ICC World Test Rankings: ఐసీసీ బుధవారం ప్రకటించిన టెస్ట్ ర్యాంకుల్లో భారత ఆటగాళ్లు కొందరు మెరుగైన ర్యాంకులు సాధించారు. టీమిండియా ఆల్ రౌండర్ అక్షర్ పటేల్ టెస్టుల్లో తన అత్యుత్తమ ర్యాంకును పొందాడు. బంగ్లాదేశ్ తో తొలి టెస్టులో రాణించిన అక్షర్ 20 స్థానాలు మెరుగుపరచుకుని 18వ ర్యాంకులో నిలిచాడు. అలాగే బంగ్లాతో మొదటి టెస్ట్ మ్యాచులో ఆల్ రౌండ్ ప్రదర్శనతో ఆకట్టుకున్న కుల్దీప్ యాదవ్ టాప్- 50 లో చోటు సంపాదించాడు. మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు సాధించిన కుల్దీప్ 19 స్థానాలు ఎగబాకి 49వ ర్యాంకు సాధించాడు. భారత బౌలర్లలో జస్ప్రీత్ బుమ్రా, అశ్విన్ లు వరుసగా 4,5 స్థానాల్లో కొనసాగుతున్నారు.
బంగ్లాతో తొలి టెస్టులో శతకం, అర్ధశతకం సాధించిన పుజారా 10 స్థానాలు మెరుగై 16వ ర్యాంకు అందుకున్నాడు. అలాగే బంగ్లాదేశ్ తో మొదటి మ్యాచ్ లో రాణించిన శ్రేయస్ అయ్యర్ 11 స్థానాలు ఎగబాకి 26వ ర్యాంకులో కొనసాగుతున్నాడు. రిషభ్ పంత్ 6వ ర్యాంక్, రోహిత్ శర్మ 9వ ర్యాంక్, విరాట్ కోహ్లీ 12వ స్థానాల్లో ఉన్నారు.
బంగ్లాతో రెండో టెస్టులో టీమిండియా
ప్రస్తుతం టీమిండియా బంగ్లాదేశ్ తో రెండో టెస్టులో తలపడుతోంది. ఈ మ్యాచులో టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న బంగ్లా నిలకడగా ఆడుతోంది. ప్రస్తుతం ఆ జట్టు 39 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 123 పరుగులు చేసింది. మోమినల్ హక్ (38), ముష్ఫికర్ రహీం (22) పరుగులతో క్రీజులో ఉన్నారు. భారత బౌలర్లలో జైదేవ్ ఉనద్కత్, ఉమేష్ యాదవ్, అశ్విన్ లు తలా వికెట్ పడగొట్టారు.
భారత తుది జట్టు
కేఎల్ రాహుల్, శుభ్ మన్ గిల్, ఛతేశ్వర్ పుజారా, విరాట్ కోహ్లీ, శ్రేయస్ అయ్యర్, రిషభ్ పంత్ (వికెట్ కీపర్), రవి అశ్విన్, జైదేవ్ ఉనద్కత్, అక్షర్ పటేల్, ఉమేష్ యాదవ్, మహ్మద్ సిరాజ్.
బంగ్లాదేశ్ తుది జట్టు
జకీర్ హసన్, నజ్ముల్ హొస్సేన్ శాంటో, మోమినుల్ హక్, ముష్ఫికర్ రహీమ్, లిటన్ దాస్, నురుల్ హసన్ (వికెట్ కీపర్), షకీబ్ అల్ హసన్ (కెప్టెన్), మెహిదీ హసన్ మిరాజ్, తైజుల్ ఇస్లాం, ఖలీద్ అహ్మద్, తస్కిన్ అహ్మద్.