Be careful of these Five Players: కోట్లాది మంది అభిమానుల అంచనాలను మోస్తూ... టీమిండియా(IND) టైటిల్‌ పోరుకు సిద్ధమైంది. పట్టుబట్టి.. దక్షిణాఫ్రికా(SA)ను పడగొట్టి... టైటిల్‌ ఒడిసిపట్టి... దశాబ్దం నాటి కలను సాకారం చేసుకోవాలని రోహిత్ సేన గట్టి పట్టుదలతో ఉంది. ఈ మెగా టోర్నమెంట్‌లో ఇప్పటివరకూ ఒక్క మ్యాచ్‌ కూడా ఓడిపోని రోహిత్‌ సేన... ఆ సంప్రదాయాన్ని ఫైనల్లోనూ కొనసాగించి విశ్వ విజేతలుగా నిలవాలని కసితో ఉంది. బలమైన జట్టుకు రోహిత్‌ శర్మ సారథ్యం కూడా తోడు కావడంతో ఇప్పుడు అగ్నికు ఆయువు తోడైంది. ఇక జరగాల్సింది. దక్షిణాఫ్రికా దహనమే. కెప్టెన్సీలో తాను హిట్‌ అని ఇప్పటికే నిరూపించుకున్న రోహిట్‌... ఇప్పుడు తన కెరీర్‌లోనే కీలక సమరానికి సిద్ధమయ్యాడు. అయితే ఈ మ్యాచ్‌లో అయిదుగురు ఆటగాళ్లపైనే అందరి దృష్టీ కేంద్రీకృతమై ఉంది. ఆ అయిదుగురు ఎవరంటే...?


 

రోహిత్ శర్మ (Rohit Sharma)

టీ20 ప్రపంచకప్ చరిత్రలో అత్యంత ప్రమాదకరమైన బ్యాటర్‌లలో టీమిండియా సారధి రోహిత్‌ శర్మ ముందు వరుసలో ఉంటాడు. వన్డే ప్రపంచకప్‌లో ఆస్ట్రేలియా చేతిలో ఎదురైన పరాజయాన్ని రోహిత్ శర్మ ఇంకా మరిచిపోలేదు. భారత కెప్టెన్ ఇప్పటికే బ్యాట్‌తోనూ ప్రత్యర్థి జట్లను చిత్తు చేశాడు. గత రెండు మ్యాచ్‌ల్లోనూ అర్ధ శతకం సాధించి మంచి టచ్‌లో ఉన్నాడు. ఈ మెగా టోర్నీలో రోహిత్ శర్మ 41.33 సగటు.. 155.97 స్ట్రైక్ రేట్‌తో 248 పరుగులు చేశాడు. టోర్నీలో అత్యధిక పరుగులు చేసిన జాబితాలో రోహిత్ శర్మ మూడో స్థానంలో ఉన్నాడు. ఫైనల్ మ్యాచ్‌లో యావత్ ప్రపంచం దృష్టి రోహిత్ శర్మ బ్యాటింగ్‌పైనే ఉంటుంది. టీమ్ ఇండియాకు రోహిత్ శర్మ శుభారంభం ఇస్తే ఇక టైటిల్‌ కల నెరవేరకుండా భారత్‌ను అడ్డుకోవడం దక్షిణాఫ్రికాకు చాలా కష్టం. 

 

జస్ప్రీత్ బుమ్రా (Bumrah)

బుమ్రా ప్రస్తుతం ప్రపంచంలోనే నంబర్ వన్ బౌలర్. ఈ ప్రపంచకప్‌లో జస్ప్రీత్ బుమ్రా అద్భుత ప్రదర్శన చేశాడు. భారత్‌ జట్టుకు వికెట్ అవసరమైనప్పుడల్లా బుమ్రా ఆ వికెట్‌ను అందించాడు. ఈ మెగా టోర్నీలో టాప్ 5 వికెట్‌ టేకర్లలో బుమ్రా ఉన్నాడు. ఏడు మ్యాచ్‌ల్లో కేవలం 4.5 ఎకానమీతో ఈ స్పీడ్‌ స్టార్‌ 13 వికెట్లు తీశాడు. టీమ్ ఇండియా ఫైనల్ గెలవాలంటే బుమ్రా మరోసారి కచ్చితత్వంతో బౌలింగ్ చేయాల్సిందే. 

 

కుల్‌దీప్‌ యాదవ్‌ (Kuldeep Yadav)

ఈ ప్రపంచకప్‌లో భారత జట్టుకు కుల్దీప్ యాదవ్ ట్రంప్ కార్డ్‌లా మారాడు. అమెరికాలో జరిగిన మ్యాచుల్లో ఒక్క మ్యాచ్‌ కూడా ఆడని కుల్‌దీప్‌ వెస్టిండీస్‌తో ఈ మెగా టోర్నీలోకి అడుగుపెట్టి అద్భుతంగా బౌలింగ్ చేస్తున్నాడు. ఇప్పటి వరకు ఆడిన నాలుగు మ్యాచ్‌ల్లో 5.87 ఎకానమీతో కుల్దీప్ యాదవ్ 10 వికెట్లు పడగొట్టాడు. సెమీఫైనల్ మ్యాచ్ లోనూ అక్షర్ పటేల్ తో కలిసి ఇంగ్లండ్‌ను కుప్పకూల్చాడు. ఈ ఫైనల్ మ్యాచ్‌లో కుల్దీప్ యాదవ్ బౌలింగ్‌పైనే అందరి దృష్టి ఉంటుంది. 

 

క్వింటన్ డి కాక్ (Quinton de Kock)

ఈ ప్రపంచకప్‌లో దక్షిణాఫ్రికా తరఫున అత్యధిక పరుగులు చేసిన ఆటగాడు క్వింటన్ డి కాక్. డేవిడ్ మిల్లర్ తర్వాత క్వింటన్ డి కాక్ దక్షిణాఫ్రికా జట్టులో అత్యంత అనుభవజ్ఞుడైన బ్యాట్స్‌మెన్. పేస్, స్పిన్ బౌలర్లను మెరుగ్గా ఆడే డికాక్‌ ఈ ఫైనల్స్‌లో చాలా కీలకంగా మారనున్నాడు. ఈ ప్రపంచ కప్‌లో 8 మ్యాచ్‌ల్లో 204 పరుగులు చేశాడు, ఇందులో రెండు అర్ధ సెంచరీలు కూడా ఉన్నాయి. 

 

ఎన్రిక్ నోర్కియా (Anrich Nortje)

ఈ ప్రపంచకప్‌లో సౌతాఫ్రికా ప్రధాన బలం బౌలింగ్. ముఖ్యంగా దక్షిణాఫ్రికా పేసర్‌ ఎన్రిక్ నోర్కియా 8 మ్యాచ్‌ల్లో 13 వికెట్లు తీశాడు. బార్బడోస్ పిచ్‌పై నోకియా భారత బ్యాటర్లను ఇబ్బంది పెట్టే అవకాశం ఉంది. నోర్కియా పవర్ ప్లేలోనే భారత జట్టులో ఒకటి లేదా రెండు వికెట్లు పడగొడితే టీమిండియాకు కష్టాలు తప్పకపోవచ్చు.