India vs Nepal:
ఆసియాకప్ -2023కి వరుణుడు పదేపదే అంతరాయం కలిగిస్తున్నాడు. శ్రీలంకలో మ్యాచులకు అడ్డంకులు కల్పిస్తున్నాడు. తాజాగా పల్లెకెలె వేదికగా జరుగుతున్న టీమ్‌ఇండియా, నేపాల్ మ్యాచ్ వర్షం వల్ల ఆగిపోయింది. వాన దేవుడు తెరపిలేకుండా వాన కురిపిస్తున్నాడు. చిన్నగా మొదలైన జల్లులు కుండపోతాగా మారాయి. దాంతో మ్యాచ్ మళ్లీ ఎంతసేపటికి మొదలవుతుందో తెలియడం లేదు. కనీసం గంట వరకు విరామం ఉండొచ్చని తెలుస్తోంది.
వర్షంతో ఆట ముగిసే సమయానికి 37.5 ఓవర్లకు నేపాల్ 6 వికెట్ల నష్టానికి 178 పరుగులు చేసింది. దీపేంద్ర సింగ్ (27; 20 బంతుల్లో 3x4), సోంపాల్ కామి (11; 20 బంతుల్లో 1x4) బ్యాటింగ్ చేస్తున్నారు. అంతకు ముందే ఓపెనర్ ఆసిఫ్ షేక్ (58; 97 బంతుల్లో 8x4) అమేజింగ్ హాఫ్ సెంచరీ చేశాడు. మరో ఓపెనర్ కుశాల్ భూర్తెల్ (38; 25 బంతుల్లో 3x4, 2x6) దూకుడైన బ్యాటింగ్ ఆకట్టుకున్నాడు. రవీంద్ర జడేజా 3 వికెట్లు తీశాడు. మహ్మద్ సిరాజ్ 2 వికెట్లు పడగొట్టాడు. శార్దూల్ ఠాకూర్‌కు ఒక వికెట్ దక్కింది.
ఆరంభం.. ప్లాఫ్!
ఆకాశం నిండా మబ్బులు.. చల్లని వాతావరణం.. టాస్ గెలిచిన ఫీల్డింగ్! ఇన్ని అనకూలతల మధ్య టీమ్‌ఇండియా బౌలింగ్ ఎలా ఉండాలి? చురకత్తుల్లాంటి బంతుల్ని స్వింగ్ చేస్తుంటే ప్రత్యర్థి వణికిపోవాలి! కానీ అలా జరగలేదు. నేపాల్ వంటి చిన్న జట్టు పైనా ఆరంభంలో వికెట్లు తీయడంలో హిట్‌మ్యాన్ సేన విఫలమైంది. వరుసగా మూడు క్యాచుల్ని.. అదీ నాలుగు ఓవర్లలోపే నేల పాలు చేసింది. దాంతో నేపాలీలకు ఊహించని.. అద్భుతమైన ఆరంభం లభించింది.
ఆసిఫ్.. హాఫ్ సెంచరీ!
తమకు దొరికిన జీవనదానాలను నేపాల్ చక్కగా వినియోగించుకుంది. ఓపెనర్లు కుశాల్ భూర్తెల్, ఆసిఫ్ షేక్ విజృంభించడంతో 53 బంతుల్లోనే 50 పరుగుల మైలురాయి చేరుకుంది. వీరిద్దరూ టీమ్‌ఇండియా బౌలర్లను ఆత్మవిశ్వాసంతో ఎదుర్కొన్నారు. పోరాడితే పోయేదీమీ లేదన్న చందంగా దూకుడగా ఆడారు. తొలి వికెట్‌కు 59 బంతుల్లో 65 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు. దాంతో పదో ఓవర్ వరకు భారత్ వికెట్ కోసం ఎదురు చూసింది. మొత్తానికి 9.5వ బంతికి కుశాల్‌ను శార్దూల్ ఔట్ చేశాడు. ఆ తర్వాత రవీంద్ర జడేజా విజృంభించాడు. వరుసగా భీమ్ షాక్రి (7), రోహిత్ పౌడెల్ (5), కుశాల్ (2)ను ఔట్ చేశాడు. ఈ సిచ్యువేషన్లో గుల్షన్ ఝా (23; 35 బంతుల్లో 3x4), దీపేంద్ర సింగ్ (27; 20 బంతుల్లో 3x4) ఆదుకున్నారు.
డ్రాప్ క్యాచులు
ఇన్నింగ్స్ ఆరో బంతికే టీమ్‌ఇండియాకు అవకాశం దొరికింది. షమి వేసిన బంతిని భూర్తెల్ ఆఫ్‌సైడ్ ఆడబోయాడు. బ్యాటు అంచుకు తగిలిన బంతి స్లిప్‌లోకి వెళ్లింది. దానిని అందుకోవడంలో శ్రేయస్ అయ్యర్ విఫలమయ్యాడు. ఆ తర్వాత ఒక సిట్టర్‌ను విరాట్ కోహ్లీ మిస్ చేశాడు. మహ్మద్ సిరాజ్ వేసిన 1.1వ బంతిని షేక్ ఆడాడు. ఆఫ్‌సైడ్ ఆఫ్‌స్టంప్ మీదుగా వచ్చిన బంతిని స్ట్రెయిట్‌గా ఆడబోయాడు. గాల్లోకి లేచిన బంతి షార్ట్‌పిచ్ వద్ద కోహ్లీ వద్దకు వెళ్లింది. అతడి చేతుల్లోంచి జారిపోయింది. మహ్మద్ షమి వేసిన 4.2వ బంతికీ భూర్తెల్‌కు మరో లైఫ్ లభించింది. తన వద్దకే వచ్చిన బంతిని కీపర్ ఇషాన్ కిషన్ లెఫ్ట్‌వైప్ దూకి మిస్ చేశాడు.