Asha Sobhana s journey of hope: భారత జట్టు తరపున అంతర్జాతీయ క్రికెట్(International Cricket)లో అరంగేట్రం చేయాలన్న కేరళ స్పిన్నర్ ఆశా శోభన(Asha Sobhana) కల నెరవేరింది. ఒక సామాన్య కుటుంబం నుంచి వచ్చి ఎన్నో కష్టాలను ఎదుర్కొని శోభన తన కలను సాకారం చేసుకుంది. వుమెన్స్ ప్రీమియర్ లీగ్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు తరపున ఆడుతూ సత్తా చాటిన ఆశా శోభన... బంగ్లాదేశ్‌తో జరిగిన మ్యాచ్‌లో భారత జట్టు తరపున బరిలోకి దిగింది. సిల్హెట్ వేదికగా జరిగిన నాలుగో టీ 20లో ఆశా శోభనా టీమిండియా తరపున అరంగేట్రం చేసింది. భారత బ్యాటర్ స్మృతి మంధాన చేతుల మీదగా శోభన టీమిండియా క్యాప్ అందుకుంది. 33 ఏళ్ల వయసులో అరంగేట్రంతో శోభన మహిళా క్రికెట్‌లో సరికొత్త చరిత్ర సృష్టించారు. భారత మహిళా జట్టు తరఫున అంతర్జాతీయ క్రికెట్‌లో అతిపెద్ద వయసులో అరంగేట్రం చేసిన ప్లేయర్‌గా ఆశా శోభన రికార్డుల్లో నిలిచారు. 33 ఏళ్ల 51 రోజుల వయస్సులో శోభన జాతీయ జట్టులో అరంగేట్రం చేశారు. ఈ క్రమంలో సీమా పూజారే రికార్డును శోభన బద్దలు కొట్టింది. 2008లో శ్రీలంకతో జరిగిన వన్డేలో 31 ఏళ్ల వయసులో సీమా భారత్ తరఫున అరంగేట్రం చేసింది. సీమా, శోభన తప్ప మరే ఇతర భారతీయ మహిళా క్రికెటర్ 30 ఏళ్ల తర్వాత అరంగేట్రం చేయలేదు. ఈ మ్యాచ్‌లో శోభనా ఓవర్లలో మూడు ఓవర్లు బౌలింగ్ చేసి 18 పరుగులు ఇచ్చి రెండు వికెట్లు తీసి సత్తా చాటింది. ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ 2024లో శోభన సత్తాచాటింది. 10 మ్యాచ్‌ల్లో 7.11 ఏకానమితో 12 వికెట్లు తీసింది.
కష్టాలను దాటి.....
ఆశా శోభన ఒక సామాన్య కుటుంబం నుంచి వచ్చింది. శోభన తండ్రి కేరళలో ఆటో రిక్షా డ్రైవర్. కేరళలోని తిరువనంతపురం ప్రాంతానికి చెందిన శోభనా.. దూరదర్శన్‌లో మాజీ బౌలర్ నీతూ డేవిడ్ అంతర్జాతీయ క్రికెట్ ఆడడాన్ని చూసి స్ఫూర్తి పొంది ప్రొఫెషనల్ క్రికెట్ కు రావాలని నిర్ణయించుకుంది. క్రికెట్ ను తన కెరీర్ గ ఎంచుకునే క్రమంలో ఆమెకు చాలా కష్టాలు ఎదురయ్యాయి. పాఠశాలలో ఉన్నప్పుడే ఆశా.. తన తల్లిదండ్రులకు తెలియజేయకుండా జిల్లా స్థాయిలో క్రికెట్ టోర్నీలు ఆడేది. 14 సంవత్సరాల చిన్న వయస్సులో సీనియర్ స్థాయిలో కేరళ రాష్ట్ర జట్టు తరపున ఆడింది. 13 ఏళ్ల వయస్సులోనే ఆశా క్రికెట్ వైపు అడుగులు వేసింది. ఆ తర్వాత కేరళ జట్టు తరపున అద్బుతంగా రాణించడంతో భారత-ఏ జట్టులో ఆమెకు చోటు దక్కింది. కానీ సీనియర్ జట్టులో మాత్రం చోటు దక్కించుకలేకపోయింది. ఇప్పుడు 33 ఏళ్ల 51 రోజుల వయస్సులో శోభన జాతీయ జట్టులో అరంగేట్రం చేశారు.
ఈ మ్యాచ్‌లో భారత్‌దే విజయం
శోభన అరంగేట్రం చేసిన మ్యాచ్‌లో భారత జట్టు డక్‌వర్త్ లూయిస్ పద్ధతిలో 56 పరుగుల తేడాతో బంగ్లాదేశ్‌పై ఘన విజయం సాధించింది. ఎడతెగని వర్షం, వడగళ్ల వాన కారణంగా మ్యాచ్ ఫలితాన్ని డక్‌వర్త్ లూయిస్ పద్ధతిలో ప్రకటించారు. తొలుత బ్యాటింగ్ చేసిన హర్మన్‌ప్రీత్ కౌర్ (38), రిచా ఘోష్ (24) సాయంతో భారత్ 6 వికెట్ల నష్టానికి 122 పరుగులు చేసింది. వర్షం కారణంగా బంగ్లాదేశ్ లక్ష్యాన్ని 14 ఓవర్లకు 125 పరుగులుగా నిర్దేశించారు. బంగ్లా బ్యాటర్లు దిలారా అక్టర్ (21), రుబ్యా హైదర్ (13), షోరిఫా ఖతున్ (11 నాటౌట్) మినహా మిగిలిన బ్యాటర్లు ఎవరూ రెండంకెల స్కోరును చేరుకోలేకపోయారు. ఈ మ్యాచ్‌లో శోభనా ఓవర్లలో మూడు ఓవర్లు బౌలింగ్ చేసి 18 పరుగులు ఇచ్చి రెండు వికెట్లు తీసి సత్తా చాటింది. దీంతో బంగ్లాదేశ్ 68/7కి పరిమితమైంది. అయిదు మ్యాచ్‌ల టీ 20 సిరీస్‌లో భారత్ 4-0తో ఆధిక్యంలో ఉంది.