IND W vs AUS W: డీవై పాటిల్ మైదానంలో ఆస్ట్రేలియా వుమెన్స్ జట్టుతో జరిగిన మొదటి టీ20లో భారత అమ్మాయిల జట్టు 9 వికెట్ల తేడాతో పరాజయం పాలైంది. భారత వుమెన్స్ జట్టు నిర్దేశించిన 173 పరుగుల లక్ష్యాన్ని ఆసీస్ అమ్మాయిల జట్టు 18.1 ఓవర్లలో కేవలం ఒక వికెట్ మాత్రమే కోల్పోయి ఛేదించింది. ఈ విజయంతో 5 టీ20ల సిరీస్ లో 1-0 ఆధిక్యంలోకి వెళ్లింది.
టాస్ గెలిచిన ఆస్ట్రేలియా, భారత్ కు బ్యాటింగ్ ను అప్పగించింది. ఓపెనర్లలో షెఫాలీ వర్మ ధాటిగా ఆడింది. అయితే 10 బంతుల్లో 21 పరుగులు చేసి ఔటైంది. స్మృతి మంధాన 28 పరుగులకు పెవిలియన్ చేరింది. వన్ డౌన్ లో వచ్చిన జెమీమా రోడ్రిగ్స్ డకౌట్ అయ్యింది. దీంతో 59 పరుగులకే 3 వికెట్లు కోల్పోయింది. ఈ స్థితిలో హర్మన్ ప్రీత్ కౌర్ (21), దేవికా వైద్య (23) కాసేపు వికెట్ల పతనాన్ని అడ్డుకున్నారు. అయితే వారు మరీ నెమ్మదిగా బ్యాటింగ్ చేశారు. 6-12 ఓవర్ల మధ్య ఆసీస్ అమ్మాయిలు కట్టుదిట్టంగా బంతులేశారు. దీంతో ఒక దశలో భారత్ 12 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి 76 పరుగులు చేసింది.
చెలరేగిన రిచా ఘోష్, దీప్తి శర్మ
భారత్ ఇన్నింగ్స్ నత్తనడకన సాగుతున్న వేళ మిడిలార్డర్ బ్యాటర్ రిచా ఘోష్ విధ్వంసం సృష్టించింది. ఎడాపెడా బౌండరీలు బాదుతూ 20 బంతుల్లోనే 36 పరుగులు చేసింది. 17వ ఓవర్లో రిచా ఔటయ్యింది. అయితే ఆ తర్వాత బ్యాట్ ఝుళిపించే బాధ్యతను దీప్తి శర్మ తీసుకుంది. ఆమె చివరి ఓవర్లో 4 బౌండరీలు సాధించింది. 15 బంతుల్లో 36 పరుగులు చేసి నాటౌట్ గా నిలిచింది. దీంతో భారత్ 5 వికెట్లకు 172 పరుగులు చేసింది. ఆసీస్ బౌలర్లలో ఎల్లీస్ పెర్రీ 2 వికెట్లు తీసింది.
ఆసీస్ అమ్మాయిల దూకుడు
173 పరుగుల లక్ష్య ఛేదనలో మొదటి నుంచి ఆస్ట్రేలియా అమ్మాయిలు దూకుడుగా ఆడారు. ఓపెనర్లు బెత్ మూనీ (89 నాటౌట్), కెప్టెన్ హేలీ (37) భారత బౌలర్లపై విరుచుకుపడ్డారు. వారి ధాటికి టీమిండియా బౌలర్లు నిస్సహాయులయ్యారు. దేవికా వైద్య హేలీని ఔట్ చేసినప్పటికీ.. తహ్లియా మెక్ గ్రాత్ (29 బంతుల్లో 40) తో మూనీ తన జట్టును విజయతీరాలకు చేర్చింది.