Shafali Varma Hits Maiden Double Century In First Test: దక్షిణాఫ్రికా(SA)తో జరుగుతున్న ఏకైక టెస్ట్‌ మ్యాచ్‌లో భారత మహిళలు అదరగొట్టారు.  తొలి రోజే రికార్డుల మీద రికార్డులు సృష్టించారు. లేడీ సెహ్వాగ్‌ షెఫాలీ వర్మ(Shafali Varma)విధ్వంసానికి తోడు స్మృతి మంధాన( Smriti ) కళాత్మక ఇన్నింగ్స్ తోడు కావడంతో దక్షిణాఫ్రికా బౌలర్లు పూర్తిగా తేలిపోయారు. టీమిండియా ఓపెనర్లు భారీ స్కోరుకు బాటలు వేశారు. షెఫాలీ అద్భుత డబుల్ సెంచరీతో చెలరేగగా... స్మృతి మంధాన కూడా శతకొట్టింది. దీంతో తొలిరోజే భారత జట్టు నాలుగు వికెట్ల నష్టానికి 525 పరుగులు చేసింది. వుమెన్స్‌ క్రికెట్‌లో ఒకేరోజూ అత్యధిక పరుగులు చేసిన జట్టుగా భారత మహిళల జట్టు చరిత్ర సృష్టించింది. మహిళా క్రికెట్‌ చరిత్రలో అత్యధిక పరుగుల భాగస్వామ్యం నెలకొల్పిన ఓపెనింగ్ జోడిగానూ షెఫాలీ వర్మ-స్మృతి మంధాన చరిత్ర సృష్టించారు. ఇలా తొలి రోజే ఎన్నో రికార్డులు సృష్టించిన టీమిండియా... భారీ విజయానికి బాటలు వేసుకుంది. 





 

మెరిసిన షెఫాలీ-మంధాన 

ఈ మ్యాచ్‌లో టాస్‌ గెలిచిన టీమిండియా(India W) మరో ఆలోచన లేకుండా బ్యాటింగ్ ఎంచుకుంది. తొలి ఓవర్‌ నుంచే దక్షిణాఫ్రికా(SA W) బౌలర్లపై  షెఫాలీ వర్మ-స్మృతి మంధాన జోడి పూర్తి ఆధిపత్యం ప్రదర్శించింది. పూర్తిగా వన్డే తరహాలో బ్యాటింగ్‌ చేసిన ఈ జోడీ ప్రొటీస్‌ బౌలర్లకు ఏ మాత్రం అవకాశం ఇవ్వలేదు. తొలి వికెట్‌కు వీరిద్దరూ కలిసి 292 పరుగుల భారీ స్కోరు నమోదు చేశారు. వుమెన్స్‌ టెస్ట్‌ క్రికెట్‌లో ఇదే అత్యధిక ఓపెనింగ్‌ జోడి కావడం విశేషం. 14 ఓవర్లలో 50 పరుగులు జోడించిన ఈ జోడి.. ఆ తర్వాత మరింత వేగంగా ఆడింది. 33 పరుగుల వద్ద మంధాన ఇచ్చిన క్యాచ్‌ను మిడ్‌వికెట్‌ వద్ద మారిజానే జారవిడిచింది. ఈ క్యాచ్‌ మిస్‌ చేసి ప్రొటీస్‌ తగిన మూల్యం చెల్లించుకుంది. క్రీజులో కుదురుకున్నాక మంధాన వన్డే తరహాలో చెలరేగింది. కేవలం 78 బంతుల్లో 10 ఫోర్లతో మంధాన 50 పరుగులను పూర్తి చేసుకుంది. 25 ఓవర్లలో టీమిండియా 100 పరుగుల మైలురాయిని దాటింది. ఈ క్రమంలో షెఫాలీ వర్మ కూడా 66 బంతుల్లోనే అర్ధ శతకం సాధించింది. వీరిద్దరూ ఎంతకీ వికెట్‌ ఇవ్వకపోవడంతో దక్షిణాఫ్రికా బౌలర్లు పూర్తిగా అలసిపోయారు. ఏడుగురు బౌలర్లు బౌలింగ్ చేసినా  షెఫాలీ వర్మ-స్మృతి మంధాన జోడిని విడదీయలేకపోయారు. ఒక్క వికెట్‌ నష్టపోకుండా 130 పరుగులు చేసి టీమిండియా లంచ్‌కు వెళ్లింది.

 

లంచ్‌ తర్వాత అదే ఊపు

లంచ్ తర్వాత కూడా  షెఫాలీ వర్మ-స్మృతి మంధాన ఈ జోడి ఏ మాత్రం వెనక్కి తగ్గలేదు. 31 ఓవర్లలోనే టీమిండియా 150 పరుగులు చేసింది. మొదటగా షెఫాలీ వర్మ 113 బంతుల్లో 15 ఫోర్లు, 2 సిక్సర్లతో శతకం సాధించింది. ఆ తర్వాత కాసేపటికే స్మృతి మంధాన కూడా సెంచరీ చేసింది. 122 బంతుల్లో 19 ఫోర్లతో మంధాన సెంచరీ చేసింది. మంధానకు టెస్టుల్లో ఇది మూడో సెంచరీ కావడం విశేషం. అనంతరం వీరిద్దరూ మరింత దూకుడు పెంచారు. అయితే 292 పరుగుల వద్ద మంధాన అవుటైంది. 161 బంతుల్లో 149 పరుగులు చేసిన మంధానను టక్కర్‌ అవుట్‌ చేసింది. భారత ఓపెనింగ్ జోడిని విడగొట్టేందుకు దక్షిణాఫ్రికా బౌలర్లకు 52 ఓవర్లు పట్టింది. ఆ తర్వాత కూడా షెఫాలీ విధ్వంసం కొనసాగింది. 194 బంతుల్లో 22 ఫోర్లు, ఎనిమిది సిక్సులతో షెఫాలీ డబుల్‌ సెంచరీ పూర్తి చేసుకుంది. షెఫాలీ ద్వి శతకంతోనే టీమిండియా స్కోరు కూడా 400 పరుగులు దాటింది. డబుల్‌ సెంచరీ పూర్తి చేసుకున్న కాసేపటికే షెఫాలీ రనౌట్ అయింది. మొత్తంగా 197 బంతులు ఆడిన షెఫాలీ 205పరుగులు చేసి పెవిలియన్‌ చేరింది. ఆ తర్వాత జెమిమా రోడ్రిగ్స్ 55 పరుగులు చేసి అవుటైంది. రోడ్రిగ్స్‌కు  టెస్టుల్లో ఇది మూడో అర్ధ శతకం కావడం విశేషం. ప్రస్తుతం హర్మన్‌ప్రీత్‌ కౌర్‌ 42, రిచా ఘోష్‌ 43 పరుగులతో క్రీజులో ఉన్నారు. దీంతో తొలిరోజు ఆట ముగిసే సమయానికి  భారత జట్టు నాలుగు వికెట్ల నష్టానికి 525 పరుగులు చేసింది.