IND vs BAN 3rd ODI:  చట్టోగ్రామ్ వేదికగా భారత్- బంగ్లా మధ్య మూడో వన్డే జరుగుతోంది. టాస్ గెలిచిన బంగ్లాదేశ్ కెప్టెన్ లిటన్ దాస్ ఫీల్డింగ్ ఎంచుకున్నాడు. బంగ్లా జట్టులో రెండు మార్పులు చేశారు. శాంటో, నసుమ్ అహ్మద్ స్థానంలో తస్కిన్ అహ్మద్, యాసిర్ అలీ ఆ జట్టులోకి వచ్చారు. 'పిచ్ పై పచ్చిక ఉంది. త్వరగా ప్రత్యర్థి వికెట్లు పడగొట్టి వారిపై ఒత్తిడి తెస్తాం. మా సహజమైన ఆటను ఆడాలనుకుంటున్నాం' అని బంగ్లా కెప్టెన్ లిటన్ దాస్ అన్నాడు. 


'గాయాలు మా జట్టుపై ప్రభావం చూపిస్తున్నాయి. మేం ఎప్పుడూ మా అత్యుత్తమ ఆటను ఇవ్వడానికే ప్రయత్నిస్తాం. వన్డేలు ఆడి చాలా కాలం అయ్యింది. ప్రస్తుతం ఈ మ్యాచ్ గెలవడంపైనే మా దృష్టి ఉంది. రోహిత్, దీపక్ చాహర్ స్థానంలో ఇషాన్ కిషన్, కుల్దీప్ యాదవ్ లు జట్టులోకి వచ్చారు.' అని భారత కెప్టెన్ కేఎల్ రాహుల్ అన్నాడు. 






రెండు వన్డేల్లో బ్యాటింగ్, బౌలింగ్, ఫీల్డింగ్ లో సమష్టి వైఫల్యం టీమిండియా కొంప ముంచింది. మరోవైపు బంగ్లా పోరాట తత్వంతో ఓడాల్సిన మ్యాచ్ లను గెలిచి సిరీస్ నెగ్గింది. 


బ్యాటింగ్ లో ఒకరిద్దరే


కాగితంపై బలంగా ఉన్న భారత బ్యాటింగ్ లైనప్... మైదానంలోకి వచ్చేసరికి తుస్సుమనిపించే ప్రదర్శన చేస్తోంది. కెప్టెన్ రోహిత్ ఇప్పటికే దూరమయ్యాడు. శిఖర్ ధావన్ పేలవ ప్రదర్శన చేస్తున్నాడు. కోహ్లీ, రాహుల్ లు అంతంతమాత్రంగానే ఆడుతున్నారు. శ్రేయస్ అయ్యర్ ఒక్కడే నిలకడగా పరుగులు చేస్తున్నాడు. రెండో వన్డేలో అక్షర్ పటేల్ పర్వాలేదనిపించాడు. ఇక ఆల్ రౌండర్లుగా పేరున్న శార్దూల్ ఠాకూర్, వాషింగ్టన్ సుందర్, దీపక్ చాహర్ లు తేలిపోయారు. ఈ మ్యాచులో గెలిచి పరువు నిలుపుకోవాలంటే వీరందరూ బ్యాట్ ఝుళిపించాల్సిందే.


'తోక' తెంచలేకపోతున్న బౌలర్లు


మొదటి 10, 20 ఓవర్ల వరకు బాగా బౌలింగ్ చేస్తున్న టీమిండియా బౌలర్లు మధ్య, చివరి ఓవర్లలో చేతులెత్తేస్తున్నారు. తొలి వన్డేలో ఒక్క వికెట్ పడగొట్టలేక బంగ్లాకు మ్యాచును అప్పగించేశారు. ఇక రెండో వన్డేలో అయితే 69 పరుగులకు 6 వికెట్లు పడగొట్టిన భారత బౌలర్లు... చివరకు 271 పరుగులు ఇచ్చారు. ప్రధాన బౌలర్ అనుకున్న దీపక్ చాహర్ గాయంతో దూరమయ్యాడు. శార్దూల్ ఠాకూర్ పొదుపుగా బౌలింగ్ చేస్తున్నప్పటికీ వికెట్లు తీయడంలేదు. ఇక సిరాజ్ వికెట్లు తీస్తున్నప్పటికీ భారీగా పరుగులిస్తున్నాడు. ఉమ్రాన్ మాలిక్ కూడా అంతే.  స్పిన్ విభాగంలో కుల్దీప్ యాదవ్ జట్టుతో చేరాడు. అతను ప్లేయింగ్ ఎలెవన్ లో ఉంటే స్పిన్ బలోపేతమవుతుంది. 


బంగ్లా చేతిలో వైట్ వాష్ నుంచి తప్పించుకోవాలంటే టీమిండియా సమష్టిగా రాణించాల్సిందే.


పిచ్ పరిస్థితి


ఈ మ్యాచ్ చట్టోగ్రామ్ లోని జహుర్ అహ్మద్ చౌదరి స్టేడియంలో జరగనుంది. బంగ్లాదేశ్ చివరిసారిగా ఈ ఏడాది ప్రారంభంలో ఆఫ్ఘనిస్థాన్‌తో ఇక్కడ ఆడింది. ఆ సిరీస్‌లో 6 ఇన్నింగ్సుల్లో ఒకసారి మాత్రమే 300 స్కోరు నమోదైంది. వర్షం పడే సూచనలు లేవు. 


బంగ్లాదేశ్ తుది జట్టు


 లిట్టన్ దాస్ (కెప్టెన్), అనముల్ హక్, షకీబ్ అల్ హసన్, యాసిర్ అలీ, ముష్ఫికర్ రహీమ్ (వికెట్ కీపర్), మహ్మదుల్లా, అఫీఫ్ హుస్సేన్, మెహిదీ హసన్ మిరాజ్, నసుమ్ అహ్మద్, ఎబాడోత్ హుస్సేన్, ముస్తాఫిజుర్ రెహ్మాన్, తస్కిన్ అహ్మద్.


భారత్ తుది జట్టు 


శిఖర్ ధావన్, విరాట్ కోహ్లీ, శ్రేయాస్ అయ్యర్, ఇషాన్ కిషన్, కేఎల్. రాహుల్ (కెప్టెన్, వికెట్ కీపర్), వాషింగ్టన్ సుందర్, అక్షర్ పటేల్, శార్దూల్ ఠాకూర్, కుల్దీప్ యాదవ్, మహ్మద్ సిరాజ్, ఉమ్రాన్ మాలిక్.