IND vs PAK Weather: నాలుగేండ్ల తర్వాత వారం రోజుల క్రితమే తొలి వన్డే ఆడిన భారత్ - పాకిస్తాన్ మ్యాచ్ వర్షం కారణంగా ఒక్క ఇన్నింగ్స్ మాత్రమే సాధ్యమై అభిమానులను తీవ్ర నిరాశను మిగిల్చింది. వారం రోజుల వ్యవధిలోనే రెండోసారి జరుగుతున్న దాయాదుల పోరునూ అడ్డుకోవడానికి వరుణుడు అస్త్రశస్త్రాలతో సిద్ధమవుతున్నాడు. అయితే ఆదివారం ఉదయం కొలంబో నగరంలో వాతావరణం ప్రశాంతంగానే ఉంది. సూర్యుడు ఉదయించి ఎండ కూడా కావాల్సినంత కాస్తుండటంతో వరుణుడు కాస్త శాంతించాడని అభిమానులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
ఈనెల 2న భారత్ - పాక్ మధ్య పల్లెకెలె వేదికగా మ్యాచ్ జరుగగా ఆ పోరుకు వరుణుడు పదే పదే అడ్డుపడ్డాడు. చివరికి భారత ఇన్నింగ్స్ ముగిశాక ఇక మళ్లీ ఆట సాగనివ్వలేదు. దీంతో ఈ మ్యాచ్ అర్థాంతరంగా రద్దు అయింది. అయితే నేడు వేదిక మారినా కొలంబోలో కూడా వర్షం దంచికొట్టే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. ఆదివారం వర్షం కురిసే అవకాశాలు 90 శాతం దాకా ఉన్నాయని వాతావరణ శాఖ అంచనాలు వేయడం ఆందోళన రేకెత్తిస్తోంది. అయితే ఆదివారం ఉదయం నుంచి కొలంబోలో వాతావరణం పొడిగానే ఉందని అక్కడే ఉన్న పలువురు క్రికెట్ అభిమానులు ఫోటోలను సోషల్ మీడియాలో పంచుకుంటుండటంతో మ్యాచ్ సజావుగా సాగే అవకాశాలున్నట్టు ఫ్యాన్స్ భావిస్తున్నారు. అదీగాక నిన్న శ్రీలంక - బంగ్లాదేశ్ మ్యాచ్‌కు కూడా వరుణుడు ఏ అడ్డంకులూ సృష్టించకపోవడం అభిమానులలో మరింత ఆశలు రేపింది.
కానీ దీనిని తుఫాను ముందు ప్రశాంతత మాదిరిగా చెప్పకతప్పదు. ఆసియా కప్ గ్రూప్ స్జేజ్ మ్యాచ్‌లో కూడా ఉదయం పల్లెకెలెలో వాతావరణం పొడిగానే ఉంది. టాస్ వేసే సమయంలో కూడా ఎండకాచింది. కానీ నాలుగు ఓవర్లు పడ్డ తర్వాతే అసలు కథ మొదలైంది. నేడు ఉదయం కొలంబోలో వాతావరణం బాగానే ఉన్నా సాయంత్రం మాత్రం అంతరాయం కలిగించే ప్రమాదం లేకపోలేదు.
పేలుతున్న మీమ్స్..
దాయాదుల పోరుకు వర్షం కురిసే ప్రమాదం ఉండటంతో సోషల్ మీడియాలో ఇందుకు సంబంధించి క్రియేట్ చేసిన మీమ్స్ అభిమానులను ఆకట్టుకుంటున్నాయి. పలువురు నెటిజన్లు భారత్ - పాకిస్తాన్ సారథులు టాస్‌కు రావడం, రవిశాస్త్రి కామెంట్రీ.. వరదలోనే టాస్ వేయడం వంటివి నవ్వు తెప్పిస్తున్నాయి.
ముఖ్యమైన, మరిన్ని ఆసక్తికర కథనాల కోసం ‘టెలిగ్రామ్’లో ‘ఏబీపీ దేశం’లో జాయిన్ అవ్వండి
Join Us on Telegram: https://t.me/abpdesamofficial