IND vs BANG 2ND ODI: భారత్- బంగ్లాదేశ్ రెండో వన్డే. టాస్ గెలిచిన బంగ్లా బ్యాటింగ్ తీసుకుంది. మొదట మన బౌలర్లు విజృంభించారు. కట్టుదిట్టంగా బంతులేస్తూ ప్రత్యర్థి బ్యాటర్లను కట్టడి చేశారు. అంతేకాదు వికెట్లు టపటపా పడగొట్టారు. 19 ఓవర్లలో 69 పరుగులకే 6 ప్రధాన వికెట్లు కోల్పోయింది ఆతిథ్య జట్టు. ఇంకేముంది ఇంకో 4 వికెట్లేగా ఈజీగా తీసేస్తారు మన బౌలర్లు, తక్కువ స్కోరుకే బంగ్లాను కట్టడి చేస్తారని భావించారు అభిమానులు. అలా జరిగితే వింతే అవుతుంది. ఎందుకంటే..
అక్కడున్నది ఎవరు టీమిండియా బౌలర్లు. ఫస్ట్ టపటపా వికెట్లు పడగొట్టడం. తర్వాత చివరి వికెట్లను తీయడంలో తడబడడం. ఎప్పట్నుంచో భారత బౌలర్లకు ఉన్న అలవాటిది. గత కొన్నేళ్లలో ఈ బలహీనతను అధిగమించినట్లే కనిపించారు. అయితే బంగ్లాతో సిరీస్ లో అది మళ్లీ తిరిగొచ్చినట్లుంది. మొదటి వన్డేలో చివరి వికెట్ తీయలేక ఓటమి పాలయిన టీమిండియా... రెండో మ్యాచులోనూ ప్రత్యర్థిపై పైచేయి సాధించే అవకాశాన్ని వదులుకుంది. ఫలితంగా చాలా తక్కువ స్కోరుకే పరిమితమవ్వాల్సిన బంగ్లా జట్టు చివరికి భారత్ కు భారీ లక్ష్యాన్ని నిర్దేశించింది.
భారత బౌలర్ల జోరు
టాస్ గెలిచి బ్యాటింగ్ ప్రారంభించిన బంగ్లాదేశ్ ను మొదట భారత బౌలర్లు బాగానే కట్టడి చేశారు. పేసర్లు దీపక్ చాహర్, శార్దూల్ ఠాకూర్ లు కట్టుదిట్టంగా బంతులేశారు. సిరాజ్ కొంచెం ఎక్కువగానే పరుగులిచ్చినప్పటికీ వికెట్ల ఖాతా మొదలుపెట్టింది అతనే. కెప్టెన్ లిటన్ దాస్ (7) తో సహా అనముల్ హక్(11) వికెట్లను పడగొట్టాడు. తర్వాత నజముల్ హుస్సేన్ (21) ను ఉమ్రాన్ మాలిక్ బౌల్డ్ చేశాడు. అనంతరం క్రీజులో ఉన్నంతసేపు ఇబ్బందిపడ్డ షకీబుల్ హసన్ (8) ను వాషింగ్టన్ సుందర్ పెవిలియన్ చేర్చాడు. ఆ వెంటనే వాషింగ్టన్ సుందర్ వరుస బంతుల్లో ముష్ఫికర్ రహీం (12), ఆఫిఫ్ (0) ను ఔట్ చేశాడు. దీంతో 69 పరుగులకే 6 వికెట్లు కోల్పోయిన బంగ్లా ఇబ్బందుల్లో పడింది. టీమిండియా బౌలర్ల జోరు చూస్తే 100 పరుగుల లోపే బంగ్లా ఆలౌట్ అయ్యేలా కనిపించింది. అయితే....
శతక భాగస్వామ్యం
ముందు చకచకా వికెట్లు పడగొట్టి తర్వాత పట్టు విడవడం అలవాటైన భారత బౌలర్లు ఈ మ్యాచులోనూ అంతే చేశారు. తొలి వన్డే హీరో మెహదీ హసన్ మిరాజ్, మహమ్మదుల్లాలు బంగ్లా ఇన్నింగ్స్ ను నిలబెట్టారు. కుదురుకునేంత వరకు ఆచితూచి ఆడిన ఈ జంట ఆ తర్వాత క్రీజులో పాతుకుపోయారు. అడపా దడపా బౌండరీలు కొడుతూ స్కోరు బోర్డును నడిపించారు. ఈ క్రమంలోనే ఏడో వికెట్ కు శతక ( భాగస్వామ్యం అందించారు. వీరి భాగస్వామ్యాన్ని టీమిండియా బౌలర్లు విడదీయలేక అవస్థలు పడ్డారు. తాత్కాలిక కెప్టెన్ రాహుల్ మార్చి మార్చి బౌలర్లను ప్రయోగించినా ప్రయోజనం లేకపోయింది. వీరిద్దరూ ఏమాత్రం ఇబ్బంది లేకుండా బ్యాటింగ్ చేశారు. చివరికి 47వ ఓవర్లో ఉమ్రాన్ మాలిక్ మహమ్మదుల్లాను (77) కీపర్ క్యాచ్ ద్వారా ఔట్ చేశాడు. అయితే తర్వాత వచ్చిన నసుమ్ భారీ షాట్లతో విరుచుకుపడ్డాడు. మెహదీ హసన్ తో కలసి ఎనిమిదో వికెట్ కు 24 బంతుల్లోనే 53 పరుగులు జోడించాడు. చివరి బంతికి మెహదీ హసన్ వన్డేల్లో తన మొదటి సెంచరీని పూర్తి చేసుకున్నాడు. దీంతో బంగ్లా నిర్ణీత 50 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 271 పరుగులు చేసింది. భారత బౌలర్లలో వాషింగ్టన్ సుందర్ 3, మహ్మద్ సిరాజ్ 2, ఉమ్రాన్ మాలిక్ 2 వికెట్లు పడగొట్టారు.
రోహిత్ కు గాయం
బంగ్లాదేశ్‌తో రెండో వన్డేలో టీమ్‌ఇండియాకు షాక్! కెప్టెన్ రోహిత్ శర్మ గాయపడ్డాడు. ఫీల్డింగ్ చేస్తుండగా అతడి చేతికి గాయమైంది. నొప్పి ఎక్కువగా ఉండటంతో బీసీసీఐ వైద్య బృందం అతడిని ఆస్పత్రికి పంపించింది. స్కానింగ్ రిపోర్టులు తీసుకుంటోంది.
మూడు వన్డేల సిరీస్‌లో నేడు రెండో మ్యాచ్ జరుగుతోంది. టాస్ ఓడిన టీమ్‌ఇండియా మొదట బౌలింగ్‌కు దిగింది. రెండో ఓవర్‌ను మహ్మద్ సిరాజ్ విసిరాడు. తొలి రెండు బంతుల్ని అనుముల్ హక్ బౌండరీలుగా మలిచాడు. నాలుగో బంతి అతడి బ్యాటు అంచుకు తగిలి స్లిప్‌లో వెళ్లింది. ఆ క్యాచ్ అందుకొనే క్రమంలోనే కెప్టెన్ రోహిత్ శర్మ గాయపడ్డాడు.