Washington Sundar replaces Deepak Chahar: అనుకున్నదే జరిగింది! దక్షిణాఫ్రికా వన్డే సిరీసు నుంచి దీపక్‌ చాహర్‌ వైదొలగాడు. గాయపడ్డ అతడి స్థానంలో వాషింగ్టన్‌ సుందర్‌ను బీసీసీఐ ఎంపిక చేసింది. ఆదివారం జరిగే రెండో వన్డేకు అతడు అందుబాటులో ఉంటాడని బోర్డు ప్రకటించింది. బెంగళూరులోని ఎన్‌సీఏలో చాహర్‌ను వైద్య బృందం పర్యవేక్షించనుంది.


ఏకనా వేదికగా జరిగిన తొలి వన్డేలో దీపక్‌ చాహర్‌ ఆడలేదు. రాంచీ వన్డేకు ముందు సాధన చేస్తుండగా అతడు గాయపడ్డాడు. దాంతో ఈ సిరీస్‌ నుంచి చాహర్‌ను బోర్డు తప్పించింది. బెంగళూరులోని ఎన్‌సీఏకు రిహాబిలిటేషన్‌కు పంపించింది. ఐసీసీ టీ20 ప్రపంచకప్‌లో బుమ్రా స్థానంలో టీమ్‌ఇండియా మరొకరిని ఎంపిక చేయలేదు. అందుకే అతడు కోలుకోవడంపై ఆసక్తి నెలకొంది. అతడు ఫిట్‌నెస్‌ సాధిస్తేనే ప్రపంచకప్‌నకు వెళ్లే అవకాశం ఉంటుంది.






చాన్నాళ్ల తర్వాత వాషింగ్టన్‌ సుందర్‌ టీమ్‌ఇండియాలో పునరాగమనం చేస్తున్నాడు. వాస్తవంగా జింబాబ్వే సిరీసుకు సెలక్టర్లు అతడిని ఎంపిక చేశారు. మరోసారి భుజానికి గాయమవ్వడంతో అతడు జింబాబ్వే వెళ్లలేదు. కోలుకున్న తర్వాత బ్రిటన్‌కు వెళ్లి రాయల్‌ లండన్‌ వన్డే కప్‌ ఆడాడు. సంవత్సర కాలంగా సుందర్‌ గాయాలతో సతమతం అవుతున్నాడు. ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌ 2022లో సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ తరఫున కేవలం 9 మ్యాచులే ఆడాడు. గాయం నుంచి కోలుకొని కౌంటీ క్రికెట్లో లాంకాషైర్‌ తరఫున ఆడాడు. 2 ఫస్ట్‌ క్లాస్ మ్యాచుల్లో 8 వికెట్లు పడగొట్టాడు.


వాస్తవంగా ఐసీసీ టీ20 ప్రపంచకప్‌ ప్రణాళికల్లో వాషింగ్టన్‌ సుందర్‌ ఉన్నాడు. స్పిన్‌ బౌలింగ్‌ ఆల్‌రౌండర్‌గా అతడికి మంచి అవకాశాలే ఉండేవి. ఐపీఎల్‌ నుంచి వరుసగా గాయాల పాలవ్వడంతో టీమ్‌ఇండియాకు దూరమయ్యాడు. జింబాబ్వే సిరీస్‌ ఆడి ఫిట్‌నెస్ నిరూపించుకుంటే పరిస్థితి మరోలా ఉండేది. కానీ మళ్లీ గాయపడటం వల్ల మెగా టోర్నీకి అర్హత పొందలేదు. మరి దక్షిణాఫ్రికాతో మిగిలిన రెండు వన్డేల్లో అతడికి చోటిస్తారో లేదో చూడాలి.


IND vs SA 1st ODI Highlights


భారత్‌తో జరిగిన మొదటి వన్డేలో దక్షిణాఫ్రికా తొమ్మిది పరుగులతో విజయం సాధించింది. మొదట బ్యాటింగ్ చేసిన దక్షిణాఫ్రికా 40 ఓవర్లలో నాలుగు వికెట్ల నష్టానికి 249 పరుగులు చేసింది. అనంతరం భారత్ 40 ఓవర్లలో ఎనిమిది వికెట్ల నష్టానికి 240 పరుగులు మాత్రమే చేసింది. దీంతో తొమ్మిది పరుగులతో ఓటమి పాలైంది. సంజు శామ్సన్ (86 నాటౌట్: 63 బంతుల్లో, తొమ్మిది ఫోర్లు, మూడు సిక్సర్లు) ఎంత పోరాడినా ఫలితం లేకపోయింది. ఈ విజయంతో దక్షిణాఫ్రికా సిరీస్‌లో 1-0 ఆధిక్యం సాధించింది. రెండో వన్డే ఆదివారం రాంచీలో జరగనుంది.