IND vs BAN, 2nd Test: బంగ్లాదేశ్ తో వన్డే సిరీస్ ను కోల్పోయిన టీమిండియా టెస్ట్ సిరీస్ ను విజయంతో ప్రారంభించింది. తొలి టెస్టులో మొదటి రోజు తొలి సెషన్ లో తడబడ్డా... తర్వాత మ్యాచ్ ఆద్యంతం రాణించిన భారత్ 188 పరుగుల తేడాతో బంగ్లాను ఓడించింది. ఇప్పుడు రెండో టెస్టుకు సిద్ధమైంది. మీర్పూర్ వేదికగా నేడు భారత్- బంగ్లా రెండో టెస్ట్ జరగనుంది. ఇది గెలిస్తే టీమిండియా 2-0తో సిరీస్ ను గెలుచుకుంటుంది. ఒకవేళ బంగ్లా విజయం సాధిస్తే సిరీస్ 1-1తో సమం అవుతుంది.
భారత్ ఆల్ రౌండ్ హిట్
తొలి టెస్టులో బ్యాటింగ్, బౌలింగ్ విభాగాల్లో భారత్ మెరుగ్గా రాణించింది. గిల్, పుజారా, శ్రేయస్ అయ్యర్, అశ్విన్, పంత్ లు రాణించారు. రాహుల్, కోహ్లీ మాత్రమే విఫలమయ్యారు. వారు కూడా రాణిస్తే టీమిండియాకు తిరుగుండదు. అయితే ప్రాక్టీసులో రాహుల్ గాయపడటంతో ఈ మ్యాచ్ లో అతను ఆడేది అనుమానమే. ఒకవేళ కెప్టెన్ దూరమైతే అభిమన్యు ఈశ్వరన్ ఓపెనర్ గా రావచ్చు. బౌలింగ్ విభాగంలోనూ అందరూ ఆకట్టుకున్నారు. తన పునరాగమనంలో కుల్దీప్ యాదవ్ ఆల్ రౌండ్ ప్రదర్శనతో చెలరేగాడు. అక్షర్ పటేల్ రాణించాడు. అశ్విన్ బౌలింగ్ ప్రదర్శనే కొంచెం కలవరపెడుతోంది. పేసర్లు ఉమేష్ యాదవ్, మహ్మద్ సిరాజ్ లు ఆకట్టుకున్నారు. రెండో వన్డేలోనూ ఇలాంటి సమష్టి ప్రదర్శన కనబరిస్తే బంగ్లాను ఓడించడం కష్టం కాకపోవచ్చు.
బంగ్లాను తక్కువ అంచనా వేయొద్దు
తొలి టెస్టులో ఓడిపోయినంత మాత్రాన బంగ్లాదేశ్ ను తక్కువ అంచనా వేయడానికి వీల్లేదు. నాణ్యమైన బ్యాటర్లు, బౌలర్లు ఆ జట్టుకున్నారు. తొలి మ్యాచ్ లో మొదటి సెషన్ లోనే 3 వికెట్లు పడగొట్టారు వారి బౌలర్లు. ఆ జట్టు కెప్టెన్ షకీబుల్ హసన్ భుజం గాయంతో మొదటి మ్యాచులో ఎక్కువ బౌలింగ్ చేయలేదు. అయితే స్పిన్ కు అనుకూలించే మీర్పూర్ పిచ్ పై షకీబ్ పూర్తిస్థాయి బౌలింగ్ వేసే అవకాశముంది. అలాగే మిరాజ్, తైజుల్ ఇస్లాం లాంటి స్పిన్నర్లు... ఖలీద్ అహ్మద్, అబాదత్ హొస్సేన్ లాంటి పేసర్లు ఉన్నారు. బ్యాటింగ్ లో అరంగేట్ర ఆటగాడు జకీర్ హసన్ సెంచరీతో ఆకట్టుకున్నాడు. శాంటో, షకీబ్ రాణించారు. ఇక ముష్ఫికర్ రహీం, లిటన్ దాస్ లు కూడా ఫాంలోకి వస్తే ఆ జట్టు బ్యాటింగ్ విభాగం బలంగా మారుతుంది. తొలి టెస్ట్ తొలి ఇన్నింగ్సు లో తక్కువ స్కోరుకే ఆలౌటైనప్పటికీ.. రెండో ఇన్నింగ్స్ లో భారీ లక్ష్య ఛేదనలో ఆ జట్టు బ్యాటర్లు పోరాడిన విధానాన్ని భారత్ మర్చిపోకూడదు.
ఇక్కడ గెలిస్తే అక్కడికి మార్గం సుగమం
బంగ్లాదేశ్ ను రెండో టెస్టులో ఓడిస్తే వరల్డ్ టెస్ట్ ఛాంపియన్ షిప్ (డబ్ల్యూటీసీ) ఫైనల్ కు మరింత చేరువవుతుంది టీమిండియా. ప్రస్తుతం రెండో స్థానంలో ఉన్న భారత్ పాయింట్లు మరింత మెరుగవుతాయి. అయితే ఇది ఓడితే మాత్రం భారత్ ర్యాంక్ పడిపోయే అవకాశం ఉంది. కాబట్టి బంగ్లాతో ఉదాసీనతకు తావివ్వకుండా ఆడాల్సిన అవసరముంది.
పిచ్ పరిస్థితి
ఇక్కడి పిచ్ స్పిన్నర్లకు స్వర్గధామంలా ఉంటుంది. తొలి రోజు బ్యాటింగ్ కు సహకరించే అవకాశం ఉంది. ఆ తర్వాత స్పిన్నర్లు అనుకూలంగా మారుతుంది. కాబట్టి టాస్ గెలిచిన జట్టు కచ్చితంగా బ్యాటింగ్ ఎంచుకునే అవకాశం ఉంది.
భారత్ తుది జట్టు (అంచనా)
కేఎల్ రాహుల్ అభిమన్యు (కెప్టెన్) / ఈశ్వరన్, శుభ్ మన్ గిల్, ఛతేశ్వర్ పుజారా, విరాట్ కోహ్లీ, శ్రేయస్ అయ్యర్, రిషభ్ పంత్ (వికెట్ కీపర్), రవి అశ్విన్, కుల్దీప్ యాదవ్, అక్షర్ పటేల్, ఉమేష్ యాదవ్, మహ్మద్ సిరాజ్.
బంగ్లాదేశ్ తుది జట్టు (అంచనా)
మహ్మదుల్ హసన్, జకీర్ హసన్, నజ్ముల్ హొస్సేన్, మోమినుల్ హక్, ముష్ఫికర్ రహీమ్, లిటన్ దాస్ (వికెట్ కీపర్), షకీబ్ అల్ హసన్ (కెప్టెన్), మెహిదీ హసన్, తైజుల్ ఇస్లాం, ఖలీద్ అహ్మద్, తస్కిన్ అహ్మద్/ నసుమ్ అహ్మద్.