WTC Final 2023: 


ఐసీసీ ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్ ఫైనల్‌ టాస్‌ వేశారు. భారత్‌, ఆస్ట్రేలియా ఈ మ్యాచులో తలపడుతున్నాయి. టాస్ గెలిచిన టీమ్‌ఇండియా కెప్టెన్‌ రోహిత్‌ శర్మ వెంటనే బౌలింగ్‌ ఎంచుకున్నాడు. ఆకాశం మేఘావృతం కావడం, వికెట్‌ బౌలింగ్‌కు అనుకూలిస్తుండటంతో ఈ నిర్ణయం తీసుకున్నామని పేర్కొన్నాడు. 


'మేం మొదట బౌలింగ్‌ చేస్తాం. ఆకాశంలో మబ్బులు ఉన్నాయి. కండీషన్స్‌ను బట్టి ఈ నిర్ణయం తీసుకున్నాం. పిచ్‌ ఎక్కువగా మారుతుందని అనుకోవడం లేదు. మేం మంచి క్రికెట్‌ ఆడాల్సి ఉంది. అత్యుత్తమ ప్రదర్శన చేయాల్సి ఉంది. నలుగురు సీమర్లు, ఒక స్పిన్నర్‌తో బరిలోకి దిగుతున్నాం. జడ్డూను ఎంచుకున్నాం. అశ్విన్‌ వదిలేయడం చాలా కష్టం. కొన్నేళ్లుగా అతడు మాకు మ్యాచ్‌ విన్నర్‌గా ఉన్నాడు. జట్టుకు మేలు చేసే నిర్ణయాలే తీసుకోవాల్సి ఉంటుంది. రహానెకు ఎంతో అనుభవం ఉంది. ఇప్పటికే 80 టెస్టులకు పైగా ఆడాడు. కొన్నాళ్లుగా అతడు దూరమయ్యాడు. అతడి అనుభవం ఎన్నో మార్పులు తేగలదు' అని టీమ్‌ఇండియా కెప్టెన్‌ రోహిత్‌ శర్మ అన్నాడు.


'మేమూ బౌలింగే ఎంచుకొనేవాళ్లం. అయితే మొదట బ్యాటింగ్‌ చేసినా బౌలింగ్‌ చేసినా పెద్ద తేడా ఏమీ ఉండదు. బహుశా నాలుగు లేదా ఐదో రోజు స్పిన్‌కు అనుకూలిస్తుండొచ్చు. ఈ వికెట్‌ స్కాట్ బొలాండ్‌కు నప్పుతుంది. రోజంతా అతడు ఒకే లెంగ్తుల్లో అతడు బౌలింగ్‌ చేయగలడు. వికెట్‌పై పచ్చిక ఉంది. బొలాండే మా ఆయుధం. పది రోజులుగా వికెట్‌ గమనిస్తున్నాం. వాతావరణం చాలా ఆహ్లాదకరంగా ఉంది' అని ఆస్ట్రేలియా కెప్టెన్‌ ప్యాట్‌ కమిన్స్‌ అన్నాడు.


ఆస్ట్రేలియా: డేవిడ్‌ వార్నర్‌, ఉస్మాన్ ఖవాజా, మార్నస్ లబుషేన్, స్టీవెన్‌ స్మిత్‌, ట్రావిస్‌ హెడ్‌, కామెరాన్ గ్రీన్‌, అలెక్స్‌ కేరీ, ప్యాట్‌ కమిన్స్‌, మిచెల్‌ స్టార్క్‌, నేథన్‌ లైయన్‌, స్కాట్‌ బొలాండ్‌


భారత్‌: రోహిత్‌ శర్మ, శుభ్‌మన్‌ గిల్‌, చెతేశ్వర్‌ పుజారా, విరాట్‌ కోహ్లీ, అజింక్య రహానె, శ్రీకర్‌ భరత్‌, రవీంద్ర జడేజా, శార్దూల్‌ ఠాకూర్‌, ఉమేశ్ యాదవ్‌, మహ్మద్‌ షమీ, మహ్మద్‌ సిరాజ్‌


