South Africa National Cricket Team: టీ 20 ప్రపంచకప్‌(T20 World Cup)లో ఫైనల్‌ బార్బడోస్‌(Barbados)లో జరగనుంది. ఈ ప్రతిష్టాత్మక ట్రోఫీని ఎట్టి పరిస్థితుల్లో ముద్దాడాలని టీమిండియా-దక్షిణాఫ్రికా(Ind Vs SA) పట్టుదలతో ఉన్నాయి. తొలిసారి పొట్టి ప్రపంచకప్‌ను ముద్దాడాలని సఫారీలు... రెండోసారి ఆ కల నెరవేర్చుకోవాలని భారత జట్టు కసితో ఉన్నాయి. అయితే రేపు మ్యాచ్‌ ప్రారంభం కానుండగా ఇంకా ప్రొటీస్‌ క్రికెటర్లు మ్యాచ్‌ జరిగే వేదికకు చేరుకోలేదు. ఆరు గంటలుగా ట్రినిడాడ్‌ ఎయిర్‌పోర్ట్‌లోనే ప్రొటీస్‌ క్రికెటర్లు ఉన్నారని తెలుస్తోంది. దీంతో దక్షిణాఫ్రికా ఆటగాళ్లు ఫైనల్‌ జరిగే బార్బడోస్‌కు ఎప్పుడు చేరుకుంటారన్న దానిపై ఇంకా ఎలాంటి స్పష్టత రాలేదు.

 

ఇంతకీ ఏమైంది

టీ 20 ప్రపంచకప్‌ ఫైనల్‌ జరిగే బార్బడోస్‌లో ఎయిర్‌పోర్ట్ రన్‌వే మూసివేత వల్ల ఏ ఫ్లైట్‌ అక్కడ దిగేందుకు అవకాశం లేకుండా పోయింది. ఈ కారణంగా దక్షిణాఫ్రికా జట్టు.. ట్రినిడాడ్‌ విమానాశ్రయంలోనే ఉండాల్సివచ్చింది. బార్బడోస్‌లోని గ్రాంట్లీ ఆడమ్స్ విమానాశ్రయంలో చిన్న ప్రైవేట్ విమానం ల్యాండింగ్ వైఫల్యం కారణంగా నిలిచిపోయిందని విమానాశ్రయ అధికారులు తెలిపారు. దీంతో దక్షిణాఫ్రికా జట్టుతో సహా వారి కుటుంబాలు, కామెంటేటర్లు, మ్యాచ్ అధికారులు, ICC అధికారులు ట్రినిడాడ్ విమానాశ్రయంలోనే చిక్కుకుపోయారు. తనిఖీల కోసం బార్బడోస్ విమానాశ్రయాన్ని తాత్కాలికంగా మూసేశారు. సివిల్ ఏవియేషన్ అథారిటీ, బార్బడోస్ పోలీస్ సర్వీస్ అధికారులు ఎయిర్‌పోర్ట్‌లో తనిఖీలు నిర్వహిస్తున్నారు. ట్రినిడాడ్ నుంచి బయలుదేరేందుకు కొద్ది క్షణాల ముందు ఎయిర్‌పోర్ట్‌ రన్‌వే మూసివేత సమాచారం అందిందని దక్షిణాఫ్రికా క్రికెట్‌ జట్టు వర్గాలు తెలిపాయి.

 

ఎందుకు వెళ్లలేదంటే...

బార్బడోస్‌ గ్రాంట్లీ ఆడమ్స్ విమానాశ్రయంలో ఓ ప్రైవేట్ ఎయిర్‌క్రాఫ్ట్ ల్యాండింగ్‌ విఫలం కావడంతో ఒక్కసారిగా ఆగిపోయిందని అధికారులు తెలిపారు. ఈ ప్రైవేట్‌ జెట్‌ ఎయిర్‌పోర్ట్ రన్‌వే పైనే ఉందని బార్బడోస్‌ కార్పొరేట్ కమ్యూనికేషన్ స్పెషలిస్ట్ షర్లీన్ బ్రౌన్ తెలిపారు. విమానంలో ఉన్న ముగ్గురు వ్యక్తులు.. పైలట్ క్షేమంగా ఉన్నారని ఆమె వెల్లడించారు. ఈ ఘటనలో ట్రినిడాడ్ నుంచి బార్బడోస్ వెళ్లే విమానాలను రీషెడ్యూల్ చేశారు. దాదాపు ఆరు గంటలు ఆలస్యంగా విమానాలు ట్రినిడాడ్‌ నుంచి బార్బడోస్‌ వెళ్లనున్నాయి. దక్షిణాఫ్రికాతో పాటు శ్రీలంక, ఐర్లాండ్ ఆటగాళ్లు కూడా రాత్రంతా విమానాశ్రయంలోనే గడిపినట్లు తెలుస్తోంది. ఈ ప్రపంచకప్‌లో సెమీఫైనల్‌ ఆడటానికి ముందు ఆఫ్ఘానిస్తాన్ విమానం కూడా ఆలస్యం అయింది. దీంతో ఐసీసీ నిర్వహణపై క్రికెట్‌ ప్రేమికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. 

 

గత ప్రపంచకప్‌లకు భిన్నంగా...

సాధారణంగా టీ 20 ప్రపంచకప్‌ ఫైనల్‌కు ఆదివారం నిర్వహిస్తారు. అయితే విండీస్‌లో వాతావరణ పరిస్థితులు భిన్నంగా ఉండడంతో శనివారమే మ్యాచ్‌ను నిర్వహించాలని నిర్ణయించారు. ఒకవేళ వర్షం వల్ల మ్యాచ్‌ నిర్వహించడం సాధ్యం కాకపోతే రిజర్వ్ డే అయిన 30వతేదీ ఆదివారం నాడు మ్యాచ్‌ను నిర్వహించేలా షెడ్యూల్‌ రూపొందించారు.