స్వదేశంలో భారత మహిళల జట్టు మరో కీలక సిరీస్‌కు సిద్ధమైంది. ఆసియాక్రీడల్లో స్వర్ణంతో అదరగొట్టిన మహిళల టీ20 జట్టు.. ఇప్పుడు పటిష్ఠ ఇంగ్లండ్‌తో అమీతుమీ తేల్చుకోనుంది. నేటి నుంచి ముంబైలోని వాంఖడే స్టేడియంలో ఇరు జట్ల మధ్య మూడు మ్యాచ్‌ల టీ 20 సిరీస్‌ ఆరంభం కానుంది. ఈ మూడు మ్యాచ్‌లు ముంబైలోనే జరగనున్నాయి. హర్మన్‌ప్రీత్‌ కౌర్‌ సారథ్యంలోని భారత్‌.. ఈ ఏడాది టీ20ల్లో మెరుగైన ప్రదర్శనే చేసింది. అయితే ప్రపంచ ర్యాంకింగ్స్‌లో రెండో స్థానంలో ఉన్న ఇంగ్లండ్‌ మహిళల జట్టును ఓడించడం హర్మన్‌ప్రీత్‌ సేనకు సవాల్‌ కానుంది. అయితే స్వదేశంలో ఇంగ్లాండ్‌పై భారత్‌కు గొప్ప రికార్డేం లేదు. స్వదేశంలో ఇంగ్లండ్‌తో భారత మహిళల జట్టు 9 మ్యాచ్‌లు ఆడగా రెండే మ్యాచుల్లో గెలుపొందింది. చివరి మ్యాచ్‌ను 2018 మార్చిలో గెలిచింది. ఓవరాల్‌గా భారత్‌-ఇంగ్లాండ్‌ మహిళల జట్ల మధ్య 27 టీ20 మ్యాచ్‌లు జరిగితే భారత్‌ ఏడు మాత్రమే నెగ్గింది. ఈ పేలవ రికార్డును అధిగమించేందుకు దూకుడే మంత్రంగా సాగాలని భావిస్తోంది. ఈ నేపథ్యంలో ఈ గణాంకాలను మెరుగుపరుచుకోవాలని హర్మన్‌ప్రీత్‌ బృందం భావిస్తోంది. 


 బ్యాటింగ్‌లో స్మృతి మంధాన, జెమీమా రోడ్రిగ్స్‌తో పాటు హర్మన్‌ప్రీత్‌ తప్పక రాణించాల్సి ఉంది. ఇటీవల మహిళల బిగ్‌బాష్‌ లీగ్‌లో హర్మన్‌ప్రీత్‌ 14 మ్యాచ్‌ల్లో 321 పరుగులు చేసింది. కొత్త కోచ్‌ అమోల్‌ మజుందార్‌ కూడా తమ ప్లేయర్స్‌ను భయం లేకుండా ఆడాలని సూచిస్తున్నాడు. షఫాలీ, జెమీమా తమ సహజశైలిలో ఆడితే భారీ స్కోర్లు ఖాయమే.  డబ్ల్యూపీఎల్‌లో రాణించిన స్పిన్నర్లు శ్రేయాంక పాటిల్‌, సైకా ఇషాక్‌లతో పాటు అండర్‌-19 వరల్డ్‌క్‌పలో ఆకట్టుకున్న స్పిన్నర్‌ మన్నత్‌ కశ్యప్‌ తమ అరంగేట్రం కోసం ఎదురుచూస్తున్నా మరోవైపు సొంతగడ్డపై శ్రీలంక చేతిలో 1-2తో ఓడిన ఇంగ్లాండ్‌.. భారత్‌పై సత్తా చాటాలనే పట్టుదలతో ఉంది. కెప్టెన్‌ హెథర్‌ నైట్‌, నాట్‌ సీవర్‌, ఎకిల్‌స్టోన్‌ రాణించడంపైనే ఆ జట్టు విజయావకాశాలు ఆధారపడి ఉన్నాయి. మరోవైపు హీథర్‌నైట్‌ సారథ్యంలోని ఇంగ్లండ్‌ జట్టు వచ్చే ఏడాది బంగ్లాదేశ్‌లో జరిగే టీ20 వరల్డ్‌కప్‌ కోసం ఈ సిరీస్‌ను సన్నాహకంగా ఉపయోగించుకోనుంది. 


 భారత పిచ్‌లపై ఆడడం పెద్ద పరీక్ష అని ఇంగ్లాండ్‌ కెప్టెన్‌ హెథర్‌ నైట్‌ చెప్పింది. భారత పరిస్థితుల్లో ఆడి ఆటను చాలా మెరుగుపరుచుకున్నాని. ఏ క్రికెటర్‌కైనా ఇక్కడ పిచ్‌లపై ఆడడం పెద్ద సవాల్‌ అని ఇంగ్లాండ్‌ సారధి తెలిపారు. భారత్‌లో వేడి, ఉక్కపోత వాతావరణాన్ని ఎదుర్కొంటూ మన నైపుణ్యాలను ప్రదర్శించాల్సి ఉంటుందని నైట్‌ తెలిపింది. వచ్చే ఏడాది బంగ్లాదేశ్‌లో టీ20 ప్రపంచకప్‌ జరగనున్న నేపథ్యంలో అలాంటి పిచ్‌లే పోలి ఉన్న భారత్‌లో ఆడడం మేలు చేస్తుందని నైట్‌ చెప్పింది. 2024 టీ20 ప్రపంచకప్‌ వేదిక బంగ్లాదేశ్‌లో పిచ్‌ల మాదిరే ఇక్కడి పిచ్‌లు కూడా ఉంటాయని సొంతగడ్డపై భారత్‌ను ఓడించడం అంత తేలికేం కాదని తెలిపింది. ఇంగ్లాండ్‌తో టీ20 సిరీస్‌లో భారత మహిళల జట్టు నిర్భయంగా ఆడాలని చీఫ్‌ కోచ్‌ అమోల్‌ మజుందార్‌ అన్నాడు. ఎప్పట్లాగే భారత్‌ తనదైన శైలిలో ఆడాలి. భయం లేకుండా ఆడటాన్నే సమర్థిస్తానని తెలిపాడు. షెఫాలీ వర్మ, జెమీమా రోడ్రిగ్స్‌ చాలా కీలకమని.. వాళ్ల దూకుడు ఆట కొనసాగించాలనే కోరుకుంటున్నానని మజుందార్‌ తెలిపాడు.