయం సాధించి మరో మ్యాచ్‌ మిగిలి ఉండగానే సిరీస్‌ కైవసం చేసుకోవాలని సూర్యకుమార్‌ యాదవ్‌ నేతృత్వంలోని జట్టు భావిస్తోంది. తొలి టీ 20లో పోరాడి ఓడిపోయిన లంక.. ఈ మ్యాచ్‌లో గెలిచి సిరీస్‌ను సమం చేయాలని చూస్తోంది. ఈ మ్యాచ్‌లో గెలిచి మూడో టీ 20ని నిర్ణయాత్మకంగా మార్చాలని లంక పట్టుదలగా ఉంది. అయితే అన్ని విభాగాల్లో పటిష్టంగా ఉన్న భారత జట్టును అడ్డుకోవడం లంకకు అంత తేలికేం కాదు. కెప్టెన్‌ సూర్య, కోచ్‌ గంభీర్‌.. ఈ సిరీస్‌లో తమదైన ముద్ర వేయాలని పట్టుదలగా ఉన్నారు. ఈ నేపథ్యంలో ఈ మ్యాచ్‌లోనూ గెలిచి పొట్టి సిరీస్‌ను క్లీన్‌స్వీప్‌ దిశగా నడిపించాలని వ్యూహాలు రచిస్తున్నారు. 

 

అన్ని విభాగాల్లో పటిష్టంగా...

టీమిండియా అన్ని విభాగాల్లోనూ పటిష్టంగా కనిపిస్తోంది. తొలి టీ 20లో ఆరంభంలో కాస్త తడబడ్డా కీలక సమయంలో పుంజుకున్న బౌలర్లు భారత్‌కు విజయాన్ని అందించారు. కెప్టెన్ సూర్యకుమార్‌ యాదవ్‌ జట్టును ముందుండి నడిపాడు. కీలకమైన ఇన్నింగ్స్‌ ఆడి జట్టులో ఆత్మ విశ్వాసాన్ని నింపాడు. కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ నేతృత్వంలోని టీమిండియా... లంకపై తొలి టీ 20లో 43 పరుగుల భారీ తేడాతో విజయం సాధించింది. ఇక ఇవాళ జరిగే రెండో మ్యాచ్‌లోనూ గెలిస్తే భారత్‌... మరో మ్యాచ్‌ మిగిలి ఉండగానే సిరీస్‌ కైవసం చేసుకోనుంది. కెప్టెన్ సూర్య, రిషబ్ పంత్, యశస్వి జైస్వాల్, శుభ్‌మన్ గిల్‌ మంచి ఫామ్‌లో ఉన్నారు. హార్దిక్‌, అక్షర్‌ పటేల్‌ కూడా విధ్వంసకర ఇన్నింగ్స్‌లు ఆడుతున్నారు. తొలి టీ 20లో రియాన్ పరాగ్, హార్దిక్ పాండ్యా, రింకు సింగ్‌ విఫలం కావడం మేనేజ్‌మెంట్‌ను కాస్త ఆందోళనపరుస్తోంది. ఈ పరిస్థితుల్లో భారత బ్యాటర్లను అడ్డుకోవడం లంక బౌలర్లకు అంత తేలిక కాదు. కానీ శ్రీలంక తమదైన రోజున ఎలాంటి ప్రత్యర్థిని అయినా ఓడించగలదు. హార్దిక్ పాండ్యా, రవి బిష్ణోయ్‌ బంతితో కూడా రాణిస్తే రెండో టీ 20లు టీమిండియాపై గెలుపు నల్లేరుపై నడకే.

 

లంకకు డూ ఆర్‌ డై

ఈ సిరీస్‌లో ఆశలు సజీవంగా ఉండాలంటే శ్రీలంక ఈ మ్యాచ్‌లో తప్పక గెలవాలి. లంక ఫీల్డింగ్ కూడా మెరుగ్గా పడాలి. కొత్త కోచ్‌ సనత్‌ జయసూర్య ఆ విషయంలో ప్రత్యేక దృష్టి పెడతానడంలో సందేహం లేదు. లంక ఓపెనర్లు పాతుమ్ నిస్సాంక, కుశాల్ మెండిస్ మొదటి టీ20 మ్యాచ్‌లో అద్భుతంగా రాణించారు. మరోసారి వీరు రాణించాలని లంక కోరుకుంటోంది. శ్రీలంక మిడిల్ ఆర్డర్‌ కూడా గాడిన పడితే భారత బౌలర్లకు కష్టాలు తప్పవు. 

 

శ్రీలంక జట్టు: 

పాతుమ్ నిస్సాంక, కుశాల్ మెండిస్, అవిష్క ఫెర్నాండో/కుసల్ పెరీరా, కమిందు మెండిస్, చరిత్ అసలంక (కెప్టెన్), దసున్ షనక, వనిందు హసరంగా, మహేశ్ తీక్షణ, అసిత ఫెర్నాండో, మశన్‌క ఫెర్నాండో , మతీష పతిరణ

 

భారత జట్టు:

యశస్వి జైస్వాల్, శుభ్‌మన్ గిల్, రిషబ్ పంత్, సూర్యకుమార్ యాదవ్ , హార్దిక్ పాండ్యా, శివమ్ దూబే, వాషింగ్టన్ సుందర్, అక్షర్ పటేల్, అర్ష్‌దీప్ సింగ్, రవి బిష్ణోయ్/ఖలీల్ మహ్మద్, సిరాజ్