ఛాంపియన్‌షిప్‌ ప్రవేశపెట్టాక టెస్టు క్రికెట్‌కు జోష్ వచ్చింది! ప్రతి జట్టూ ఫలితం కోసం ఆఖరి వరకూ పోరాడుతున్నాయి. పాయింట్లు గెలిచి ఫైనల్‌ ఆడటమే లక్ష్యంగా పెట్టుకున్నాయి. రెండేళ్లు జరిగిన ఈ రెండో సైకిల్‌లో ఆస్ట్రేలియా, టీమ్‌ఇండియా వరుసగా 1, 2 స్థానాలు కైవసం చేసుకున్నాయి. హిట్‌మ్యాన్‌ సేన మొత్తం 18 మ్యాచులు ఆడి 10 విజయాలు సాధించింది. 5 మ్యాచుల్లో ఓడి మూడింటిని డ్రా చేసుకుంది. ఇంగ్లాండ్‌లో ఇంగ్లాండ్‌పై ఆధిపత్యం చెలాయించడం చరిత్రలోనే అరుదైన సన్నివేశం. ఇక ఆసీస్‌ను ఓ ఆటాడుకుంది. ఎప్పట్లాగే దక్షిణాఫ్రికాలో ఇబ్బంది పడింది. న్యూజిలాండ్‌, శ్రీలంక, బంగ్లాదేశ్‌పై ఈజీగా గెలిచేసింది.


టీమ్‌ఇండియా ఐసీసీ టైటిల్‌ గెలిచి పదేళ్లు అవుతోంది. చివరి టెస్టు ఛాంపియన్‌షిప్‌ ఫైనల్లో కొద్దిలో 'గద'ను మిస్ చేసుకుంది. ఈసారి ఎలాగైనా గెలవాలన్న కసి కనిపిస్తోంది. ఓపెనర్‌ శుభ్‌మన్‌ గిల్‌ క్లాస్‌ టచ్‌లో ఉన్నాడు. ఐపీఎల్‌ అతడిలో ఉత్సాహం నింపింది. రోహిత్‌ శర్మ మరోసారి తన కెప్టెన్సీ బుర్రకు పదును పెట్టాల్సి ఉంది. చెతేశ్వర్‌ పుజారా కౌంటీ క్రికెట్‌ ఆడుతూ ఇంగ్లాండ్‌ పిచ్‌లు, వాతావరణాన్ని ఔపోశన పట్టాడు. మంచి ఫామ్‌లో ఉన్నాడు. ఐపీఎల్‌లో విజృంభించిన విరాట్‌ కోహ్లీకి ఓవల్‌లో సూపర్‌ రికార్డు ఉంది. అజింక్య రహానె, రవీంద్ర జడేజా తమ స్థాయి ఇన్నింగ్సులు ఆడితే మంచిది. కేఎస్‌ భరత్‌, ఇషాన్‌ కిషన్‌ మధ్య పోటీ నెలకొంది. ప్రాక్టీస్‌ను బట్టి కిషన్‌ తుది జట్టులోకి వస్తాడని సమాచారం. పైగా ఎక్స్‌ఫ్యాక్టర్‌గా ఉండగలడు. మహ్మద్‌ షమి, మహ్మద్‌ సిరాజ్‌ ద్వయం జోష్‌లో ఉంది. వీరిద్దరూ దూకుడుగా బౌలింగ్‌ చేస్తే తిరుగుండదు. వీరికి తోడుగా ఉమేశ్‌ ఉంటాడు. పిచ్‌ను బట్టి నాలుగో పేసర్‌గా శార్దూల్‌ వస్తాడు. లేదంటే యాష్‌కు అవకాశం దొరుకుతుంది. రెండు రోజులుగా టీమ్‌ఇండియా స్లిప్‌ క్యాచింగ్‌ బాగా ప్రాక్టీస్‌ చేసింది.