Virat Kohli: ఐసీసీ టీ 20 ప్రపంచకప్‌నకు ముందు విరాట్‌ కోహ్లీపై ఐసీసీ చేసిన ఓ పోస్ట్‌ ఇప్పుడు నెట్టింట వైరల్‌గా మారింది. ఐసీసీ చేసిన విరాట్‌ కోహ్లీ పోస్ట్‌పై ఇంగ్లాండ్ బౌలర్‌ స్టువర్ట్ బ్రాడ్‌.. తొలుత వ్యంగ్యస్త్రాలు సంధించాడు. ఆ తర్వాత అభిమానుల దాడి ఊహించి ఆ పోస్ట్‌ను డిలీట్‌ చేశాడు.  

 

ఇంతకీ ఆ పోస్ట్ ఏంటంటే

విరాట్ కోహ్లీ కింగ్‌లా ఓ సింహాసనంలో కూర్చున్న ఫొటోను ఐసీసీ తన ఇన్‌ స్టా పేజీలో పోస్ట్‌ చేసింది. విరాట్‌ కోహ్లీ ప్రస్థానాన్ని సూచిస్తున్నట్లుగా వెనక కోహ్లీ ఫొటోలను ఉంచింది. విరాట్‌ బ్యాట్‌ పట్టుకున్నట్లుగా ఒక ఫొటో... నడిచివస్తున్నట్లుగా ఇంకోటి ఇలా ఆ ఫొటోను పోస్ట్ చేసిన ఐసీసీ ఆసక్తికర క్యాప్షన్‌ కూడా ఇచ్చింది. రాజు కిరీటంలో చివరి ఆభరణం మిస్సైందని.. ఈ టీ 20 ప్రపంచకప్‌ అనే కలికితురాయిని తన కిరీటంలో చేర్చుకునేందుకు కింగ్‌ కేవలం అడుగు దూరంలోనె ఉన్నాడని అర్థం వచ్చేలా ఐసీసీ పోస్ట్‌ చేసింది . ఐసీసీ చేసిన ఈ పోస్ట్‌పై ఇంగ్లాండ్‌ బౌలర్‌ స్టువర్ట్‌ బ్రాడ్‌ వెంటనే రిప్లై ఇచ్చాడు. ఆ రిప్లై కోహ్లీని ఎగతాళి చేసేలా ఉండడం ఇప్పుడు కలకలం రేపుతోంది. కోహ్లీని ఎగతాళి చేస్తూ ఈ ప్రపంచకప్‌లో కింగ్‌ వైఫల్యాన్ని గుర్తు చేస్తూ బ్రాడ్‌ పోస్ట్ చేశాడు. ఇండియన్ ప్రీమియర్ లీగ్‌లో కోహ్లీ 17 ఏళ్ల ట్రోఫీ కరువును సూచిస్తూ ఆ కలికితురాయి ఐపీఎలా అంటూ బ్రాడ్ పోస్ట్‌ చేశాడు. అలా స్పందించిన బ్రాడ్‌ కాసేపటికే ఆ పోస్ట్‌ను డిలీట్‌ చేశాడు. కానీ  అప్పటికే చాలామంది ఐసీసీ పోస్ట్‌ను స్క్రీన్‌ షాట్‌ తీసి నెట్టింట వైరల్‌ చేసేశారు. సెమీఫైనల్లో ఓడిపోయిన అక్కస్సుతో బ్రాడ్‌ ఇలాంటి కామెంట్స్‌ చేస్తున్నాడని కింగ్‌ అభిమానులు మండిపడుతున్నారు. యువరాజ్‌ కొట్టిన ఆరు సిక్సర్లు మర్చిపోయావా బ్రాడ్‌ అంటూ ప్రశ్నిస్తున్నారు. ఈ ప్రపంచకప్‌ ఫైనల్లో విరాట్‌ చెలరేగడం పక్కా అని... ఆ రాజు కిరీటంలో మరో ఆభరణం చేరడం కూడా పక్కా అని మరికొందరు కామెంట్లు చేస్తున్నారు.

 

కోహ్లీ జూలు విదిలిస్తే...

విరాట్ కోహ్లీ ఈ టీ 20 ప్రపంచకప్‌లో ఏడు ఇన్నింగ్స్‌ల్లో కేవలం 75 పరుగులే చేశాడు. సూపర్ ఎయిట్‌లో బంగ్లాదేశ్‌పై 37 పరుగులే కోహ్లీ అత్యధికం. 2007లో MS ధోని నేతృత్వంలో భారత్‌ T20 ప్రపంచ కప్ ట్రోఫీని గెలుచుకుంది. అప్పటికీ కోహ్లీ అంతర్జాతీయ క్రికెట్‌లోకి అరంగేట్రం చేయలేదు. 2014లో ఐసీసీ టీ 20 ప్రపంచకప్‌ ట్రోఫీని కైవసం చేసుకునే అవకాశం కోహ్లీకి లభించింది. అయితే ఫైనల్లో భారత్ శ్రీలంక చేతిలో ఓడిపోయింది. 2016లో స్వదేశంలో జరిగిన సెమీఫైనల్‌లో వెస్టిండీస్‌తో జరిగిన మ్యాచ్‌లోనూ భారత్ ఓడిపోయింది. ఇక 2022లో సెమీస్‌లో జోస్ బట్లర్ సేన చేతిలోనూ భారత్‌ ఓడిపోయింది. అయితే 2011 వన్డే ప్రపంచ కప్‌ను,  2013 ఛాంపియన్స్ ట్రోఫీని గెలిచిన జట్టులో కోహ్లీ సభ్యుడిగా ఉన్నాడు. ఈ ఏడాది ఐపీఎల్‌లో కోహ్లీ 15 ఇన్నింగ్స్‌లలో 741 పరుగులు చేసి ఆరెంజ్ క్యాప్‌ను గెలుచుకున్నాడు. ఇక  బార్బడోస్‌లో జరిగే ఫైనల్‌లో కోహ్లీ టాప్ గేర్‌ను అందుకుంటే చూడాలని అభిమానులు వేయి కళ్లతో ఎదురుచూస్తున్నారు.