IND vs SA T20 WC Final:టీ 20 ప్రపంచకప్ ఫైనల్ కోసం క్రికెట్ ప్రపంచం ఉత్కంఠగా ఎదురుచూస్తోంది. ఈ తుదిపోరులో గెలిచి రెండోసారి కప్పును ముద్దాడాలని రోహిత్ సేన..తొలిసారి ప్రపంచ కప్ గెలిచిన అనుభూతి రుచి చూడాలని మార్క్రమ్ సేన పట్టుదలగా ఉన్నాయి. అయితే ఈ మ్యాచ్‌కు వరుణుడి ముప్పు పొంచి ఉందన్న వార్తలు ఇరు జట్లతో పాటు అభిమానులను ఆందోళనకు గురిచేస్తున్నాయి. ఇప్పటికే భారత్ ఇంగ్లాండ్ మధ్య జరిగిన సెమీఫైనల్ మ్యాచ్‌కు కూడా వరుణుడు కాసేపు అడ్డుపడ్డాడు. ఇప్పటికే బార్బడోస్‌లో వర్షం పడే అవకాశాలు ఎక్కువగా ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. మేఘాలు కూడా 80 శాతం కమ్మేసి... కుమ్మేసేందుకు సిద్ధంగా ఉన్నట్లు తెలుస్తోంది. ఒకవేళ ఈ మ్యాచ్ రద్దయితే మాత్రం రోహిత్ సేనకు భారీ నష్టమే అని కూడా కొందరు అంచనాలు వేసేస్తున్నారు. ఇంతకీ ఈ మ్యాచ్ జరగకపోతే ఏమవుతుంది..? అయితే ఈ ఫైనల్ మ్యాచ్‌కు వర్షం అడ్డంకిగా మారితే పరిస్థితి ఏంటి... రిజర్వ్ డేకు మ్యాచ్ వాయిదా పడుతుందా..? ఐసీసీ రూల్స్ ఏం చెప్తున్నాయనే దానిపై ఇప్పుడు అభిమానులు తెగ చర్చించుకుంటున్నారు.
కుమ్మేయడం ఖాయమేనా..?
ఈ మ్యాచ్‌కు వరుణుడు అడ్డుపడే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయి. ఇప్పటికే బార్బడోస్ చేరుకున్న ఇరు జట్లు పైనల్లో తలపడేందుకు సిద్ధంగా ఉన్న వరుణుడు మాత్రం అసలు ఆ అవకాశం ఇస్తాడా లేదా అన్నదే ఇప్పుడు పెద్ద ప్రశ్నగా మారింది. మరికొద్ది గంటల్లోనే వరల్డ్ కప్ తుది సమరం ఆరంభం కానున్న వేళ ఏ టైమ్‌లో టైమ్ లో వర్షం కురవనుందనేది కూడా ఆసక్తిగా మారింది. ఇప్పటికే బార్బడోస్ లో తుపాను విరుచుకపడే అవకాశం ఉందని కూడా అక్కడి వాతావరణ శాఖ అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. 80శాతం మేఘాలు బార్బడోస్‌ను కమ్మేసిన వేళ వరుణుడు ఏ క్షణంలోనైనా మ్యాచ్‌కు అడ్డుపడే అవకాశాలు చాలా ఎక్కువ శాతం ఉన్నట్లు కూడా అక్కడి అధికారులు అంచనా వేస్తున్నారు.
రిజర్వ్ డే ఉన్నా ఆందోళనే
భారత్-దక్షిణాఫ్రికా మధ్య జరిగే ఫైనల్‌కు రిజర్వ్ డే ఉంది. ఒకవేళ ఈరోజు వర్షం పడినా మ్యాచ్ రేపు నిర్వహించవచ్చు. ఈ మ్యాచ్‌లో భారీ వర్షం కురిస్తే మాత్రం ఇరు జట్లు పది ఓవర్లు బ్యాటింగ్ చేస్తేనే డక్ వర్త్ లూయిస్ పద్ధతిలో విజేతను నిర్ణయిస్తారు. వర్షం పడితే కనీసం పది ఓవర్లు బ్యాటింగ్ చేసే పరిస్థితి అసలు ఉంటుందా లేదా అన్నది చూడాలి. వర్షం పడి మ్యాచ్ ఆగితే మళ్లీ నిర్వహించేందుకు 190 నిమిషాల అదనపు సమయాన్ని కూడా నిర్వాహకులు కేటాయించారు. ఒకవేళ వర్షం వల్ల మ్యాచ్ ఆలస్యమైతే సాయంత్రం కానీ, రాత్రి కానీ మ్యాచ్‌ను కొనసాగించ వచ్చేమో అంచనా వేస్తారు. ఒకవేళ అది సాధ్యం కాకపోతే మ్యాచ్ రేపటికి వాయిదా వేస్తారు. రేపు కూడా ఉదయం నుంచి సాయంత్రం వరకూ మ్యాచ్ నిర్వహించేందుకు ప్రయత్నిస్తారు. రేపు కూడా 190నిమిషాల అదనపు సమయం ఉంటుంది. అప్పటికి కూడా 10ఓవర్ల మ్యాచ్ నిర్వహించే అవకాశం లేకపోతే టీమిండియా, సౌతాఫ్రికాలను సంయుక్త విశ్వ విజేతలుగా ప్రకటిస్తారు. అయితే వర్షం పడకుండా మ్యాచ్ జరగాలని ఈ రెండు జట్లు భీకరంగా తలపడాలని అభిమానులు మొక్కు కుంటున్నారు. అయితే ఈసారి భీకర ఫామ్‌లో ఉన్న ఇండియా విశ్వ విజేతగా నిలుస్తుందన్న అంచనాలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో మ్యాచ్ జరిగి రోహిత్ సేన ప్రపంచకప్ ముద్దాడాలని ప్రతీ ఒక్కరూ కోరుకుంటున్నారు.