IND vs BAN, 2nd Test:  టీమిండియాతో జరుగుతున్న రెండో టెస్టు తొలి ఇన్నింగ్స్ లో బంగ్లాదేశ్ ఓ మోస్తరు స్కోరుకే పరిమితమైంది. భారత బౌలర్లు ఉమేష్ యాదవ్, రవిచంద్రన్ అశ్విన్ లు విజృంభించటంతో 227 పరుగులకు ఆలౌటైంది. 12 ఏళ్ల తర్వాత రెండో టెస్టు ఆడుతున్న జైదేవ్ ఉనద్కత్ 2 వికెట్లతో ఆకట్టుకున్నాడు. బంగ్లా బ్యాటర్లలో మోమినల్ హక్ (84) రాణించాడు. శాంటో (24), ముష్ఫికర్ రహీం (26), లిటన్ దాస్ (25)లు మంచి ఆరంభాల్ని భారీ స్కోర్లుగా మలచడంలో విఫలమయ్యారు. 






టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న బంగ్లాదేశ్ ఇన్నింగ్స్ ను ఓపెనర్లు నజ్ముల్ హుస్సేన్ శాంటో (24), జకీర్ హసన్ (15) లు నెమ్మదిగా ప్రారంభించారు. వీరిద్దరూ తొలి వికెట్ కు 39 పరుగులు జోడించాక జకీర్ ను జైదేవ్ ఉనద్కత్ ఔట్ చేశాడు. ఆ వెంటనే అశ్విన్ బౌలింగ్ లో శాంటో వికెట్ల ముందు దొరికిపోయాడు. అయితే కెప్టెన్ షకీబుల్ హసన్, మోమినల్ హక్ లు నిలకడగా ఆడటంతో లంచ్ వరకు మరో వికెట్ కోల్పోకుండా బంగ్లా 82 పరుగులు చేసింది. 






ఉమేష్ 4, అశ్విన్ 4


అయితే లంచ్ తర్వాత తొలి బంతికే ఉమేష్ బౌలింగ్ లో పుజారాకు క్యాచ్ ఇచ్చి షకీబ్ (16) ఔటయ్యాడు. ఆ తర్వాత వరుస విరామాల్లో బంగ్లా వికెట్లు కోల్పోయింది ఓవైపు మోమినల్ హక్ (84) క్రీజులో పాతుకుపోయి ఆడుతున్నప్పటికీ.. అతనికి సరైన సహకారం అందలేదు. దీంతో బంగ్లాదేశ్ 73.5 ఓవర్లలో 227 పరుగులకు ఔటయ్యింది. భారత బౌలర్లలో ఉమేష్ యాదవ్ కట్టుదిట్టంగా బంతులేయడమే కాక 4 వికెట్లు పడగొట్టాడు. అశ్విన్ కూడా 4 వికెట్లతో రాణించాడు. 


తర్వాత తొలి ఇన్నింగ్స్ మొదలుపెట్టిన టీమిండియా ఆట ముగిసే సమయానికి వికెట్ నష్టపోకుండా 19 పరుగులు చేసింది. ఓపెనర్లు కేఎల్ రాహుల్ (3), శుభ్ మన్ గిల్ (14)లు క్రీజులో ఉన్నారు.