Babar Azam on Virat Kohli: టీ 20 ప్రపంచకప్‌(T20 World Cup 2024) షెడ్యూల్‌ ప్రకటించినప్పటి నుంచి అందరి దృష్టి భారత్‌- పాకిస్థాన్‌(India Vs PAkistan) మ్యాచ్‌పైనే ఉంది. ఈ రెండు జట్ల మధ్య సమరం... క్రికెట్‌ ప్రపంచాన్ని మునివేళ్లపై నిలబెట్టడం ఖాయమన్న అంచనాలు ఉన్నాయి. జూన్‌ తొమ్మిదిన న్యూయార్‌ వేదికగా దాయాదుల సమరం జరగనుంది. దీనికోసం క్రికెట్‌ ప్రేమికులు వేయి కళ్లతో  ఎదురుచూస్తున్నారు. వన్డే ప్రపంచకప్‌లో పాక్‌తో జరిగిన మ్యాచ్‌లో భారత్‌కు అద్భుత విజయం అందించిన కోహ్లీపైనే అందరి దృష్టి కేంద్రీకృతమై ఉంది. కోహ్లీ మరోసారి రెచ్చిపోతే పాక్‌కు తిప్పలు తప్పవు. టీ 20 ప్రపంచకప్‌లో కోహ్లీని ఎదుర్కొనే వ్యూహంపై పాక్‌ కెప్టెన్‌ బాబర్ ఆజమ్‌ స్పందించాడు.

 

ఆజమ్‌ ఏమన్నాడంటే..?

టీ 20 ప్రపంచ కప్ 2024లో విరాట్ కోహ్లీని ఎదుర్కోవడానికి పాకిస్తాన్ రచిస్తున్న వ్యూహం గురించి పాక్ కెప్టెన్‌ బాబర్ ఆజం స్పందించాడు. టీ 20 ప్రపంచకప్‌నకు ముందు  పాకిస్తాన్ ఏడు టీ 20 మ్యాచ్‌లను ఆడనుంది. ఇందులో ఐర్లాండ్‌తో 3 మ్యాచ్‌లు... ఇంగ్లాండ్‌తో 4 టీ 20 మ్యాచ్‌లను ఆడనుంది. ఈ మ్యాచ్‌ల కోసం పాక్‌ ఐర్లాండ్‌ వెళ్లగా.. అక్కడ జరిగిన విలేకరుల సమావేశంలో... కోహ్లీపై రచిస్తున్న వ్యూహాలపై పాక్‌ కెప్టెన్‌ స్పందించాడు. వేరే జట్లకు ఎలాంటి ప్రణాళికలైతే రచిస్తామో  భారత జట్టుకు కుడా అలాగే వ్యూహాలు రచిస్తామని ఆజం అన్నాడు. కేవలం ఒకే ఆటగాడికి ప్రత్యేకంగా ఎలాంటి వ్యూహాలు ఉండబోవని స్పష్టం చేశాడు. న్యూయార్క్‌లోని పరిస్థితుల గురించి తమకు పెద్దగా తెలియదని... ఆ పరిస్థితులకు తగ్గట్లుగా తమ ప్లాన్‌ ఉంటుందని ఆజం తెలిపాడు. విరాట్ కోహ్లీ అత్యుత్తమ ఆటగాడని... అతనిపై ప్రత్యేక ప్లాన్‌ ఉంటుందని స్పష్టం చేశాడు. 

 

పాక్‌పై మెరుగైన రికార్డు

తీవ్ర ఒత్తిడిలో అద్భుతమైన ఇన్నింగ్స్‌లు ఆడే కోహ్లీ... పాక్‌పై చాలా మ్యాచుల్లో కీలకమైన ఇన్నింగ్స్‌లు టీమిండియాకు విజయాలు అందించాడు.  కోహ్లి పాకిస్థాన్‌పై 10 మ్యాచుల్లో ఐదు అర్ధ సెంచరీలతో సహా 488 పరుగులు చేశాడు. 

 

కొత్త జెర్సీతో బరిలోకి

వెస్టిండీస్- అమెరికా సంయుక్తంగా నిర్వహించే టీ 20 ప్రపంచ కప్ 2024 కోసం భారత క్రికెట్ జట్టు కొత్త జెర్సీని ప్రముఖ స్పోర్ట్స్‌వేర్‌ బ్రాండ్‌, కిట్‌ స్పాన్సర్‌ అడిడాస్‌ అధికారికంగా విడుదల చేసింది. ఊహించినట్లుగానే ఈ టోర్నమెంట్‌కు భారత క్రికెట్ జట్టు అధికారిక స్పాన్సర్‌గా అడిడాస్ వ్యవహరిస్తుంది. ఈ కొత్త జెర్సీ.. నీలం, కాషాయం రంగులు కలగలిపి ఉంది. ఈ కొత్త జెర్సీని నీలం, కాషాయం రంగులో ఉన్నాయి. వీడియోలో కొత్త ఇండియా కిట్‌తో ఓ హెలికాప్టర్ ఆకాశంలోకి ఎగురుతుండగా.. రోహిత్ శర్మ, రవీంద్ర జడేజా, కుల్దీప్ యాదవ్‌లు చుస్తున్నారు. జెర్సీలో భుజాలు నారింజ రంగులో ఉండగా.. మిగిలిన భాగం నీలం రంగులో ఉంది. ఇక అడిడాస్ ఐకానిక్ మూడు చారలు తెలుపు రంగులో భుజాలపై ఉన్నాయి. ఈ జెర్సీలు మే 7 నుంచి స్టోర్లలో అందుబాటులో ఉంటాయని అడిడాస్ పేర్కొంది. అయితే అధికారికంగా అడిడాస్ జెర్సీని ప్రకటించకముందే సోషల్ మీడియాలో ఇందుకు సంబంధించిన జెర్సీ ఫొటోలు లీక్ అయ్యాయి. అడిడాస్ పోస్ట్ చేసిన వీడియోను బీసీసీఐ రీ ట్వీట్ చేసింది. వన్‌ జెర్సీ. వన్ నేషన్. టీ20 ప్రపంచకప్ 2024 అంటూ బీసీసీఐ పోస్ట్‌ చేసింది.