India Vs Bangladesh:  భారత్- బంగ్లాదేశ్ మధ్య జరుగుతున్న మొదటి టెస్టులో నాలుగో రోజు ఆట ముగిసింది. ఆట ఆఖరకు బంగ్లా 6 వికెట్లు కోల్పోయి 272 పరుగులు చేసింది. ఆ జట్టు విజయానికి ఇంకా 241 పరుగులు కావాలి. భారత్ గెలవాలంటే 4 వికెట్లు తీయాలి. ప్రస్తుతం పిచ్ బ్యాటింగ్ కు అనుకూలంగానే ఉంది. బంతి చక్కగా బ్యాట్ మీదకు వస్తుంది. మరి ఆఖరి రోజు బంగ్లా లక్ష్యం ఛేదిస్తుందో లేక టీమిండియా 4 వికెట్లు పడగొట్టి గెలుస్తుందో చూడాలి. 


జకీర్ హసన్ అరంగేట్ర టెస్ట్ సెంచరీ


టీ విరామ సమయానికి 3 వికెట్లకు 176 పరుగులు చేసిన బంగ్లాదేశ్ ఆట ఆఖరకు మరో 96 పరుగులు జోడించి 3 వికెట్లు చేజార్చుకుంది. టీ తర్వాత ఆ జట్టు బ్యాటర్లు ధాటిగా బ్యాటింగ్ చేశారు. మొదటి టెస్ట్ ఆడుతున్న జకీర్ హసన్, ముష్ఫికర్ రహీంలు కొన్ని షాట్లు ఆడారు. ఈ క్రమంలోనే జకీర్ (100) అరంగేట్ర టెస్ట్ సెంచరీని అందుకున్నాడు. అయితే ఆ వెంటనే అశ్విన్ బౌలింగ్ లో కోహ్లీ చేతికి చిక్కాడు. అనంతరం క్రీజులోకి వచ్చిన కెప్టెన్ షకీబుల్ హసన్ భారత బౌలర్లపై ఎదురుదాడికి దిగాడు. అయితే అక్షర్ పటేల్ ఒకే ఓవర్లో ముష్ఫికర్ రహీం (23), నురుల్ హసన్ (3) లను ఔట్ చేశాడు. అద్భుతమైన బంతితో రహీంను బౌల్డ్ చేసిన అక్షర్, తర్వాత నురుల్ స్టంపౌట్ గా పెవిలియన్ పంపించాడు. ఈ దశలో భారత స్పిన్నర్లు బంగ్లాను చుట్టేస్తారేమో అనిపించింది. అయితే...






14 ఓవర్లు వికెట్ ఇవ్వని షకీబ్, మిరాజ్


షకీబ్ కు జతకలిసిన మిరాజ్ పట్టుదలతో నిలిచాడు. వీరిద్దరూ వికెట్ ఇవ్వకూడదనే ఉద్దేశంతో ఆడారు. స్పిన్ బౌలింగ్ ను సమర్ధంగా ఎదుర్కొంటూనే అడపాదడపా షాట్లు కొట్టారు. 14 ఓవర్లపాటు వికెట్ ఇవ్వకుండా రోజును ముగించారు. షకీబ్ (69 బంతుల్లో 40), మెహదీ హసన్ మిరాజ్ (40 బంతుల్లో 9) క్రీజులో ఉన్నారు.