లెజెండరీ క్రికెటర్, టెస్ట్ క్రికెట్ చరిత్రలో 800 వికెట్లు తీసిన ఏకైక బౌలర్, శ్రీలంక స్పిన్ మాంత్రికుడు ముత్తయ్య మురళీధరన్ (Muttiah Muralitharan) జీవితం ఆధారంగా '800' (800 Movie) రూపొందుతున్న విషయం ప్రేక్షకులకు తెలుసు. ఈ చిత్రానికి ఎంఎస్ శ్రీపతి (MS Sripathy) దర్శకత్వం వహిస్తున్నారు. బుకర్ ప్రైజ్ (2022) విన్నర్ షెహన్ కరుణతిలకతో కలిసి ఆయన స్క్రిప్ట్ రాశారు. ఈ చిత్రంలో మురళీధరన్ పాత్రలో 'స్లమ్‌డాగ్ మిలియనీర్' ఫేమ్ మధుర్ మిట్టల్ (Madhur Mittal), మురళీధరన్ భార్య మదిమలర్ పాత్రలో మహిమా నంబియార్ నటించారు. లేటెస్ట్ అప్డేట్ ఏమిటంటే... రేపు సినిమా ట్రైలర్ విడుదల కానుంది. 


సచిన్ ముఖ్య అతిథిగా '800' ట్రైలర్800 movie trailer launch event : సెప్టెంబర్ 5న... అనగా రేపు '800' ట్రైలర్ విడుదల చేయనున్నట్లు చిత్ర బృందం తెలియజేసింది. ముంబైలో జరగనున్న ఈ ట్రైలర్ ఆవిష్కరణ కార్యక్రమానికి గాడ్ ఆఫ్ క్రికెట్ సచిన్ టెండూల్కర్ (Sachin Tendulkar) ముఖ్య అతిథిగా హాజరు కానున్నారు.    


సచిన్ టెండూల్కర్ ఇటు ఇండియా తరఫున, ముత్తయ్య మురళీధరన్ అటు శ్రీలంక తరఫున ఎన్నో మ్యాచ్‌లు ఆడారు. వీళ్ళిద్దరూ మైదానంలో పోటీ పడినప్పటికీ... మైదానం వెలుపల మంచి స్నేహితులు. మురళీధరన్ కోసం '800' ట్రైలర్ విడుదల చేయడానికి సచిన్ వస్తున్నారు. 


Also Read : 'డెవిల్' - కళ్యాణ్ రామ్ సినిమా కోసం దిమ్మ తిరిగి మైండ్ బ్లాక్ అయ్యేలా భారీ సెట్స్!






'యశోద' నిర్మాత చేతికి '800'
'800' పాన్ ఇండియా డిస్ట్రిబ్యూషన్ హక్కులను ప్రముఖ నిర్మాత, శ్రీదేవి మూవీస్ అధినేత శివలెంక కృష్ణ ప్రసాద్ (Sivalenka Krishna Prasad) సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే. తమిళంతో పాటు తెలుగు, హిందీ, ఇంగ్లీష్ భాషల్లో విడుదల చేయనున్నారు. సుమారు 45 కోట్ల రూపాయల నిర్మాణ వ్యయంతో తెరకెక్కిన చిత్రమిది. ట్రైలర్ విడుదల కార్యక్రమం గురించి శివలెంక కృష్ణ ప్రసాద్ మాట్లాడుతూ ''సచిన్ టెండూల్కర్ గారు మా '800' ట్రైలర్ ఆవిష్కరణ కార్యక్రమానికి వస్తుండటం ఎంతో సంతోషంగా ఉంది. ఈ కార్యక్రమానికి ఆయనతో పాటు ప్రముఖ క్రికెటర్లు, సినీ ప్రముఖులు హాజరు అవుతారు. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. త్వరలో విడుదల తేదీ ప్రకటిస్తాం'' అని చెప్పారు.


Also Read పవన్ కళ్యాణ్ లుక్ & గన్స్ నుంచి కథ వరకు - 'ఓజీ' టీజర్‌లో ఇవి గమనించారా?  



అక్టోబర్‌లో '800' విడుదలకు సన్నాహాలు
అక్టోబర్‌లో సినిమాను విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నామని శివలెంక కృష్ణప్రసాద్  తెలిపారు. ఇంకా ఈ సినిమా గురించి ఆయన మాట్లాడుతూ ''ముత్తయ్య మురళీధరన్ బయోపిక్ లో నిజ జీవితంలో ఆయన ఎదుర్కొన్న ఎన్నో సంఘటనలు, ఎత్తుపల్లాలు చాలా భావోద్వేగ భరితంగా ఉంటాయి. అటువంటి పరిస్థితులను అధిగమిస్తూ... 800 వికెట్లు తీసి వరల్డ్ రికార్డ్ సాధించిన ఘనత మురళీధరన్ సొంతం. బాల్యం నుంచి ఆయన ప్రయాణం, ఆయన పడిన స్ట్రగుల్స్, అన్నీ సినిమాలో ఉంటాయి. ఇప్పుడు రీ రికార్డింగ్, గ్రాఫిక్ వర్క్స్ జరుగుతున్నాయి'' అని చెప్పారు. 


మధుర్ మిట్టల్, మహిమా నంబియార్ జంటగా నటిస్తున్న ఈ సినిమాలో నరెన్, నాజర్, వేల్ రామమూర్తి, రిత్విక, వడివుక్కరసి, అరుల్ దాస్, హరి కృష్ణన్, శరత్ లోహితశ్వ ప్రధాన తారాగణం. ఈ చిత్రానికి కూర్పు : ప్రవీణ్ కెఎల్, ఛాయాగ్రహణం : ఆర్.డి. రాజశేఖర్, సంగీతం : జిబ్రాన్, రచన - దర్శకత్వం : ఎంఎస్ శ్రీపతి.


ముఖ్యమైన, మరిన్ని ఆసక్తికర కథనాల కోసం ‘టెలిగ్రామ్’లో ‘ఏబీపీ దేశం’లో జాయిన్ అవ్వండి.
Join Us on Telegram: https://t.me/abpdesamofficial