IND vs BAN:
మీర్పూర్ టెస్టు ఆసక్తికరంగా సాగుతోంది. రెండు జట్లు నువ్వా నేనా అన్నట్టుగా తలపడుతున్నాయి. రెండోరోజు ఒకరిపై మరొకరు పైచేయి సాధించేందుకు ప్రయత్నిస్తున్నాయి. శుక్రవారం ఓవర్‌నైట్ స్కోరు 19/0తో ఇన్నింగ్స్ కొనసాగించిన టీమ్‌ఇండియా 86.3 ఓవర్లకు 314కు ఆలౌటైంది. 87 పరుగుల ఆధిక్యం సాధించింది. ఆ తర్వాత రెండో ఇన్నింగ్స్ ఆరంభించిన బంగ్లా ఆట ముగిసే సరికి 6 ఓవర్లకు వికెట్ నష్టపోకుండా 7 పరుగులు చేసింది. నజ్ముల్ హుస్సేన్ (5 బ్యాటింగ్), జకీర్ హుస్సేన్ (2 బ్యాటింగ్) క్రీజులో నిలిచారు. అంతకు ముందు టీమ్‌ఇండియాలో రిషభ్ పంత్ (93; 104 బంతుల్లో 7x4, 5x6), శ్రేయస్ అయ్యర్ (87; 105 బంతుల్లో 10x4, 2x6) అదరగొట్టారు.
టాప్-4 మామూలే!
రెండో రోజు, శుక్రవారం జట్టు స్కోరు 19/0తో ఇన్నింగ్స్ కొనసాగించిన టీమ్‌ఇండియాకు శుభారంభం దక్కలేదు. తైజుల్ ఇస్లామ్ దెబ్బకు కీలక వికెట్లు చేజార్చుకుంది. వ్యక్తిగత స్కోరు 3తో బ్యాటింగ్‌కు దిగిన కేఎల్ రాహుల్‌ను 13.1వ బంతిని ఆడబోయి ఎల్బీ అయ్యాడు. మరో రెండు ఓవర్లకే శుభ్‌మన్ గిల్ (ఓవర్‌నైట్ స్కోర్ 14)ను ఔట్ చేశాడు. విరాట్ కోహ్లీ (24; 73 బంతుల్లో 3x4), చెతేశ్వర్ పుజారా (24; 55 బంతుల్లో 2x4) ఇన్నింగ్స్ చక్కదిద్దారు. ఉదయం పిచ్, బంతి స్వభావం మారిపోవడంతో ఆచితూచి ఆడారు. మూడో వికెట్‌కు 93 బంతుల్లో 34 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు. స్కోరు వేగం పెరుగుతుందనే లోపు పుజారా ఔటయ్యాడు. ఇస్లామ్ వేసిన 30.4వ బంతి బ్యాటు అంచుకు తగిలి మోమినల్ హఖ్ చేతిలో పడింది. బంగ్లా ఫీల్డర్లు సెలబ్రేట్ చేసుకుంటున్నా బంతి తాకలేదనుకొని పుజారా అక్కడే నిలబడ్డాడు. అంపైర్లు థర్డ్ అంపైర్‌కు రిఫర్ చేయగా ఔటని తేలింది. మరికాసేపటికే కోహ్లీని తస్కిన్ అహ్మద్ ఔట్ చేశాడు.
శ్రేయస్, రిషభ్ అదుర్స్!
కేవలం 94 పరుగులకే 4 వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడ్డ టీమ్‌ఇండియాను యువ ఆటగాళ్లు ఆదుకున్నారు. రిషభ్ పంత్, శ్రేయస్ అయ్యర్ క్రీజులో పాతుకుపోయారు. మెరుగైన రన్‌రేట్‌తో బౌలర్లను అటాక్ చేశారు. ఐదో వికెట్‌కు 182 బంతుల్లో 159 పరుగుల భాగస్వామ్యం అందించారు. పంత్ 49, శ్రేయస్ 60 బంతుల్లో హాఫ్ సెంచరీలు అందుకున్నారు. సిక్సర్లు బాదేస్తూ దూకుడుగా ఆడిన పంత్ ప్రత్యర్థిన భయపెట్టాడు. అయితే సెంచరీకి 7 రన్స్ దూరంలో అతడిని మెహదీ హసన్ ఔట్ చేశాడు. అప్పటికి స్కోరు 253. స్వల్ప వ్యవధిలోనే అక్షర్ పటేల్ (4), శ్రేయస్ అయ్యర్, రవిచంద్రన్ అశ్విన్ (12) షకిబ్ పెవిలియన్ పంపించాడు. జయదేవ్ ఉనద్కత్ (14), ఉమేశ్ యాదవ్ (14) కాసేపు పోరాడటంతో టీమ్‌ఇండియా 87 పరుగుల ఆధిక్యం లభించింది.