Umran Malik: భారత్- బంగ్లాదేశ్ మధ్య మీర్పూర్ వేదికగా రెండో వన్డే జరుగుతోంది. టాస్ గెలిచిన బంగ్లా బ్యాటింగ్ ఎంచుకుంది. మొదట.. బంతితో ఆతిథ్య బ్యాటర్లను కట్టడి చేసిన టీమిండియా తర్వాత పట్టు వదిలేసింది. ఫలితంగా 69 పరుగులకు 6 వికెట్లు కోల్పోయిన బంగ్లా.. చివరికి 271 పరుగుల భారీ స్కోరు సాధించింది. మెహదీ హసన్ మిరాజ్ శతకంతో చెలరేగాడు. మహమ్మదుల్లా 77 పరుగులతో రాణించాడు.
ఈ మ్యాచులో భారత ఫాస్ట్ బౌలర్ ఉమ్రాన్ మాలిక్ 2 వికెట్లతో ఆకట్టుకున్నాడు. బంగ్లా బ్యాటర్ నజ్ముల్ శాంటోను ఉమ్రాన్ బౌల్డ్ చేసిన తీరును చూసి తీరాల్సిందే. 151 కిలోమీటర్ల వేగంతో సంధించిన బంతి వికెట్లను గిరాటేసింది. ఉమ్రాన్ బంతికి నజ్ముల్ దగ్గర సమాధానమే లేదు. మ్యాచ్ అంతటా ఉమ్రాన్ తన వేగంతో ఆకట్టుకున్నాడు. షార్ట్ పిచ్ బంతులతో ప్రత్యర్థికి పరీక్ష పెట్టాడు. ముఖ్యంగా బంగ్లా ఆల్ రౌండర్ షకీబుల్ హసన్ మాలిక్ బౌలింగ్ లో తీవ్రంగా ఇబ్బంది పడ్డాడు. 2 బంతులు అతని శరీరానికి కూడా తాకాయి.
ఉమ్రాన్ మాలిక్ తన 10 ఓవర్ల కోటాలో 58 పరుగులిచ్చి 2 వికెట్లు తీసుకున్నాడు. తొలి వన్డేలో ఆడిన కుల్దీప్ సేన్ స్థానంలో ఉమ్రాన్ మాలిక్ ను తీసుకున్నారు.
తేలిపోయిన భారత బౌలర్లు.. బంగ్లా భారీ స్కోరు
భారత్- బంగ్లాదేశ్ రెండో వన్డే. టాస్ గెలిచిన బంగ్లా బ్యాటింగ్ తీసుకుంది. మొదట మన బౌలర్లు విజృంభించారు. కట్టుదిట్టంగా బంతులేస్తూ ప్రత్యర్థి బ్యాటర్లను కట్టడి చేశారు. అంతేకాదు వికెట్లు టపటపా పడగొట్టారు. 19 ఓవర్లలో 69 పరుగులకే 6 ప్రధాన వికెట్లు కోల్పోయింది ఆతిథ్య జట్టు. ఇంకేముంది ఇంకో 4 వికెట్లేగా ఈజీగా తీసేస్తారు మన బౌలర్లు, తక్కువ స్కోరుకే బంగ్లాను కట్టడి చేస్తారని భావించారు అభిమానులు. అలా జరిగితే వింతే అవుతుంది. ఎందుకంటే..
అక్కడున్నది ఎవరు టీమిండియా బౌలర్లు. ఫస్ట్ టపటపా వికెట్లు పడగొట్టడం. తర్వాత చివరి వికెట్లను తీయడంలో తడబడడం. ఎప్పట్నుంచో భారత బౌలర్లకు ఉన్న అలవాటిది. గత కొన్నేళ్లలో ఈ బలహీనతను అధిగమించినట్లే కనిపించారు. అయితే బంగ్లాతో సిరీస్ లో అది మళ్లీ తిరిగొచ్చినట్లుంది. మొదటి వన్డేలో చివరి వికెట్ తీయలేక ఓటమి పాలయిన టీమిండియా... రెండో మ్యాచులోనూ ప్రత్యర్థిపై పైచేయి సాధించే అవకాశాన్ని వదులుకుంది. ఫలితంగా చాలా తక్కువ స్కోరుకే పరిమితమవ్వాల్సిన బంగ్లా జట్టు చివరికి భారత్ కు 272 పరుగుల భారీ లక్ష్యాన్ని నిర్దేశించింది.