IND vs BAN 1st test:  భారత్- బంగ్లాదేశ్ మధ్య మొదటి టెస్ట్ రసవత్తరంగా సాగుతోంది. నాలుగో రోజు టీ విరామ సమాయనికి బంగ్లా 3 వికెట్లు కోల్పోయి 176 పరుగులు చేసింది. జాకీర్ హసన్ 82 పరుగులు, ముష్ఫికర్ రహీం 2 పరుగులతో క్రీజులో ఉన్నారు. బంగ్లాదేశ్ విజయానికి ఇంకా 337 పరుగులు కావాలి. 


అంతకుముందు తొలి సెషన్ లో బంగ్లా ఓపెనర్లు వికెట్ పడకుండా ఆడారు. శాంటో, జాకీర్ లు తొలి వికెట్ కు 124 పరుగులు జోడించారు. అయితే తర్వాత పుంజుకున్న భారత బౌలర్లు వెంటవెంటనే  శాంటో, యాసిర్ అలీలను ఔట్ చేశారు. ఆ తర్వాత లిటన్ దాస్ తో కలిసి జాకీర్ హసన్ ఇన్నింగ్స్ ను నడిపించాడు. వీరిద్దరూ మూడో వికెట్ కు 42 పరుగులు జోడించారు. బలపడుతున్న వీరి భాగస్వామ్యాన్ని కుల్దీప్ విడదీశాడు. కుల్దీప్ బంతిని షాట్ ఆడిన లిటన్ ఉమేష్ యాదవ్ కు చిక్కాడు. దీంతో టీ బ్రేక్ సమయానికి బంగ్లా 3 వికట్లు కోల్పోయింది. 






శుక్రవారం ఏం జరిగిందంటే!


బంగ్లాదేశ్‌ను 150 పరుగులకే కుప్పకూల్చిన భారత్‌ వెంటనే రెండో ఇన్నింగ్స్‌ మొదలు పెట్టింది. ఓపెనర్లు కేఎల్‌ రాహుల్‌ (23), శుభ్‌మన్‌ గిల్‌ శుభారంభం అందించారు. మొదటి వికెట్‌కు 70 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు. ఖలీల్‌ అహ్మద్‌ వేసిన 22.4వ బంతికి తైజుల్‌ ఇస్లామ్‌కు రాహుల్‌ క్యాచ్‌ ఇచ్చాడు. ఈ క్రమంలో వన్‌డౌన్‌లో క్రీజులోకి వచ్చిన పుజారాతో కలిసి గిల్‌ రెచ్చిపోయాడు. చక్కని బంతుల్ని డిఫెండ్‌ చేస్తూ దొరికిన వాటిని వేటాడాడు. బౌలర్లను కాచుకుంటూనే చక్కని బౌండరీలు, సిక్సర్లు బాదేశాడు. కేవలం 84 బంతుల్లోనే హాఫ్‌ సెంచరీ అందుకున్నాడు. డ్రింక్స్‌ తర్వాత తన ఇన్నింగ్సులో మరింత  దూకుడు మొదలైంది. భారీ షాట్లు బాదాడు. తేనీటి విరామం ముగిసిన వెంటనే సెంచరీ సాధించాడు. ఇందుకు 147 బంతులు తీసుకున్నాడు. రెండో వికెట్‌కు పుజారాతో 113 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పిన అతడిని మెహదీ హసన్‌ ఔట్‌ చేశాడు.