Quinton De Kock Records Against India: క్రికెట్‌ ప్రపంచంలో నాకౌట్‌ మ్యాచుల్లో ఓడిపోతే అనుభవించే బాధ గురించి సౌతాఫ్రికా జట్టుకు తెలిసినంతగా మరో జట్టుకు తెలియదంటే అతిశయోక్తి కాదు. ఎందుకంటే 1992లో క్రికెట్‌లో పునరాగమనం చేసినప్పటి నుంచి ఆ జట్టు ఏడుసార్లు సెమీఫైనల్స్‌లో ఓడింది.  1992, 1999, 2007, 2009, 2014, 2015, 2023లో జరిగిన ప్రతి ప్రపంచకప్ సెమీఫైనల్స్‌లో సఫారీలు ఓడారు. 2015 ప్రపంచకప్ సెమీస్‌ల ఓడడం తన కెరీర్‌లోనే అత్యంత బాధకరమైన విషయమని సఫారీ సీమర్‌ డేల్‌ స్టెయిన్‌ తెగ బాధపడిపోయాడు. అయితే ఈ ఏడు ప్రపంచకప్‌ సెమీస్‌లో మూడు సెమీఫైనల్స్‌లో క్వింటన్ డి కాక్ సభ్యుడిగా ఉన్నాడు. ఇప్పుడు డికాక్‌ ప్రపంచకప్ ఫైనల్‌లో ఉన్నాడు. బాగా తెలిసిన ప్రత్యర్థి భారత్‌పై ఫైనల్లో తలపడేందుకు సిద్ధమయ్యాడు. ఇక తన కెరీర్‌లో చివరి ప్రపంచకప్‌గా భావిస్తున్న వేళ డికాక్‌ ఎలాంటి ప్రదర్శన చేస్తాడో అని ఆ దేశ అభిమానులు ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు. అయితే డికాక్‌కు చేసిన రికార్డులన్నీ దాదాపుగా భారత్‌పైనే ఎక్కువగా ఉన్నాయి. 

 

డికాక్‌తోనే ముప్పు..

2014లో భారత్‌ చేతిలో సెమీస్‌లో సౌతాఫ్రికా ఓడిపోయింది.  ఆ మ్యాచ్‌ జరిగే సమయంలో డికాక్‌ వయసు 21 ఏళ్లు. ఆ సెమీస్‌లో డికాక్‌ మంచి టచ్‌లో ఉన్నట్లు కనిపించాడు. కానీ ధోనీ వ్యూహాల ముందు డికాక్‌ పప్పులు ఉడకలేదు. భువనేశ్వర్ కుమార్ బౌలింగ్‌లో డికాక్‌ అవుటై నిరాశగా వెనుదిరిగాడు. ఇప్పుడు డికాక్‌ వయసు 31 ఏళ్లు. టీ20ల్లో డికాక్‌ అత్యధిక సగటు, అత్యధిక స్కోరు, అత్యధిక అర్ధసెంచరీలు ఇవన్నీ భారత్‌పైనే వచ్చాయి. ఈ మెగా టోర్నమెంట్‌లో ఇంగ్లండ్‌పై డికాక్‌ 38 బంతుల్లో 65 పరుగులు చేసి మెరుపు ఇన్నింగ్స్‌ ఆడాడు. 2022లో బార్బడోస్‌లో డికాక్‌కు లీగ్‌ మ్యాచుల్లో ఆడిన అనుభవం ఉంది.  తాను కరేబియన్ లీగ్‌లో బార్బడోస్‌లో మ్యాచ్‌ ఆడానని... ఇక్కడి పిచ్‌ భిన్నంగా ఉంటుందని... ఈ పిచ్‌పై 160-170 స్కోర్లు సురక్షితమని డికాక్‌ తెలిపాడు. పవర్‌ప్లేలో పరుగులు భారీగా వస్తాయని కూడా డికాక్‌ అంచనా వేశాడు. బంతి పాతబడుతున్నా కొద్దీ పరుగులు రావడం కష్టంగా మారుతుందని డికాక్‌  తెలిపాడు. 

 

గత రికార్డులు ఇలా

భారత్, దక్షిణాఫ్రికా జట్లు టీ 20ల్లో ఇప్పటివరకూ 26 మ్యాచుల్లో తలపడ్డాయి. ఇందులో భారత్ 14 విజయాలతో పైచేయి సాధించగా ప్రోటీస్ 11 విజయాలు సాధించింది. ఒక మ్యాచ్ ఫలితం లేకుండా ముగిసింది. టీ20 ప్రపంచకప్‌లో భారత్, దక్షిణాఫ్రికా జట్లు ఆరుసార్లు తలపడ్డాయి. ఇందులో భారత క్రికెట్ జట్టు నాలుగు మ్యాచ్‌లు గెలుపొందగా, ప్రోటీస్ కేవలం రెండు విజయాలు మాత్రమే సాధించింది. గత డిసెంబర్‌లో జరిగిన మూడు మ్యాచ్‌ల T20 సిరీస్‌లో ఇరు జట్లు చివరిసారిగా తలపడ్డాయి. ఈ సిరీస్‌లో మొదటి మ్యాచ్‌ రద్దవ్వగా మిగిలిన రెండు మ్యాచులను చెరొకటి గెలిచి సిరీస్‌ను సమం చేశాయి.