ప్రపంచకప్‌లో అప్రతిహాత విజయాలతో దూసుకుపోతున్న టీమిండియా.. చివరి లీగ్ మ్యాచ్‌లో పసికూన నెదర్లాండ్స్‌తో మ్యాచ్‌కు సిద్ధమైంది. ఇప్పటికే పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో సగర్వంగా సెమీఫైనల్లో అడుగుపెట్టిన భారత జట్టు.. ఈ మ్యాచ్‌లోనూ సాధికార విజయం సాధించి నాకౌట్‌కు ముందు పూర్తి ఆత్మ విశ్వాసంతో బరిలోకి దిగాలని చూస్తోంది. బ్యాటింగ్, బౌలింగ్‌లలో పటిష్టంగా ఉన్న టీమిండియాను ఎదుర్కోవడం డచ్ జట్టుకు అంత తేలిక కాదు. బెంగళూరు చిన్నస్వామి స్టేడియంలో ఈ మ్యాచ్ జరగనుంది. బ్యాటింగ్‌కు అనుకూలించే పిచ్‌పై సూపర్ ఫామ్‌లో ఉన్న భారత బ్యాటర్లను నెదర్లాండ్స్ బౌలర్లు అడ్డుకోవడం సవాల్‌గా మారనుంది. ఈ మ్యాచ్‌లోనూ గెలిచి ఒక్క మ్యాచ్ కూడా ఓడిపోకుండా లీగ్ దశను ముగించాలని టీమిండియా పట్టుదలగా ఉంది. ఇప్పటివరకు ఒక్క తప్పటడుగూ వేయని రోహిత్‌సేన ఈ పోరులోనూ డచ్ జట్టుపై భారీ విజయం సాధించడం ఖాయంగా కనిపిస్తోంది.
డచ్ అడ్డుకోగలదా..?
సెమీఫైనల్‌కు ముందు సూర్యకుమార్ యాదవ్ ఫామ్ ఒక్కటే టీమిండియాను కొంచెం ఆందోళన పరుస్తోంది. నెదర్లాండ్స్‌తో జరిగే ఈ మ్యాచ్‌లో సూర్యకుమార్ ఫామ్ అందుకోవాలని భారత జట్టు మేనేజ్‌మెంట్ కోరుకుంటోంది. ప్రస్తుతం టీమిండియా బ్యాటర్లలో సూర్య మాత్రమే పరుగులు చేయడంలో కాస్త ఇబ్బంది పడుతున్నాడు. ఈ మెగా టోర్నీలో సూర్యకుమార్ యాదవ్ మినహా మిగిలిన టాపార్డర్ బ్యాటర్లంతా కనీసం ఒక్క అర్ధశతకమైనా సాధించారు. సూర్య ఇప్పటివరకు నాలుగు మ్యాచ్‌ల్లో 21.25 సగటుతో 85 పరుగులు మాత్రమే చేశాడు. ఓపెనర్లు రోహిత్, గిల్‌లు మూడుసార్లు 50పై ఆరంభాలనిచ్చారు కానీ.. మిగతా సందర్భాల్లో ఓపెనర్ల భాగస్వామ్యం త్వరగా విడిపోయింది. ఓపెనింగ్‌లో కూడా భారీ భాగస్వామ్యం నమోదు చేయాలని రోహిత్, గిల్ భావిస్తున్నారు. టోర్నీలో మరో మూడు మ్యాచ్‌ల్లో రోహిత్-గిల్ జంట నుంచి బలమైన ఆరంభాలను జట్టు కోరుకుంటోంది. పేసర్లు, స్పిన్నర్లు గొప్పగా రాణిస్తుండడంతో బౌలింగ్‌లో భారత్‌కు ఎలాంటి సమస్యలూ లేవు.
కోహ్లీపైనే కళ్లన్నీ...
ఇప్పటికే సచిన్ రికార్డుల సెంచరీలను సమం చేసిన కింగ్ కోహ్లీ ఈ మ్యాచ్‌లో ఆ రికార్డును అధిగమించి నవ చరిత్రను సృష్టించాలని భావిస్తున్నాడు. కోహ్లి 50వ వన్డే సెంచరీతో సచిన్ టెండూల్కర్‌ను దాటేస్తాడా అన్నదానిపై ఆసక్తి పెంచుతోంది. ఈ ఘనత సాధించడానికి నెదర్లాండ్స్‌తో మ్యాచ్ కోహ్లీకి మంచి అవకాశం. సూపర్ ఫామ్‌లో ఉన్న కోహ్లి.. దక్షిణాఫ్రికాపై శతకంతో సచిన్ అత్యధిక శతకాల రికార్డను సమం చేశాడు. నామమాత్ర మ్యాచ్‌లో భారత తుది జట్టులో ఏమైనా మార్పులు జరుగుతాయా అన్నది ఆసక్తి రేపుతోంది. వ్యూహాత్మకంగా ఎలాంటి ప్రయోగాలు ఉండవని కోచ్ రాహుల్ ద్రవిడ్ స్పష్టం చేశాడు. కానీ జట్టులో ఒకట్రెండు మార్పులను కొట్టిపారేయలేం. బుమ్రా, కుల్‌దీప్‌లకు విశ్రాంతినిచ్చి ప్రసిద్ధ్ కృష్ణ, అశ్విన్‌లను తీసుకోవచ్చు.
భారత జట్టు: రోహిత్, శుభ్‌మన్ గిల్, కోహ్లి, శ్రేయస్ అయ్యర్, కేఎల్ రాహుల్, సూర్యకుమార్, జడేజా, కుల్‌దీప్, అశ్విన్, బుమ్రా, ప్రసిద్ధ్ కృష్ణ, షమి, సిరాజ్
నెదర్లాండ్స్ జట్టు: ఒదౌడ్, బారెసి, ఆకర్‌మ్యాన్, సిబ్రాండ్, ఎడ్వర్డ్స్, డి లీడ్, తేజ నిడమానూరు, వాన్ బీక్, వాండెర్‌మెర్వ్, ఆర్యన్ దత్, మీకెరన్