India Vs South Africa Final T20 World Cup 2024: టీ 20 ప్రపంచకప్‌(T20 world cup)లో తుది సమరానికి టీమిండియా(India)సిద్ధమైంది. వన్డే ప్రపంచకప్‌ ఫైనల్‌ మిగిల్చిన బాధను మరిపించేందుకు రోహిత్ సేనకు సువర్ణ అవకాశం దక్కింది. టీ 20 వరల్డ్‌ కప్‌ టైటిల్‌ పోరుకు భారత జట్టు పక్కా వ్యూహంతో సిద్ధమైంది. ప్రపంచకప్‌ చరిత్రలో తొలిసారి ఫైనల్‌ చేరిన దక్షిణాఫ్రికా(SA)తో పోరుకు టీమిండియా సమాయత్తమైంది. రోహిత్‌, కోహ్లీలకు ఇదే చివరి టీ 20 ప్రపంచకప్‌ అని భావిస్తున్న వేళ ఎట్టి పరిస్థితుల్లో ఈ బంగారం లాంటి అవకాశాన్ని జార విచుచుకోవద్దని భారత జట్టు గట్టి పట్టుదలతో ఉంది. అయితే టీ 20 ప్రపంచకప్‌ చరిత్రలో తొలిసారి ఫైనల్‌ చేరి రికార్డు సృష్టించిన దక్షిణాఫ్రికా కూడా కప్పు కొట్టేయాలని కసిగా ఉంది. దీంతో ఈ మ్యాచ్‌ రసవత్తరంగా... ఉత్కంఠభరితంగా సాగనుంది.

 

రెండోసారి ముద్దాడేనా

2007లో దక్షిణాఫ్రికాలో జరిగిన తొలి T20 ప్రపంచ కప్ విజేతగా నిలిచింది. ఇప్పుడు రెండోసారి పొట్టి ప్రపంచకప్‌ను కైవసం చేసుకోవాలని రోహిత్‌ సేన ఉవ్విళ్లూరుతోంది. 2014లో ఫైనల్‌కు చేరుకున్న భారత్‌ తుది పోరులో శ్రీలంక చేతిలో ఓడిపోయింది. మరోవైపు దక్షిణాఫ్రికా ఏ ప్రపంచకప్‌లో అయినా మొదటిసారి ఫైనల్‌కు చేరుకుంది. గతంలో 2009, 2014లో రెండుసార్లు టీ 20 ప్రపంచకప్ సెమీ ఫైనల్ చేరిన దక్షిణాఫ్రికా రెండుసార్లు పరాజయంపాలైంది. ఇప్పటివరకూ ఈ రెండు జట్లు ఒక్క మ్యాచ్‌ కూడా ఓడిపోకుండా ఫైనల్‌ చేరాయి. అంటే ఈ మ్యాచ్‌లో ఏ జట్టు గెలిచినా అజేయంగా టీ20 ప్రపంచకప్ గెలిచిన తొలి జట్టుగా చరిత్ర సృష్టిస్తుంది. రోహిత్ శర్మ నేతృత్వంలోని భారత్ గ్రూప్ దశలో ఐర్లాండ్, చిరకాల ప్రత్యర్థి పాకిస్థాన్, ఆతిథ్య అమెరికా, కెనడాతో జరిగిన మ్యాచ్‌లో విజయం సాధించి ఈ మెగా టోర్నమెంట్‌లో పూర్తి ఆధిపత్యం చెలాయించింది. సూపర్ 8 దశలో బంగ్లాదేశ్, ఆఫ్ఘానిస్తాన్, ఆస్ట్రేలియాపై భారత్  అద్భుతమైన విజయాలు సాధించింది. సెమీ ఫైనల్‌లో 68 పరుగుల తేడాతో డిఫెండింగ్‌ ఛాంపియన్‌ ఇంగ్లండ్‌ను మట్టికరిపించి ఫైనల్ చేరింది. కెప్టెన్ రోహిత్ శర్మ T20 ప్రపంచ కప్ 2024లో భారతదేశం తరపున అత్యధిక పరుగులు చేసిన బ్యాటర్‌గా నిలిచాడు.  మరో ఓపెనర్‌ విరాట్‌ కోహ్లీ పరుగులు చేసేందుకు ఇబ్బంది పడుతున్నాడు. భారత బౌలర్లు అర్ష్‌దీప్ సింగ్, జస్ప్రీత్ బుమ్రా, స్పిన్నర్లు అక్షర్ పటేల్, కుల్దీప్ యాదవ్ అద్భుత బౌలింగ్‌తో ప్రత్యర్థి బ్యాటర్లను ముప్పు తిప్పలు పెడుతున్నారు. ఈ మ్యాచ్‌లోనూ భారత బౌలర్ల నుంచి ప్రొటీస్‌ బ్యాటర్లకు ప్రమాదం పొంచి ఉంది.

 

ప్రొటీస్‌ కూడా అజేయంగా...

దక్షిణాఫ్రికా గ్రూప్ దశలో నెదర్లాండ్స్, నేపాల్, బంగ్లాదేశ్‌పై ఘన విజయాలు సాధించింది. సూపర్ 8లో అమెరికాపై ఘన విజయం సాధించగా.. ఇంగ్లాండ్‌, విండీస్‌పైనా విజయాలు సాధించింది. సెమీస్‌లో ఆఫ్ఘానిస్తాన్‌ను తొమ్మిది వికెట్ల తేడాతో ఓడించి తొలిసారి ఫైనల్‌లోకి ప్రవేశించింది. దక్షిణాఫ్రికా తరపున క్వింటన్ డి కాక్ టోర్నమెంట్‌లో అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా ఉన్నాడు. అన్రిచ్ నార్ట్జే ఎక్కువ వికెట్లు తీశాడు.