IND vs SA T20 WC Final: మరి కాసేపట్లోనే టీ 20 ప్రపంచకప్(T20 WC Final) మహా సమరం జరగబోతోంది. ఈ మహా సంగ్రామానికి దక్షిణాఫ్రికా- టీమిండియా(India vs South Africa) పూర్తిగా సన్నద్ధమయ్యాయి. ఈ మెగా టోర్నీలో ఇప్పటివకూ అజేయంగా నిలిచిన ఇరు జట్లు.. చివరి మ్యాచ్‌లోనూ గెలిచి టైటిల్ సాధించి ప్రపంచకప్ ప్రయాణాన్ని సంతృప్తిగా ముగించాలని పట్టుదలతో ఉన్నాయి.
టీమిండియా హెడ్ కోచ్ రాహుల్ ద్రవిడ్, కెప్టెన్ రోహిత్ శర్మ, స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ ఒక ఏడాది వ్యవధిలోనే మూడోసారి ఐసీసీ టోర్నమెంట్ ఫైనల్లో పాల్గొంటున్నారు. వన్డే ప్రపంచకప్, ప్రపంచ టెస్ట్ ఛాంపియన్‌షిప్‌లో నిరాశపరిచిన భారత జట్టు ఈసారి మాత్రం అందివచ్చిన అవకాశాన్ని వదులుకోవద్దన్న కృత నిశ్చయంతో ఉంది. టీ 20 ప్రపంచకప్ గెలిచి తాము విశ్వ విజేతలమని చాటి చెప్పేందుకు రోహిత్ సేన సిద్ధంగా ఉంది. అయితే టీమిండియా ఆశలపై నీళ్లు చల్లి తొలిసారి ప్రపంచకప్ గెలవాలని ఐడెన్ మార్క్రమ్ సేన కూడా అంతే పట్టుదలగా ఉంది.
పిచ్ ఎలా ఉంటుందంటే..
బార్బడోస్‌లో ఫైనల్ జరిగే కెన్సింగ్టన్ ఓవల్ పిచ్ సీమర్లకు అనుకూలంగా ఉంటుంది. ఈ పిచ్‌పై సీమర్లు 20.22 సగటుతో 59 వికెట్లు నేలకూల్చారు. ఈ మ్యాచ్‌కు వర్షం ముప్పు కూడా పొంచి ఉండడంతో పిచ్ మరింతగా బౌలర్లకు అనుకూలంగా ఉంటుందన్న అంచనాలు ఉన్నాయి. అయితే బంతి బ్యాట్‌పైకి వస్తుందని కాస్త ఓపిగ్గా ఆడితే భారీ స్కోర్లు నమోదయ్యే అవకాశం ఉంది. పిచ్ పూర్తిగా బ్యాటింగ్‌కు స్వర్గధామం కానప్పటికీ బ్యాట్స్‌మెన్లు కాస్త ఓపిగ్గా ఆడితే మంచి స్కోరు చేయగలరు. కెన్సింగ్టన్ ఓవల్ పిచ్‌పై 2024లో ఎనిమిది మ్యాచ్‌లు జరిగాయి. ఇందులో మొదట బ్యాటింగ్ చేసిన జట్లు మూడు సార్లు.... రెండోసారి బ్యాటింగ్ చేసిన జట్లు మూడుసార్లు గెలిచాయి. ఒక మ్యాచ్ సూపర్ ఓవర్ వరకూ జరిగింది. మరో మ్యాచ్‌లో ఫలితం రాలేదు. ఈ వేదికపై మొదటి ఇన్నింగ్స్‌లో సగటు స్కోరు 151 కాగా... రెండో ఇన్నింగ్స్ సగటు స్కోరు 134. కెన్సింగ్టన్ ఓవల్‌లో ఇంగ్లాండ్‌పై ఆస్ట్రేలియా నమోదైన అత్యధిక స్కోరు చేసింది. ఆ మ్యాచ్‌లో ఆస్ట్రేలియా 201 పరుగులు చేసింది. ఇంగ్లండ్‌పై అమెరికా అత్యల్ప స్కోరు 115 పరుగులు నమోదు చేసింది.
జట్టు ఎలా ఉంటుందంటే..?
పిచ్ ఆరంభంలో బౌలర్లకు ఆ తర్వాత బ్యాటర్లకు అనుకూలించే అవకాశం ఉంది. కాబట్టి రెండు జట్లు బ్యాటింగ్ ఆర్డర్‌లో ఎలాంటి మార్పులు లేకుండా బరిలోకి దిగే అవకాశం ఉంది. భారత కెప్టెన్ రోహిత్ శర్మ, పంత్, సూర్య కీలకంగా మారనున్నారు. కోహ్లీ కూడా నిలబడితే టీమిండియాకు అదనపు బలం వచ్చేసినట్లే. 7 మ్యాచ్‌ల్లో 248 పరుగులు చేసి రోహిత్ మంచి ఫామ్‌లో ఉన్నాడు. బుమ్రా 7 మ్యాచ్‌ల్లో 13 వికెట్లు పడగొట్టి అంచనాలు పెంచేశాడు. క్వింటన్ డి కాక్ ఫామ్‌లోకి వచ్చేశాడు. 8 మ్యాచ్‌ల్లో 204 పరుగులు చేసి మంచి స్వింగ్‌లో ఉన్నాడు.
భారత జట్టు: రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, రిషబ్ పంత్, సూర్యకుమార్ యాదవ్, హార్దిక్ పాండ్యా, రవీంద్ర జడేజా, శివమ్ దూబే, అక్షర్ పటేల్, అర్ష్దీప్ సింగ్, కుల్దీప్ యాదవ్, జస్ప్రీత్ బుమ్రా
దక్షిణాఫ్రికా జట్టు: క్వింటన్ డి కాక్ , రీజా హెండ్రిక్స్, ఐడెన్ మార్క్రామ్, ట్రిస్టన్ స్టబ్స్, హెన్రిచ్ క్లాసెన్, డేవిడ్ మిల్లర్, మార్కో జాన్సెన్, కేశవ్ మహరాజ్, కగిసో రబడ, అన్రిచ్ నోర్ట్జే, తబ్రైజ్ షమ్సీ
చూడాల్సిన ఆటగాళ్లు...
బ్యాటర్లు: రోహిత్ శర్మ, కోహ్లీ, డేవిడ్ మిల్లర్, డికాక్
ఆల్ రౌండర్లు: అక్షర్ పటేల్, హార్దిక్ పాండ్యా
బౌలర్లు: జస్ప్రీత్ బుమ్రా, తబ్రైజ్ షమ్సీ, అన్రిచ్ నార్ట్జే, అర్ష్దీప్ సింగ్