WTC Final, India vs Australia: వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్ (డబ్ల్యూటీసీ) రెండో ఎడిషన్ ఫైనల్ మ్యాచ్ భారత్, ఆస్ట్రేలియా మధ్య లండన్‌లోని ఓవల్ మైదానంలో జరుగుతోంది. ఈ మ్యాచ్‌లో ఆస్ట్రేలియా జట్టు ఆటగాడు ట్రావిస్ హెడ్ మొదటి రోజు ఆటలో అద్భుతమైన సెంచరీ ఇన్నింగ్స్ ఆడాడు. ప్రపంచ టెస్టు ఛాంపియన్ షిప్ ఫైనల్ మ్యాచ్‌లో సెంచరీ చేసిన మొదటి ఆటగాడిగా కూడా ట్రావిస్ హెడ్ నిలిచాడు. 2021 టెస్టు ఛాంపియన్ ఫైనల్లో ఒక్క సెంచరీ కూడా నమోదు కాలేదు కాబట్టి డబ్ల్యూటీసీ ఫైనల్స్ చరిత్రలో ఇదే మొదటి సెంచరీ.






తొలి రోజు రెండో సెషన్‌లో ఆస్ట్రేలియా జట్టు స్కోరు 76 వద్ద మూడో వికెట్ కోల్పోయింది. ఈ పరిస్థితిలో క్రీజులోకి వచ్చిన ట్రావిస్ హెడ్ ఇక్కడి నుంచి స్టీవ్ స్మిత్‌తో కలిసి ఇన్నింగ్స్‌ను ముందుకు తీసుకెళ్లాడు. తను వచ్చిన మొదటి సెషన్‌లోనే అర్థ సెంచరీ పూర్తి చేశాడు.


తొలిరోజు చివరి సెషన్ ప్రారంభం కాగానే ట్రావిస్ హెడ్ మరింత దూకుడుగా బ్యాటింగ్ కొనసాగించాడు. తన టెస్టు కెరీర్‌లో ఆరో సెంచరీని కేవలం 106 బంతుల్లో పూర్తి చేశాడు. విదేశీ గడ్డపై ట్రావిస్ టెస్టుల్లో సెంచరీ చేయడం ఇదే మొదటిసారి. భారత్‌పై కూడా హెడ్‌కి ఇదే తొలి సెంచరీ.


క్లైవ్ లాయిడ్ తర్వాత ట్రావిస్ హెడ్‌నే
ఈ చిరస్మరణీయ సెంచరీతో ట్రావిస్ హెడ్ తనకంటూ ప్రత్యేక రికార్డు సృష్టించాడు. 1975లో జరిగిన తొలి వన్డే ప్రపంచకప్‌లో ఫైనల్ మ్యాచ్‌లో సెంచరీ చేసిన రికార్డు వెస్టిండీస్ మాజీ ఆటగాడు క్లైవ్ లాయిడ్ పేరిట ఉంది. క్లైవ్ లాయిడ్, ట్రావిస్ హెడ్ ఇద్దరూ ఎడమచేతి వాటం ఆటగాళ్లే కావడం, ఇద్దరూ ఐదో స్థానంలో బ్యాటింగ్‌కు దిగడం పూర్తిగా యాదృచ్ఛికం.