India vs England Cricket News: ఇంగ్లాండ్‌ అద్భుత ప్రదర్శన ముందు భారత మహిళల జట్టు తేలిపోయింది. గత ఘనమైన రికార్డును మరోసారి కొనసాగిస్తూ బ్రిటీష్‌ మహిళల జట్టు మరో మ్యాచ్‌ మిగిలి ఉండగానే మూడు మ్యాచ్‌ల టీ 20 సిరీస్‌ను దక్కించుకుంది.  వాంఖడే వేదికగా జరిగిన రెండో టీ 20లో బ్యాటర్లు ఘోరంగా విఫలం కావడంతో టీమిండియా (Team India)పై ఇంగ్లాండ్‌ ఘన విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్‌ చేసిన టీమిండియా బ్రిటీష్‌ బౌలర్లు మెరుగ్గా రాణించడంతో 16.2 ఓవర్లలో 80 పరుగులకే ఆలౌట్‌ అయింది. అనంతరం ఈ లక్ష్యాన్ని ఇంగ్లాండ్‌ ఆడుతూపాడుతూ ఛేదించింది. కేవలం 11.2 ఓవర్లలో ఆరు వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించింది.
ఈ మ్యాచ్‌లో తొలుత టాస్‌ గెలిచిన ఇంగ్లాండ్‌... భారత్‌ మహిళలను బ్యాటింగ్‌కు ఆహ్వానించింది. టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన భార‌త్ ఏదీ క‌లిసి రాలేదు. మొద‌టి ఓవ‌ర్‌లో రెండో బంతికే స్టార్ ఓపెన‌ర్ ష‌ఫాలీ వ‌ర్మ డ‌కౌట్ కాగా.. మ‌రికాసేప‌టికే స్మృతి మంధాన పెవిలియ‌న్‌కు చేరుకుంది. దీంతో 17 పరుగులకే టీమిండియా రెండు వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. ఆ తర్వాత కూడా భారత జట్టు కష్టాలు కొనసాగాయి. ఆదుకుంటారని భావించిన హర్మన్‌ప్రీత్‌, దీప్తిశ‌ర్మ కూడా చేతులెత్తేశారు. హర్మన్ ప్రీత్‌  తొమ్మిది పరుగులు చేసి పెవిలియన్‌ చేరగా.... దీప్తి శర్మ డకౌట్‌ అయింది. దీతో 29 పరుగులకే నాలుగు వికెట్లు కోల్పోయి భారత మహిళల జట్టు పీకల్లోతు కష్టాల్లో పడింది. ఇంగ్లాండ్‌ బౌలర్లు విజృంభించడంతో క్రమం తప్పకుండా వికెట్లు పడ్డాయి. జెమీమా కాస్త నిలవడంతో భారత్‌ కనీసం 80 పరుగులైనా చేయగలిగింది. జెమీమా రోడ్రింగ్స్‌ 30 పరుగులతో రాణించింది. 


జెమీమా రోడ్రిగ్స్‌ (30; 33 బంతుల్లో 2 ఫోర్లు) రాణించ‌గా మిగిలిన వారిలో స్మృతి మంధాన (10) మాత్ర‌మే రెండు అంకెల స్కోరు చేసింది. ష‌ఫాలీ వ‌ర్మ (0), హర్మన్‌ప్రీత్‌ కౌర్‌ (9), దీప్తి శర్మ (0), రిచా ఘోష్ (4), పుజా వస్త్రాకర్‌ (6) లు విఫ‌లం అయ్యారు. భారత బ్యాటర్లలో తొమ్మిది మంది సింగిల్‌ డిజిట్‌కే పెవిలియన్‌ చేరారు. బ్యాటర్లు ఘోరంగా విఫలం కావడంతో టీమిండియా 16.2 ఓవర్లలో 80 పరుగులకు ఆలౌట్ అయింది.  ఇంగ్లాండ్‌ బౌలర్లలో డీన్‌ (2/16), లారాన్‌ బెల్‌ (2/18), సోఫీ ఎకిల్‌స్టోన్‌ (2/13), సారా గ్లెన్‌ (2/13)  రాణించారు.


టీమ్ఇండియా నిర్దేశించిన 81 ప‌రుగుల స్వల్ప ల‌క్ష్యాన్ని 11.2 ఓవ‌ర్లలో ఆరు వికెట్లు కోల్పోయి ఛేదించింది. . ఛేదనలో రేణుక ధాటికి ఇంగ్లాండ్‌ 19 పరుగులకే ఓపెనర్లు డంక్లీ, వ్యాట్‌ వికెట్లు కోల్పోయింది. పవర్‌ప్లే ముగిసేసరికి ఇంగ్లండ్‌ 49/2తో నిలిచింది. అయితే క్యాప్సీ, నాట్‌ సివర్‌ (16) జట్టును లక్ష్యం దిశగా నడిపించారు. జట్టు స్కోరు 61 పరుగుల వద్ద క్యాప్సీ ఔట్‌ కావడంతో ఈ భాగస్వామ్యం విడిపోయింది. భారత్‌ చకచకా మరో మూడు వికెట్లు పడగొట్టినా.. లక్ష్యం చిన్నదే కావడంతో ఇంగ్లాండ్‌కు ఆందోళన చెందాల్సిన అవసరం లేకపోయింది.


ఇంగ్లాండ్ బ్యాట‌ర్లలో ఆలిస్ క్యాప్సే (25; 21 బంతుల్లో 4 ఫోర్లు), నాట్ స్కివర్-బ్రంట్ (16; 13 బంతుల్లో 2 ఫోర్లు, 1సిక్స్‌) రాణించారు. భార‌త బౌల‌ర్ల‌లో రేణుకా సింగ్, దీప్తిశ‌ర్మ చెరో రెండు వికెట్లు తీశారు. సైకా ఇషాక్, పూజా వస్త్రాకర్ చెరో వికెట్ ప‌డ‌గొట్టారు. అమీ జోన్స్‌ (7), కెంప్‌ (0)ను దీప్తి వరుస బంతుల్లో పెవిలియన్‌ చేర్చినా.. కెప్టెన్‌ హీథర్‌ నైట్‌ (7 నాటౌట్‌), ఎకిల్‌స్టోన్‌ (9 నాటౌట్‌) 52 బంతులు మిగిలుండగానే ఆసీస్‌ను గెలిపించారు. ఈ విజయంతో ఇంగ్లాండ్‌ ఈ సిరీస్‌లో 2-0 ఆధిక్యం సంపాదించింది. మూడో టీ20 ఆదివారం జరుగుతుంది. ప్లేయర్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌’గా డీన్‌ నిలిచింది.