IND vs BAN 2ND Test:  జయదేవ్ ఉనద్కత్... ఎప్పుడో పన్నెండేళ్ల క్రితం భారత టెస్ట్ క్రికెట్లోకి అరంగేట్రం చేశాడు. 2010లో డిసెంబర్ 16న దక్షిణాఫ్రికాపై తొలి టెస్ట్ ఆడాడు. ఆ మ్యాచులో వికెట్లేమీ తీయలేదు. ఆ తర్వాత జట్టుకు దూరమయ్యాడు. ఒకటీ రెండు కాదు ఏకంగా 12 ఏళ్లు మళ్లీ జట్టులోకి రాలేదు. ఇటీవల విజయ్ హజారే ట్రోఫీలో అధ్బుతమైన ప్రదర్శన చేసి సెలక్టర్లను ఆకట్టుకున్నాడు. బంగ్లాదేశ్ తో జరుగుతున్న టెస్ట్ సరీస్ కు ఎంపికయ్యాడు. రెండో టెస్టులో తన తొలి వికెట్ ను దక్కించుకున్నాడు. 


బంగ్లాదేశ్ తో రెండో టెస్టుకు స్పిన్నర్ కుల్దీప్ యాదవ్ స్థానంలో జయదేవ్ ఉనద్కత్ తుది జట్టులోకి వచ్చాడు. ఈ మ్యాచులో టాస్ గెలిచిన బంగ్లాదేశ్ బ్యాటింగ్ ఎంచుకుంది. ఆ జట్టు ఓపెనర్లు శాంటో, జకీర్ హసన్ లు ఇన్నింగ్స్ ను నిలకడగా ప్రారంభించారు. అయితే అంతర్జాతీయ కెరీర్ లో రెండో టెస్ట్ ఆడుతున్న జయదేవ్ ఉనద్కత్ 15వ ఓవర్లో తన తొలి వికెట్ తీసుకోవటంతో పాటు.. జట్టుకు తొలి వికెట్ ను అందించాడు. ఆ ఓవర్లో ఉనద్కత్ వేసిన బంతిని జకీర్ షాట్ ఆడగా అది క్యాచ్ లేచింది. దాన్ని కెప్టెన్ రాహుల్ అందుకున్నాడు. దీంతో బంగ్లా మొదటి వికెట్ కోల్పోయింది. ఆ తర్వాత అశ్విన్ శాంటోను ఔట్ చేయటంతో భారత్ కు 2 వికెట్లు దక్కాయి. ప్రస్తుతం బంగ్లాదేశ్ లంచ్ సమయానికి 2 వికెట్ల నష్టానికి 82 పరుగులు చేసింది. షకీబ్ (16), మోమినల్ హక్ (23) క్రీజులో ఉన్నారు. 


అరుదైన రికార్డ్ సాధించిన ఉనద్కత్


2010లో అరంగేట్రంలో తొలి టెస్ట్ ఆడిన జయదేవ్ ఉనద్కత్... మళ్లీ 12 ఏళ్ల సుదీర్ఘ విరామం తర్వాత తన రెండో టెస్ట్ మ్యాచును ఆడుతున్నాడు. ఈ క్రమంలోనే ఒక అరుదైన రికార్డును తన ఖాతాలో వేసుకున్నాడు. టెస్ట్ క్రికెట్ చరిత్రలోనే అత్యంత ఎక్కువ మ్యాచులకు దూరమైన తొలి భారత క్రికెటర్ గా నిలిచాడు. అలాగే ప్రపంచవ్యాప్తంగా అత్యధిక టెస్ట్ లకు దూరమైన రెండో క్రికెటర్ గానూ రికార్డ్ నెలకొల్పాడు. జయదేవ్ కంటే ముందు ఇంగ్లండ్ క్రికెటర్ గెరిత్ బ్యాటీ 142 మ్యాచులకు దూరమయ్యాడు.