India vs Australia World Cup Final 2023: ప్రపంచకప్‌లో మహా సంగ్రామానికి టీమిండియా(Team India) సిద్ధమైంది. సూపర్ సండే రోజున అయిదుసార్లు ప్రపంచ ఛాంపియన్ ఆస్ట్రేలియా(Austrelia)తో భారత జట్టు అమీతుమీ తేల్చుకోనుంది. టీమిండియా విజయం కోసం 130 కోట్ల మంది ప్రజలు ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు. 2011 ప్రపంచకప్ గెలిచిన జట్టులో సభ్యులైన విరాట్ కోహ్లి, అశ్విన్ మరోసారి ఆ అనుభూతిని పొందాలని పట్టుదలతో ఉన్నారు. ఏమాత్రం ఎమరుపాటు లేకుండా.. ముచ్చటగా మూడోసారి కప్పును గెలిచేందుకు రోహిత్ సేన సిద్ధంగా ఉంది.
ప్రతిష్టాత్మక లార్డ్స్ స్టేడియంలో 1983లో కపిల్ దేవ్ కప్పును ఎత్తిన క్షణాలను... 2011లో ధోని సిక్సు కొట్టి గెలిపించిన అనుభూతులను మరోసారి కళ్లారా వీక్షించాలని క్రికెట్ అభిమానులు ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు. స్వదేశంలో జరుగుతున్న ప్రపంచకప్ తుది పోరులో ఆస్ట్రేలియాను మట్టికరిపించి టీమిండియా విజయం సాధించాలని.. కోట్లమంది క్రికెట్ అభిమానులు భావిస్తున్నారు. ఒత్తేడే ప్రధాన శత్రువుగా టీమిండియా బరిలోకి దిగుతోంది. తమ దృష్టంతా ఆటపైనే ఉంటుందని ఒత్తిడి తమపై ఎప్పుడూ ఉండేదేనని రోహిత్ శర్మ ఇప్పటికే స్పష్టం చేశాడు. అప్రతిహాతంగా పది విజయాలతో ఫైనల్ చేరిన టీమిండియా...11 వ మ్యాచ్‌లోనూ గెలిచి ఓటమే లేకుండా ప్రపంచకప్ గెలవాలని పట్టుదలగా ఉంది. రోహిత్‌తో సహా క్రికెటర్లందరూ తమ కెరీర్‌లోనే అత్యంత కీలకమైన మ్యాచ్‌ను ఆడేందుకు సిద్ధమయ్యారు.
భారత్ బ్యాటింగ్‌లో చాలా బలంగా కనిపిస్తోంది. రోహిత్ శర్మ 550 పరుగులతో దూకుడుగా బ్యాటింగ్ చేస్తున్నారు. 90 సగటుతో విరాట్ కోహ్లి 711 పరుగులు చేసి ఈ ప్రపంచకప్‌లోనే అత్యధిక పరుగులు చేసిన బ్యాటర్‌గా కొనసాగుతున్నాడు. శ్రేయస్ అయ్యర్ సెమీఫైనల్లో సెంచరీ చేసి మంచి టచ్‌లో ఉన్నాడు. రాహుల్ కూడా విధ్వంసకర బ్యాటింగ్‌తో అలరిస్తున్నాడు. గిల్, జడేజాలు కూడా ఫామ్‌లో ఉన్నారు. KL రాహుల్ ప్రశాంతత, రవీంద్ర జడేజా ఆల్ రౌండ్ నైపుణ్యం టీమిండియాకు అదనపు బలంగా మారాయి. అమ్రోహా ఎక్స్‌ప్రెస్‌గా అభిమానులు ముద్దుగా పిలుచుకుంటున్న స్పీడ్ స్టార్ మహమ్మద్ షమీపై ఈ మ్యాచ్‌లో భారీ అంచనాలు ఉన్నాయి. ఇప్పటివరకూ 23వికెట్లతో షమీ టీమిండియా తురుపుముక్కగా మారాడు. జస్ప్రీత్ బుమ్రా, సిరాజ్‌లు కూడా రాణిస్తే ఆస్ట్రేలియాపై గెలుపు నల్లేరుపై నడకే. నల్లమట్టి పిచ్‌పై ఈ మ్యాచ్ జరగనుండడంతో ఈ మ్యాచ్‌లో అశ్విన్‌ను మూడో స్పిన్నర్‌గా జట్టులోకి తీసుకోవాలని రోహిత్ సేన భావిస్తోంది.
