Australia Vs Bangladesh: ప్రపంచకప్‌ను గ్రూప్ దశను ఆస్ట్రేలియా విజయంతో ముగించింది. బంగ్లాదేశ్‌తో జరిగిన చివరి లీగ్ మ్యాచ్‌లో ఆస్ట్రేలియా ఎనిమిది వికెట్లతో ఘనవిజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో మొదట బ్యాటింగ్ చేసిన బంగ్లాదేశ్ 50 ఓవర్లలో ఎనిమిది వికెట్ల నష్టానికి 306 పరుగులు చేసింది. అనంతరం ఆస్ట్రేలియా 44.4 ఓవర్లలో రెండు వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించింది.


బంగ్లాదేశ్ బ్యాటర్లలో తౌహిద్ హృదయ్ (74: 79 బంతుల్లో, ఐదు ఫోర్లు, రెండు సిక్సర్లు) అర్థ సెంచరీతో టాప్ స్కోరర్‌గా నిలిచాడు. ఆస్ట్రేలియా బ్యాటర్లలో మిషెల్ మార్ష్ (177 నాటౌట్: 132 బంతుల్లో, 17 ఫోర్లు, తొమ్మిది సిక్సర్లు) భారీ సెంచరీ సాధించాడు. స్టీవెన్ స్మిత్ (63 నాటౌట్: 64 బంతుల్లో, నాలుగు ఫోర్లు, ఒక సిక్సర్), డేవిడ్ వార్నర్ (53: 61 బంతుల్లో, ఆరు ఫోర్లు) అర్థ సెంచరీలు కొట్టారు. ఆస్ట్రేలియా బౌలర్లలో షాన్ అబాట్, ఆడం జంపా రెండేసి వికెట్లు తీసుకున్నారు.


సమష్టిగా రాణించిన బంగ్లా బ్యాటర్లు
ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన ఆస్ట్రేలియా మొదట బౌలింగ్ ఎంచుకుంది. దీంతో బంగ్లాదేశ్ బ్యాటింగ్‌కు వచ్చింది. బంగ్లా ఓపెనర్లు తన్జిద్ హసన్ (36: 34 బంతుల్లో, ఆరు ఫోర్లు), లిట్టన్ దాస్ (36: 45 బంతుల్లో, ఐదు ఫోర్లు) బంగ్లాకు అదిరిపోయే ఆరంభం ఇచ్చారు. వీరు మొదటి వికెట్‌కు 11.2 ఓవర్లలోనే 76 పరుగులు జోడించారు. అయితే ఓపెనర్లు ఇద్దరూ 30 పరుగుల తేడాలోనే అవుటయ్యారు. దీంతో బంగ్లాదేశ్ 16.4 ఓవర్లలో 106 పరుగులకు ఓపెనర్ల వికెట్లు కోల్పోయింది.


ఆ తర్వాత నజ్ముల్ హుస్సేన్ శాంటో (45: 57 బంతుల్లో, ఆరు ఫోర్లు), తౌహిద్ హృదయ్ (74: 79 బంతుల్లో, ఐదు ఫోర్లు, రెండు సిక్సర్లు), మహ్మదుల్లా (32: 28 బంతుల్లో, ఒక ఫోర్, మూడు సిక్సర్లు), మెహదీ హసన్ మిరాజ్ (29: 20 బంతుల్లో, నాలుగు ఫోర్లు) కూడా బాగా రాణించారు. దీంతో బంగ్లాదేశ్ 50 ఓవర్లలో ఎనిమిది వికెట్ల నష్టానికి 306 పరుగులు చేసింది. ఆస్ట్రేలియా షాన్ అబాట్, ఆడం జంపా రెండేసి వికెట్లు తీసుకున్నారు. మార్కస్ స్టోయినిస్‌కు ఒక వికెట్ దక్కింది.


అదరగొట్టిన మిషెల్ మార్ష్
ఆస్ట్రేలియాకు ఆరంభంలోనే ఎదురుదెబ్బ తగిలింది. ట్రావిస్ హెడ్ (10: 11 ఓవర్లోనే, రెండు ఫోర్లు) మూడో ఓవర్లోనే పెవిలియన్ బాట పట్టాడు. టస్కిన్ అహ్మద్... హెడ్‌ను క్లీన్ బౌల్డ్ చేశాడు. అయితే డేవిడ్ వార్నర్ (53: 61 బంతుల్లో, ఆరు ఫోర్లు), మిషెల్ మార్ష్ (177 నాటౌట్: 132 బంతుల్లో, 17 ఫోర్లు, తొమ్మిది సిక్సర్లు) రెండో వికెట్‌కు 120 పరుగులు జోడించారు. అనంతరం మిషెల్ మార్ష్, స్టీవెన్ స్మిత్ (63 నాటౌట్: 64 బంతుల్లో, నాలుగు ఫోర్లు, ఒక సిక్సర్) మరో వికెట్ పడకుండా మ్యాచ్‌ను ముగించారు.


బంగ్లాదేశ్ తుది జట్టు
తాంజిద్ హసన్, లిట్టన్ దాస్, నజ్ముల్ హొస్సేన్ శాంటో (కెప్టెన్), మహ్మదుల్లా, ముష్ఫికర్ రహీమ్ (వికెట్ కీపర్), తౌహిద్ హృదయ్, మెహిదీ హసన్ మిరాజ్, మహేదీ హసన్, నసుమ్ అహ్మద్, తస్కిన్ అహ్మద్, ముస్తాఫిజుర్ రహ్మాన్


ఆస్ట్రేలియా తుది జట్టు
డేవిడ్ వార్నర్, ట్రావిస్ హెడ్, మిచెల్ మార్ష్, స్టీవెన్ స్మిత్, మార్నస్ లాబుషాగ్నే, జోష్ ఇంగ్లిస్ (వికెట్ కీపర్), మార్కస్ స్టోయినిస్, సీన్ అబాట్, పాట్ కమిన్స్ (కెప్టెన్), ఆడమ్ జంపా, జోష్ హాజిల్‌వుడ్