WTC Final 2023: 


ఐసీసీ ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్ ఫైనల్‌ ఇంట్రెస్టింగ్‌గా సాగుతోంది. రెండు జట్లూ నువ్వా నేనా అన్నట్టుగా తలపడుతున్నాయి. తొలిరోజు, భోజన విరామానికి ఆస్ట్రేలియా 2 వికెట్ల నష్టానికి 73 పరుగులు చేసింది. మార్నస్‌ లబుషేన్ (26 బ్యాటింగ్‌; 61 బంతుల్లో 3x4) నిలకడగా ఆడుతున్నాడు. మాజీ కెప్టెన్‌ స్టీవ్‌ స్మిత్‌ (2 బ్యాటింగ్‌) అతడికి తోడుగా ఉన్నాడు. మహ్మద్‌ సిరాజ్‌, శార్దూల్‌ ఠాకూర్‌ చెరో వికెట్‌ తీశారు.






సూపర్‌ బౌలింగ్‌


ఆకాశంలో మబ్బులు ఉండటం.. వాతావరణం చల్లగా ఉండటం.. వికెట్‌పై పచ్చిక ఉండటంతో టీమ్‌ఇండియా టాస్ గెలవగానే బౌలింగ్‌ ఎంచుకుంది. కండీషన్స్‌ను బాగానే ఉపయోగించుకుంది. జట్టు స్కోరు 2 వద్దే ఆసీస్‌ ఓపెనర్‌ ఉస్మాన్ ఖవాజా (0)ను మహ్మద్ సిరాజ్‌ ఔట్‌ చేశాడు. వుబుల్‌ సీమ్‌తో వచ్చిన బంతి ఖవాజా బ్యాటు అంచుకు తగిలి వికెట్‌ కీపర్‌ భరత్‌ చేతుల్లో పడింది. ఈ సిచ్యువేషన్లో డేవిడ్‌ వార్నర్‌ (43; 60 బంతుల్లో 8x4), మార్నస్‌ లబుషేన్‌ క్రీజులో నిలబడ్డారు. రెండో వికెట్‌కు 108 బంతుల్లో 69 పరుగుల భాగస్వామ్యం అందించారు. వీరిద్దరూ చక్కని బంతుల్ని గౌరవిస్తూనే దొరికిన వాటిని బౌండరీకి తరలించారు.


వార్నర్‌, లబుషేన్‌ అటాక్‌


మహ్మద్‌ షమి, శార్దూల్‌ ఠాకూర్‌, మహ్మద్‌ సిరాజ్‌ చక్కని లెంగ్తుల్లో బంతులు వేశారు. దాంతో వీరి బౌలింగ్‌ను వార్నర్‌, లబుషేన్‌ జాగ్రత్తగా ఆడారు. అయితే ఉమేశ్‌ యాదవ్‌ బౌలింగ్‌ను మాత్రం అటాక్‌ చేశారు. ముఖ్యంగా వార్నర్‌ చక్కని షాట్లతో చెలరేగాడు. వరుస బౌండరీలు బాదారు. ఈ జోడీని విడదీయడానికి పేసర్లు కాస్త కష్టపడాల్సి వచ్చింది. చివరికి శార్దూల్‌ ఠాకూర్‌ వేసిన 21.4వ బంతికి వార్నర్‌ ఔటయ్యాడు. డౌన్‌ ది లెగ్‌ భుజాల ఎత్తులో వచ్చిన బంతిని పుల్‌ చేయబోయిన అతడు కీపర్ భరత్‌కు చిక్కాడు. గ్లోవ్స్ తాకి లెగ్‌సైడ్‌ వెళ్తున్న బంతికి కీపర్‌ డైవ్‌ చేసి అద్భుతంగా ఒడిసిపట్టాడు. మరికాసేపటికే లంచ్‌ బ్రేక్‌ అనౌన్స్‌ చేశారు.






ఆస్ట్రేలియా: డేవిడ్‌ వార్నర్‌, ఉస్మాన్ ఖవాజా, మార్నస్ లబుషేన్, స్టీవెన్‌ స్మిత్‌, ట్రావిస్‌ హెడ్‌, కామెరాన్ గ్రీన్‌, అలెక్స్‌ కేరీ, ప్యాట్‌ కమిన్స్‌, మిచెల్‌ స్టార్క్‌, నేథన్‌ లైయన్‌, స్కాట్‌ బొలాండ్‌


భారత్‌: రోహిత్‌ శర్మ, శుభ్‌మన్‌ గిల్‌, చెతేశ్వర్‌ పుజారా, విరాట్‌ కోహ్లీ, అజింక్య రహానె, శ్రీకర్‌ భరత్‌, రవీంద్ర జడేజా, శార్దూల్‌ ఠాకూర్‌, ఉమేశ్ యాదవ్‌, మహ్మద్‌ షమీ, మహ్మద్‌ సిరాజ్‌