ఈ ప్రపంచకప్‌లో ఆస్ట్రేలియా పడిలేచిన కెరటంలా సాగి ఫైనల్‌కు చేరుకుంది. తొలి రెండు మ్యాచుల్లో ఘోర పరాజయాల నుంచి కోలుకుని ఆ తర్వాత వరుస విజయాలతో కంగారులు పైనల్‌కు చేరారు. ఫైనల్లో భారత జట్టు ఏమాత్రం ఏమరపాటుగా ఉన్నా భారీ మూల్యం చెల్లించక తప్పదని రోహిత్ సేనను పలువురు మాజీ క్రికెటర్లు హెచ్చరిస్తున్నారు.
ఆస్ట్రేలియా విధ్వంసకర ఓపెనర్ డేవిడ్ వార్నర్.. ఈ ప్రపంచకప్‌లో 10 మ్యాచుల్లో 528 పరుగులు చేశాడు. వార్నర్‌ను ఎంత త్వరగా పెవిలియన్ చేరిస్తే టిమిండియా పని అంత సులువు అవుతుంది. సౌతాఫ్రికాతో సెమీ ఫైనల్లో ఓపెనర్ ట్రవిస్ హెడ్ బ్యాట్‌తోనే కాకుండా బంతితోనూ మెరిసి గెలుపులో కీలక పాత్ర పోషించాడు. అఫ్గానిస్థాన్‌తో జరిగిన మ్యాచ్‌లో మ్యాక్స్‌వెల్ విధ్వంసం గుర్తుండే ఉంటుంది. తనదైన రోజున మ్యాచ్‌ను ఒంటిచేత్తో గెలిపించే సత్తా మ్యాక్స్‌వెల్‌కు ఉంది. బౌలింగ్ విభాగంలోనూ ఆస్ట్రేలియా బలంగానే ఉంది. అయితే టీమిండియా ఉన్న భీకర ఫామ్‌కు ఆస్ట్రేలియా జట్టు... భారత్‌కు ఎంతవరకు పోటీ ఇస్తుందనే ప్రశ్న.. అభిమానుల్లో ఉత్సుకత రేపుతోంది.
భారత జట్టు: రోహిత్ శర్మ (కెప్టెన్), శుభ్‌మన్ గిల్, విరాట్ కోహ్లీ, శ్రేయస్ అయ్యర్, కెఎల్ రాహుల్, సూర్యకుమార్ యాదవ్, రవీంద్ర జడేజా, కుల్దీప్ యాదవ్, మహ్మద్ షమీ, జస్ప్రీత్ బుమ్రా, మహ్మద్ సిరాజ్, రవిచంద్రన్ అశ్విన్, శార్దూల్ ఠాకూర్ , ఇషాన్ కిషన్, ప్రసిద్ధ్ కృష్ణ.
ఆస్ట్రేలియా జట్టు: పాట్ కమిన్స్(కెప్టెన్), డేవిడ్ వార్నర్, ట్రావిస్ హెడ్, మిచెల్ మార్ష్, స్టీవ్ స్మిత్, మార్నస్ లబుషేన్, గ్లెన్ మాక్స్‌వెల్, మార్కస్ స్టోయినిస్, మిచెల్ స్టార్క్, ఆడమ్ జంపా, జోష్ హేజిల్‌వుడ్, కామెరాన్ గ్రీన్, జోష్ ఇంగ్లిస్, అలెక్స్ కారీ, సీన్ అబాట్.