Tymal Mills:


ఇంగ్లాండ్‌ పేసర్‌ తైమల్‌ మిల్స్‌ ఓ విపత్కర పరిస్థితిని ఎదుర్కోవాల్సి వచ్చింది. బిగ్‌బాష్ లీగ్‌ ఆడేందుకు ఆస్ట్రేలియాకు వెళ్తుండగా అతడి కుమార్తెకు స్ట్రోక్‌ వచ్చింది. దాంతో ఎక్కాల్సిన విమానాన్ని వదిలేసి వెంటనే ఇంటికి తిరిగొచ్చేశాడు. ప్రస్తుతం ఆమె వేగంగా కోలుకుంటుందని పేర్కొన్నాడు. అనేక ఔషధాలు వాడుతోందని వివరించాడు.


ఐసీసీ టీ20 ప్రపంచకప్‌ గెలిచిన ఇంగ్లాండ్‌ జట్టులో తైమల్‌ మిల్స్‌ సభ్యుడు. ప్రపంచ వ్యాప్తంగా అనేక లీగుల్లో ఆడుతుంటాడు. బిగ్‌బాష్‌లో పెర్త్‌ స్కార్చర్స్‌కు ప్రాతినిధ్యం వహిస్తాడు. కుటుంబలో అత్యవర స్థితి ఏర్పడటంతో అతడు టోర్నీ నుంచి తప్పుకోవాల్సి వచ్చిందని స్కార్చర్స్‌ తెలిపింది.


'అత్యంత భయానకమైన 11 రోజుల తర్వాత క్రిస్‌మస్‌ కోసం ఇంటికి వెళ్తున్నాం' అని తైమల్‌ మిల్స్‌ ఇన్‌స్టాలో పోస్టు చేశాడు. 'మేం ఆస్ట్రేలియా వెళ్లేందుకు ఎయిర్‌పోర్టులో ఉండగా మా కుమార్తెకు స్ట్రోక్‌ వచ్చింది. ఆమె ఎడమవైపు పక్షవాతానికి గురైంది. ఎంత వరకు కోలుకుంటుందో చెప్పలేమని వైద్యులు అన్నారు. ఎన్ని సవాళ్లు ఎదురైనా మా చిట్టితల్లి ధైర్యంగా ఎదుర్కొని అందరినీ ఆశ్చర్య పరిచింది. చాలా వేగంగా కోలుకొని ఆస్పత్రి నుంచి వచ్చేసింది' అని మిల్స్‌ అన్నాడు.


'ఆమె చాలా కసరత్తులు చేయాల్సి ఉంది. ఎన్నో ఔషధాలు తీసుకోవాల్సి ఉంటుంది. మున్ముందు స్కాన్సింగ్స్‌ అవసరం అవుతుంది. కానీ ప్రస్తుత మెరుగుదలకు మేమెంతో సంతోషిస్తున్నాం. మాకు అండగా నిలిచిన అందరికీ కృతజ్ఞతలు. మీకిష్టమైన వాళ్లని జాగ్రత్తగా చూసుకోండి' అని తైమల్‌ మిల్స్‌ వెల్లడించాడు.


తైమల్‌ మిల్స్‌ స్థానంలో డేవిడ్‌ పేన్‌ను తీసుకున్నామని పెర్త్‌ స్కార్చర్స్‌ తెలిపింది. అతడు గ్లూసెస్టర్‌షైర్‌కు ఆడుతున్నాడని వెల్లడించింది. అతడు అత్యంత వేగంగా బంతులేసే ఎడమచేతి వాటం బౌలరని వివరించింది. డ్రాఫ్ట్‌ చేసుకున్న ముగ్గురు విదేశీయులు అందుబాటులో లేకపోవడంతో ప్రస్తుతం ఆ జట్టు మిగతా వారిని తీసుకుంటోంది. ఆస్ట్రేలియా సిరీసులో ఫిల్‌ సాల్ట్‌ గాయపడగా డోప్‌ టెస్టులో విఫలమైన లారీ ఇవాన్స్‌ ఒప్పందాన్ని స్కార్చర్స్‌ రద్దు చేసింది. డుప్లెసిస్‌, ఆడమ్‌ లిథ్‌, స్టీఫెన్‌ స్కినాజి జట్టులో ఉన్నారు.