IND vs BAN, 2nd Test:
మీర్పూర్ టెస్టు రెండో ఇన్నింగ్సులో టీమ్‌ఇండియా ఇబ్బంది పడుతోంది. రెండో రోజు ఆట మొదలు పెట్టిన భారత్ 31 ఓవర్లకు 3 వికెట్ల నష్టానికి 73 పరుగులు చేసింది. విరాట్ కోహ్లీ (16; 48 బంతుల్లో 2x4), రిషభ్ పంత్ (1; 1 బంతుల్లో) బ్యాటింగ్ చేస్తున్నారు. కేఎల్ రాహుల్ (10; 45 బంతుల్లో 1x4), శుభ్‌మన్ గిల్ (20; 39 బంతుల్లో 1x4, 1x6) స్వల్ప స్కోర్లకే ఔటయ్యారు. రెండు ఓవర్ల వ్యవధిలో వీరిద్దరినీ తైజుల్ ఇస్లామ్ వికెట్ల ముందు దొరకబుచ్చుకున్నాడు. నయావాల్ చెతేశ్వర్ పుజారా (24; 55 బంతుల్లో 2x4) కాస్త పోరాడాడు.
తైజుల్ కిర్రాక్ బౌలింగ్
రెండో రోజు, శుక్రవారం జట్టు స్కోరు 19/0తో ఇన్నింగ్స్ కొనసాగించిన టీమ్‌ఇండియాకు శుభారంభం దక్కలేదు. తైజుల్ ఇస్లామ్ దెబ్బకు మూడు వికెట్లు చేజార్చుకుంది. వ్యక్తిగత స్కోరు 3తో బ్యాటింగ్‌కు దిగిన కేఎల్ రాహుల్‌ను 13.1వ బంతిని ఆడబోయి ఎల్బీ అయ్యాడు. మరో రెండు ఓవర్లకే శుభ్‌మన్ గిల్ (ఓవర్‌నైట్ స్కోర్ 14)ను ఔట్ చేశాడు.
ఈ క్రమంలో విరాట్ కోహ్లీ, చెతేశ్వర్ పుజారా ఇన్నింగ్స్‌ను కొనసాగించారు. ఉదయం పిచ్, బంతి స్వభావం మారిపోవడంతో ఆచితూచి ఆడారు. మూడో వికెట్‌కు 93 బంతుల్లో 34 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు. స్కోరు వేగం పెరుగుతుందనే లోపు పుజారా ఔటయ్యాడు. ఇస్లామ్ వేసిన 30.4వ బంతి బ్యాటు అంచుకు తగిలి మోమినల్ హఖ్ చేతిలో పడింది. బంగ్లా ఫీల్డర్లు సెలబ్రేట్ చేసుకుంటున్నా బంతి తాకలేదనుకొని పుజారా అక్కడే నిలబడ్డాడు. అంపైర్లు థర్డ్ అంపైర్‌కు రిఫర్ చేయగా ఔటని తేలింది. అప్పటికి స్కోరు 72/3.