England Vs Pakistan: 2023 వరల్డ్‌కప్‌ను పాకిస్తాన్ పరాజయంతో ముగించింది. సెమీస్‌కు చేరాలంటే భారీ తేడాతో గెలవాల్సిన మ్యాచ్‌లో చిత్తుగా ఓడిపోయింది. ఈ మ్యాచ్‌లో మొదట బ్యాటింగ్ చేసిన ఇంగ్లండ్ 50 ఓవర్లలో తొమ్మిది వికెట్ల నష్టానికి 337 పరుగులు చేసింది. అనంతరం పాకిస్తాన్ 43.3 ఓవర్లలో 244 పరుగులకు ఆలౌట్ అయింది. దీంతో ఇంగ్లండ్ 93 పరుగులతో విజయం సాధించింది. ఈ విజయంతో ఇంగ్లండ్... 2025 ఛాంపియన్స్ ట్రోఫీకి దాదాపు ఎంపిక అయినట్లే.


ఇంగ్లండ్ బ్యాటర్లలో బెన్ స్టోక్స్ (84: 76 బంతుల్లో, 11 ఫోర్లు, రెండు సిక్సర్లు) టాప్ స్కోరర్‌గా నిలిచాడు. జానీ బెయిర్‌స్టో (59: 61 బంతుల్లో, ఏడు ఫోర్లు, ఒక సిక్సర్), జో రూట్ (60: 72 బంతుల్లో, నాలుగు ఫోర్లు) అర్థ సెంచరీలు సాధించారు. పాకిస్తాన్ బౌలర్లలో హరీస్ రౌఫ్‌కు మూడు వికెట్లు దక్కాయి. మరోవైపు పాక్ బ్యాటర్లలో అఘా సల్మాన్ (51: 45 బంతుల్లో, ఆరు ఫోర్లు, ఒక సిక్సర్) అర్థ సెంచరీ సాధించాడు. చివర్లో హరీస్ రౌఫ్ (35: 23 బంతుల్లో, మూడు ఫోర్లు, మూడు సిక్సర్లు) మెరుపులు మెరిపించాడు. కానీ అవి విజయానికి సరిపోలేదు. ఇంగ్లండ్ బౌలర్లలో డేవిడ్ విల్లీ మూడు వికెట్లు దక్కించుకున్నాడు.


బెన్ స్టోక్స్ మెరుపులు
ఈ మ్యాచ్‌లో మొదట బ్యాటింగ్ చేసిన ఇంగ్లండ్‌కు ఓపెనర్లు డేవిడ్ మలన్ (31: 39 బంతుల్లో, ఐదు ఫోర్లు), జానీ బెయిర్‌స్టో (59: 61 బంతుల్లో, ఏడు ఫోర్లు, ఒక సిక్సర్) అదిరిపోయే ఆరంభాన్ని ఇచ్చారు. వీరు మొదటి వికెట్‌కు 13.3 ఓవర్లలోనే 82 పరుగులు జోడించారు. కానీ వీరిద్దరూ 24 పరుగుల వ్యవధిలోనే అవుటయ్యారు. 


ఆ తర్వాత బెన్ స్టోక్స్ (84: 76 బంతుల్లో, 11 ఫోర్లు, రెండు సిక్సర్లు), జో రూట్ (60: 72 బంతుల్లో, నాలుగు ఫోర్లు) ఇన్నింగ్స్‌ను కుదుటపరించారు. వీరు మూడో వికెట్‌కు 132 పరుగులు జోడించి ఇన్నింగ్స్‌ను కుదుటపరిచారు. అనంతరం వచ్చిన వారందరూ వేగంగా ఆడటంతో ఇంగ్లండ్ 50 ఓవర్లలో తొమ్మిది వికెట్ల నష్టానికి 337 పరుగులు చేసింది.


పోటీ పడలేకపోయిన పాకిస్తాన్
భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన పాకిస్తాన్‌కు మొదట్లోనే ఎదురుదెబ్బ తగిలింది. స్కోరు బోర్డుపై 10 పరుగులు చేరే సరికి ఓపెనర్లు అబ్దుల్లా షఫీక్ (0: 2 బంతుల్లో), ఫఖర్ జమాన్ (1: 9 బంతుల్లో) పెవిలియన్ బాట పట్టారు. ఆ తర్వాత కెప్టెన్ బాబర్ ఆజం (38: 45 బంతుల్లో, ఆరు ఫోర్లు), మహ్మద్ రిజ్వాన్ (36: 51 బంతుల్లో, రెండు ఫోర్లు) ఇన్నింగ్స్‌ను కుదుటపరిచారు. వీరు మూడో వికెట్‌కు 51 పరుగులు జోడించారు.


అనంతరం వచ్చిన వారిలో సౌద్ షకీల్ (29: 37 బంతుల్లో, నాలుగు ఫోర్లు), అఘా సల్మాన్ (51: 45 బంతుల్లో, ఆరు ఫోర్లు, ఒక సిక్సర్) మాత్రమే రాణించారు. ఒకదశలో వెంటవెంటనే వికెట్లు కోల్పోయింది. దీంతో పాకిస్తాన్ 191 పరుగులకు తొమ్మిది వికెట్లు నష్టపోయింది. అయితే చివర్లో మహ్మద్ వసీం జూనియర్ (16 నాటౌట్: 14 బంతుల్లో, రెండు ఫోర్లు, ఒక సిక్సర్), హరీస్ రౌఫ్ (35: 23 బంతుల్లో, మూడు ఫోర్లు, మూడు సిక్సర్లు) ఊహించని విధంగా చెలరేగారు. చివరి వికెట్‌కు 35 బంతుల్లోనే 53 పరుగులు జోడించారు. ఇంగ్లండ్‌ను కాసేపు భయపెట్టారు. కానీ క్రిస్ వోక్స్... హరీస్ రౌఫ్‌ను అవుట్ చేసి ఇంగ్లండ్‌కు విజయం అందించాడు.


ఇంగ్లండ్ తుదిజట్టు
జానీ బెయిర్‌స్టో, డేవిడ్ మలన్, జో రూట్, బెన్ స్టోక్స్, హ్యారీ బ్రూక్, జోస్ బట్లర్ (కెప్టెన్, వికెట్ కీపర్), మొయిన్ అలీ, క్రిస్ వోక్స్, డేవిడ్ విల్లీ, గుస్ అట్కిన్సన్, ఆదిల్ రషీద్


పాకిస్తాన్ తుదిజట్టు
అబ్దుల్లా షఫీక్, ఫఖర్ జమాన్, బాబర్ ఆజం (కెప్టెన్), మహ్మద్ రిజ్వాన్ (వికెట్ కీపర్), సౌద్ షకీల్, ఇఫ్తీకర్ అహ్మద్, అఘా సల్మాన్, షాదాబ్ ఖాన్, షాహీన్ అఫ్రిది, మహ్మద్ వాసిం జూనియర్, హరీస్ రౌఫ్