టీ 20 ప్రపంచకప్ తుది సమరానికి సర్వం సిద్ధమైంది. తుది సమరానికి భారత్- దక్షిణాఫ్రికా సిద్ధమయ్యాయి. వరుణుడు అడ్డు తగలకుండా ఈ మ్యాచ్ పూర్తి కావాలని అభిమానులు కోరుకుంటున్నారు. అయితే ఈ మ్యాచ్‌లో గెలిచి విశ్వ విజేతలుగా నిలిచిన వారికి భారీగా ప్రైజ్ మనీ దక్కనుంది. గత టీ 20 ప్రపంచకప్ ప్రైజ్ మనీతో పోలిస్తే ఈ సారి రెట్టింపు ప్రైజ్ మనీ జట్లకు దక్కనుంది. పొట్టి ప్రపంచకప్ విశ్వ విజేతలుగా నిలిచిన వారికి ఎంత ప్రైజ్ మన్నీ దక్కుతుందో తెలిస్తే ఆశ్చర్యపోవాల్సిందే.
ప్రైజ్‌మనీ ఎంతంటే..?
టీ 20 ప్రపంచకప్ మెగా టోర్నమెంట్‌లో విజేతలుగా నిలిచిన వారిపై... రన్నరప్‌గా నిలిచిన వారిపైనా కోట్ల వర్షం కురవనుంది. టీ 20 ప్రపంచ కప్ 2024 ప్రారంభానికి ముందే అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ టైటిల్ విన్నర్స్‌కు ఎంత ప్రైజమనీ దక్కుతుందో వెల్లడించింది. కేవలం విశ్వ విజేతలకేకాక... రన్నరప్‌గా నిలిచిన వారికి.. సూపర్ ఎయిట్‌కు అర్హత సాధించిన వారికి... కూడా ప్రైజ్ మనీని ప్రకటించింది. ఈ మెగా టోర్నమెంట్ కోసం మొత్తం 11.25 మిలియన్ల అమెరికా డాలర్ల ప్రైజ్ మనీని ఐసీసీ ప్రకటించింది. అంటే మన కరెన్సీలో అక్షరాల రూ.93.5 కోట్ల రూపాయలు. 2022లో జరిగిన ప్రపంచ కప్‌తో పోలిస్తే ఈసారి ప్రైజ్ మనీని ఐసీసీ రెట్టింపు చేసింది. రెండేళ్ల క్రితం జరిగిన టీ 20 ప్రపంచకప్‌లో ప్రైజ్ మనీగా రూ. 46.6 కోట్లు ఇచ్చిన ఐసీసీ ఈసారి మాత్రం 93 కోట్ల రూపాయాలు కేటాయించింది. 2022 ప్రపంచకప్ గెలిచిన ఇంగ్లాండ్‌కు అప్పుడు 46 కోట్లలో 13.3 కోట్లు అందించారు.
టైటిల్ విన్నర్‌కు ఎంతంటే..?
2024 టీ 20 ప్రపంచకప్‌లో గెలిచిన జట్టుకు ఈసారి దాదాపు 20 కోట్ల రూపాయలు అందనున్నాయి. ఈ మెగా టోర్నీ తుది సమరంలో టీమిండియా-దక్షిణాఫ్రికా తలపడనున్నాయి. ఈ తుదిపోరులో విజేతగా నిలిచే జట్టుకు భారత కరెన్సీలో దాదాపు రూ. 20.4 కోట్ల ప్రైజ్ మనీ దక్కనుంది. రన్నరప్‌గా నిలిచిన జట్టుకు ఇందులో సగం ప్రైజ్ మనీని అందిస్తారు. రన్నరప్ జట్టుకు రూ.10.6 కోట్ల ప్రైజ్ మనీ ఇస్తారు. ఈ ప్రపంచకప్‌లో చివరి స్థానంలో నిలిచిన జట్లకు కూడా ప్రైజ్ మనీ ఇస్తారు. సెమీ ఫైనల్‌లో ఓడిన రెండు జట్లు కూడా రూ. 6.5 కోట్లు అందుకోబోతున్నాయి. సూపర్-8 దశను దాటన జట్లకు కూడా ఐసీసీ ప్రైజ్ మనీ అందివ్వనుంది. సూపర్-8కు చేరుకుని సెమీస్‌కు రాని ఒక్కో జట్టుకు రూ.3.19 కోట్ల ప్రైజ్ మనీని ఇస్తారు. గ్రూప్ దశలో నిష్క్రమించిన 12 జట్లకు కూడా ఈ టోర్నమెంట్‌తో ప్రయోజనం చేకూరనుంది. గ్రూప్ దశలో మూడో స్థానంలో నిలిచిన ఒక్కో జట్టుకు రూ.2.5 కోట్లు ఇస్తారు. పాయింట్ల ఆధారంగా 13 నుంచి 20వ స్థానంలో నిలిచిన జట్లకు ఒక్కో టీమ్‌కు రూ.1.87 కోట్లు ఇవ్వనున్నారు.
ఒక్క మ్యాచ్ గెలిస్తే రూ.26 లక్షలు
ఈ వరల్డ్ కప్‌లో ఒక మ్యాచ్ గెలిచిన జట్లకు ప్రత్యేకంగా రూ. 26 లక్షలు ఇస్తామని ఐసీసీ ఇప్పటికే ప్రకటించింది. ఒక జట్టు టోర్నమెంట్‌లో ఒక విజయాన్ని మాత్రమే నమోదు చేసినా ప్రైజ్ మనీ కాకుండా విడిగా రూ. 26 లక్షల ప్రైజ్ మనీ ఇస్తారు. 2 మ్యాచ్‌లు గెలిచిన జట్టుకు ప్రత్యేకంగా రూ.52 లక్షలు ఇస్తామని ఐసీసీ వెల్లడించింది.