Hockey World Cup 2023:
పురుషుల హాకీ ప్రపంచకప్ 2023 జట్టును హాకీ ఇండియా ప్రకటించింది. 18 మందితో కూడిన బృందానికి హర్మన్‌ప్రీత్ సింగ్‌ను కెప్టెన్‌గా నియమించింది. యువ కెరటం అమిత్ రోహిదాస్‌ను వైస్ కెప్టెన్‌గా ఎంపిక చేసింది. బెంగళూరులోని క్రీడా ప్రాధికార కేంద్రంలో రెండు రోజులు ట్రయల్స్ నిర్వహించాక ఆటగాళ్లను ఎంపిక చేశారు. మొత్తం 33 మంది పాల్గొనగా 18 మంది ఎంపికయ్యారు.
ఈ సారి హాకీ ప్రపంచకప్ భారత్‌లోనే జరుగుతోంది. ఒడిశా రాజధాని భువనేశ్వర్, రూర్కెలా మ్యాచులకు ఆతిథ్యం ఇస్తున్నాయి. జనవరి 13 నుంచి పోటీలు మొదలవుతాయి. ఈ మెగా టోర్నీలో టీమ్‌ఇండియా పూల్-డిలో ఉంది. లీగు మ్యాచుల్లో ఇంగ్లాండ్, స్పెయిన్, వేల్స్‌తో తలపడనుంది. రూర్కెలాలోని బిర్సా ముండా స్టేడియంలో జనవరి 13న స్పెయిన్‌తో టీమ్‌ఇండియా తన మొదటి మ్యాచ్ ఆడనుంది.
గోల్ కీపర్లుగా పీఆర్ శ్రీజేశ్, కృషన్ బి పాఠక్‌ను సెలక్టర్లు ఎంపిక చేశారు. వీరిద్దరూ ప్రపంచకప్ ఆడటం ఇది నాలుగో సారి. కెప్టెన్ హర్మన్ ప్రీత్, అమిత్, సురేందర్ కుమార్, వరుణ్ కుమార్, జర్మన్‌ప్రీత్ సింగ్, నీలమ్ సంజీప్ ఎక్సెస్‌తో టీమ్‌ఇండియా డిఫెన్స్ బలంగా ఉంది. యంగ్ ప్రాడగీ వివేక్ సాగర్ ప్రసాద్ తిరిగి మిడ్‌ఫీల్డ్‌లో పునరాగమనం చేస్తున్నాడు. గాయం కారణంగా అతడు హాకీ ప్రో లీగ్, ఆస్ట్రేలియా పర్యటనకు అందుబాటులో లేడు. అతడితో పాటు మన్‌ప్రీత్ సింగ్, హార్దిక్ సింగ్, నీలకంఠ శర్మ, షంషేర్ సింగ్, ఆకాశ్ దీప్ ఉంటారు.
మన్‌దీప్ సింగ్, లలిత్ కుమార్ ఉపాధ్యాయ్, అభిషేక్, సుఖ్‌జీత్ సింగ్ ఫార్వర్డ్ బృందంలో ఉన్నారు. రాజ్‌కుమార్ పాల్, జగ్‌రాజ్ సింగ్‌ను ప్రత్యామ్నాయ ఆటగాళ్లుగా ఎంపిక చేశారు. 'ఈ హాకీ ప్రపంచకప్ అత్యంత కీలకం. సొంతగడ్డపై జరుగుతుండటంతో టోర్నీపై ఆసక్తి నెలకొంది. అలాగే టీమ్‌ఇండియాపై అదనపు ఒత్తిడి ఉంటుంది. అన్ని జట్లు అత్యుత్తమ ఆటగాళ్లనే ఎంపిక చేస్తాయి. మెరుగైన సన్నద్ధతతో ఇక్కడికొస్తాయి. మేమూ ఈ రెండింటినీ పరిగణనలోకి తీసుకున్నాం. అనుభవంతో పాటు కుర్రాళ్లనూ ఎంపిక చేశాం' అని టీమ్‌ఇండియా కోచ్ గ్రాహమ్ రీడ్ అన్నారు.
హాకీ ప్రపంచకప్‌నకు భారత జట్టు
గోల్ కీపర్లు: శ్రీజేశ్ రవీంద్రన్, కృషన్ బహదూర్ పాఠక్
డిఫెండర్లు : హర్మన్‌ప్రీత్ సింగ్, అమిత్ రోహిదాస్, జర్మన్‌ప్రీత్ సింగ్, సురేందర్ కుమార్, వరుణ్ కుమార్, నీలమ్ సంజీప్
మిడ్ ఫీల్డర్లు: మన్‌ప్రీత్ సింగ్, హార్దిక్ సింగ్, నీలకంఠ శర్మ, షంషేర్ సింగ్, వివేక్ సాగర్ ప్రసాద్, ఆకాశ్‌దీప్ సింగ్
ఫార్వర్డ్స్: మన్‌దీప్ సింగ్, లలిత్ కుమార్ ఉపాధ్యాయ్, అభిషేక్, సుఖ్‌జీత్ సింగ్
ప్రత్యామ్నాయ ఆటగాళ్లు: రాజ్‌కుమార్ పాల్, జగ్‌రాజ్ సింగ్