WTC Final 2023:


ఐసీసీ ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్ ఫైనల్‌ ఓవల్‌ మైదానంలో జరుగుతుండటం టీమ్‌ఇండియాకు అనుకూలమని సచిన్‌ తెందూల్కర్‌ అంటున్నారు. భారత్‌కు అక్కడ మధుర స్మృతులు ఉన్నాయని గుర్తు చేస్తున్నారు. ఆట సాగే కొద్దీ స్పిన్నర్లు ఈ పిచ్‌పై ప్రభావం చూపిస్తారని ధీమా వ్యక్తం చేశారు. ఆస్ట్రేలియాను ఎప్పుడూ తక్కువ అంచనా వేయొద్దని సూచించారు. ఫైనల్‌కు ముందు ఆయన 100ఎంబీకి ఇంటర్వ్యూ ఇచ్చారు.


'కెన్నింగ్‌టన్‌ ఓవల్‌లో ఆడటం టీమ్‌ఇండియాకు ఆనందం. ఎందుకంటే మ్యాచ్ సాగేకొద్దీ ఇక్కడి పిచ్ స్పిన్నర్లకు అనుకూలిస్తుంది. అందుకే ఫైనల్లో వారు కీలకం అవుతారు. వికెట్లు ప్రతిసారీ టర్న్‌ అవ్వాల్సిన పన్లేదు. కొన్నిసార్లు స్పిన్నర్లు బౌన్స్‌పై ఎక్కువ ఆధారపడతారు. గాలి కూడా అనుకూలంగా మారుతుంది. వాతావరణం చల్లగా ఉంటే బంతి షైనింగ్‌ను వాడుకుంటారు' అని సచిన్‌ అన్నారు.


'డ్రిఫ్ట్‌ చేయగలిగితే స్పినర్లు బంతితో గాల్లోనే మాట్లాడిస్తారు. అప్పుడు టర్నింగ్‌ పిచ్‌తో పనేలేదు. అందుకే ఓవల్‌ టీమ్‌ఇండియాకు మరింత అడ్వాంటేజ్‌గా మారుతుంది' అని మాస్టర్‌ బ్లాస్టర్‌ అన్నారు. చివరిసారి ఓవల్‌లో భారత్‌ ఘన విజయం సాధించింది. 2021లో ఇంగ్లాండ్‌పై 157 పరుగుల తేడాతో గెలిచింది. ఆ మధురస్మృతులు టీమ్‌ఇండియా ఆటగాళ్లలో ఉత్తేజం నింపుతాయని ఈ క్రికెట్‌ దిగ్గజం భావిస్తున్నారు.


'వంద శాతం నిజం. అలాంటి మధురస్మృతులు కచ్చితంగా మనకు ఉత్తేజం కలిగిస్తాయి. చివరిసారి అక్కడ ఎలా ఆడామో టీమ్‌ఇండియా మర్చిపోదు. ఆ మ్యాచ్‌ను అద్భుతంగా గెలిచారు. మెమరీస్ ఎప్పుడూ మనవెంటే ఉంటాయి' అని సచిన్‌ వెల్లడించారు. అలాగే ఓవల్‌లో ఆసీస్‌కు మెరుగైన రికార్డేమీ లేదు. 2019 యాషెస్‌ టెస్టులో కంగారూలను ఆంగ్లేయులు 135 పరుగుల తేడాతో ఓడించారు. అయితే ఆసీస్‌ను తక్కువ అంచనా వేయొద్దని మాస్టర్‌ సూచించారు.


'ఇలాంటి గాయాల నుంచి తేరుకోవడానికి సమయం పడుతుంది. కానీ ఆస్ట్రేలియా చాలా పటిష్ఠమైన జట్టు. సమతూకంగా కనిపిస్తోంది. సుదీర్ఘ కాలంగా ఆడుతున్న క్రికెటర్లు ఉన్నారు. యువ క్రికెటర్లూ వారికి తోడుగా ఉన్నారు. కంగారూ టీమ్‌ ఎప్పుడూ గట్టిపోటీనిస్తుంది. ఒక్కసారి నిలబడ్డారంటే వారిని అడ్డుకోవడం చాలా కష్టం' అని సచిన్‌ పేర్కొన్నారు.


కౌంటీ క్రికెట్‌ ఆడిన చెతేశ్వర్‌ పుజారా, మార్నస్‌ లబుషేన్‌ రెండు జట్లకూ కీలకం అవుతారని సచిన్‌  అంచనా వేశారు. 'అవును, కౌంటీ క్రికెట్‌ ఆడటం గొప్ప విలువను తీసుకొస్తుంది. పుజారా, లబుషేన్‌ రీసెంట్‌గా ఎక్కువ కౌంటీ క్రికెట్‌ ఆడారు. వారితో పోలిస్తే స్మిత్‌ కాస్త తక్కువే ఆడారు. అయితే ఇక్కడి పరిస్థితుల్లో ఆ మ్యాచ్‌ ప్రాక్టీస్‌ బాగా ఉపయోగపడుతుంది. మిగిలిన క్రికెటర్లు టీ20 క్రికెట్‌ ఆడి ఇంగ్లాండ్‌కు చేరుకున్నారు. ఏదేమైనా ప్రాక్టీస్ మ్యాచులు ఆడటాన్ని మించి మెరుగైన సన్నద్ధత ఏమీ ఉండదు' అని ఆయన అన్నారు.


భారత్‌: రోహిత్‌ శర్మ, శుభ్‌మన్‌ గిల్‌, చెతేశ్వర్‌ పుజారా, విరాట్‌ కోహ్లీ, అజింక్య రహానె, కేఎస్‌ భరత్‌, రవిచంద్రన్‌ అశ్విన్‌, రవీంద్ర జడేజా, అక్షర్‌ పటేల్‌, శార్దూల్‌ ఠాకూర్‌, మహ్మద్‌ షమి, మహ్మద్‌ సిరాజ్‌, ఉమేశ్‌ యాదవ్‌, జయదేశ్ ఉనద్కత్‌, ఇషాన్‌ కిషన్‌


స్టాండ్‌బై ఆటగాళ్లు: యశస్వీ జైశ్వాల్‌, ముకేశ్‌ కుమార్‌, సూర్యకుమార్‌ యాదవ్‌


ఆస్ట్రేలియా: ప్యాట్‌ కమిన్స్‌, స్కాట్‌ బొలాండ్‌, అలెక్స్‌ కేరీ, కామెరాన్‌ గ్రీన్‌, మార్కస్‌ స్టాయినిస్‌, జోష్‌ హేజిల్‌వుడ్‌, ట్రావిస్ హెడ్‌, జోష్‌ ఇంగ్లిస్‌, ఉస్మాన్‌ ఖవాజా, మార్నస్‌ లబుషేన్, నేథన్‌ లైయన్‌, టాడ్‌ మర్ఫీ, స్టీవ్‌ స్మిత్‌, మిచెల్‌ స్టార్క్‌, డేవిడ్‌ వార్నర్‌


స్టాండ్‌బై ఆటగాళ్లు: మిచెల్‌ మార్ష్‌, మాథ్యూ రెన్షా