IND vs AUS World Cup 2023 Final: భారత్‌ వేదికగా జరుగుతున్న ప్రపంచకప్‌లో ఆస్ట్రేలియా పడిలేచిన కెరటంలా సాగి ఫైనల్‌కు చేరుకుంది. తొలి రెండు మ్యాచుల్లో ఘోర పరాజయాల నుంచి కోలుకుని ఆ తర్వాత వరుస విజయాలతో కంగారులు పైనల్‌కు చేరారు. ఫైనల్లో భారత జట్టు ఏమాత్రం ఏమరపాటుగా ఉన్నా భారీ మూల్యం చెల్లించక తప్పదని రోహిత్‌ సేనను పలువురు మాజీ క్రికెటర్లు హెచ్చరిస్తున్నారు. పట్టువదలని విక్రమార్కుల్లా ఆఖరి వరకు పోరాడే ఆటగాళ్లున్న ఆస్ట్రేలియాతో పోటీ అంటే మరింత జాగ్రత్తగా ఉండాలని సూచిస్తున్నారు. 

 

డేవిడ్‌ వార్నర్‌

ఆస్ట్రేలియా విధ్వంసకర ఓపెనర్‌ డేవిడ్‌ వార్నర్‌.. ఆరంభంలోనే బౌలర్లపై ఎదురు దాడికి దిగి మ్యాచ్‌ను ఆస్ట్రేలియా వైపు తిప్పేస్తున్నాడు. బౌలర్ల లయను దెబ్బ తీయడంలో వార్నర్‌ ముందుంటాడు. ఈ ప్రపంచకప్‌లో 10 మ్యాచుల్లో 528 పరుగులు చేశాడు. ఇందులో రెండు సెంచరీలు, రెండు అర్ధ సెంచరీలు ఉన్నాయి. వార్నర్‌ను ఎంత త్వరగా పెవిలియన్‌ చేరిస్తే టిమిండియా పని అంత సులువు అవుతుంది. 

 

ట్రానిస్‌ హెడ్‌

 సౌతాఫ్రికాతో సెమీ ఫైనల్లో ఓపెనర్‌ ట్రవిస్‌ హెడ్‌ బ్యాట్‌తోనే కాకుండా బంతితోనూ మెరిసి గెలుపులో కీలక పాత్ర పోషించాడు. గాయం కారణంగా ఆరంభంలో మ్యాచ్‌లకు దూరమైన ఓపెనర్‌గా హెడ్‌ ఆరంభం నుంచే దూకుడుగా ఆడతాడు. నిలబడ్డాడా బ్యాట్‌తో విధ్వంసం సృష్టిస్తాడు.

 

గ్లెన్‌ మ్యాక్స్‌వెల్‌

అఫ్గానిస్థాన్‌తో జరిగిన మ్యాచ్‌లో మ్యాక్స్‌వెల్‌ విధ్వంసం గుర్తుండే ఉంటుంది. తనదైన రోజున మ్యాచ్‌ను ఒంటిచేత్తో గెలిపించే సత్తా మ్యాక్స్‌వెల్‌కు ఉంది. ఇప్పటికే భీకర ఫామ్‌లో ఉన్న మ్యాక్స్‌వెల్‌ ఏ రోజున ఎలా ఆడతాడో చెప్పలేం. ఇతడిపైనా టీమిండియా కన్నేసి ఉంచాల్సిందే.

 

స్టీవ్‌ స్మిత్‌

ఈ ప్రపంచకప్‌లో భారీగా పరుగులు చేయకున్నా స్టీవ్‌ స్మిత్‌పై భారీ అంచనాలు ఉన్నాయి. నెమ్మదిగా ఆడుతూ అవసరమైనప్పుడు దూకుడుగా ఆడడం స్టీవ్‌ స్మిత్‌కు వెన్నతో పెట్టిన విద్య. స్మిత్‌ను స్పిన్నర్లు త్వరగానే వలలో వేసుకోవాలి.

 

కమిన్స్‌, హాజిల్‌ వుడ్‌

వీరిద్దరూ ఆస్ట్రేలియా బౌలింగ్‌ దళంలో ప్రధాన అస్త్రాలు. పదునైన యార్కర్లు, బౌన్సర్లతో బ్యాటర్లను ఇబ్బంది పెడతారు. ప్రపంచకప్‌ లీగ్‌ మ్యాచ్‌లోనూ టీమిండియాపై రెండు పరుగులకే మూడు వికెట్లు నేలకూల్చారు. రోహిత్‌ మరోసారి వీరి పని పడితే భారత్‌కు ఎదురుండదు.

 

ఆడమ్‌ జంపా

సౌతాఫ్రికాతో జరిగిన మ్యాచ్‌లో ఆడమ్‌ జంపా విఫలమైనా.. స్పిన్‌కు అనుకూలించే ఈడెన్‌ గార్డెన్స్‌ పిచ్‌పై జంపా కీలకంగా మారే అవకాశం ఉంది. స్పిన్‌ను పటిష్టంగా ఎదుర్కొనే టీమిండియా బ్యాటర్లు మరోసారి అదే కొనసాగిస్తే టీమిండియాకు ఎదురుండదు.

సొంతగడ్డపై ప్రపంచకప్‌-2023 టోర్నీలో ఇప్పటి దాకా అపజయమన్నదే ఎరుగని టీమిండియా ఫైనల్లో కంగారూ జట్టుతో పోటీకి సిద్ధమైంది. ఇప్పటికే ఐదుసార్లు చాంపియన్‌గా నిలిచిన ఆసీస్‌ ఆరో టైటిల్‌ను ఖాతాలో వేసుకోవాలని పట్టుదలగా ఉంది. 2015 వన్డే ప్రపంచకప్‌ విజయం, 2022 టెస్టు ఛాంపియన్‌షిప్‌ గెలుపుతో ఆస్ట్రేలియా నాకౌట్‌ మ్యాచుల్లో అద్భుతంగా ఆడుతున్నది సుస్పష్టం. ఈ ప్రపంచకప్‌ సెమీస్‌లోనూ దాన్ని మరోసారి నిరూపిస్తూ ఆస్ట్రేలియా ఒత్తిడిని చిత్తు చేస్తూ దక్షిణాఫ్రికాపై ఘన విజయం సాధించింది. ఆటగాళ్లు మారినా.. ఆస్ట్రేలియా క్రికెట్లో ప్రొఫెషనలిజానికి లోటు ఉండదు. ఓటమిని ఒప్పుకోకుండా తుదికంటా పోరాడే తీరు వారిని భిన్నంగా నిలబెడుతుంది. ఈసారి కూడా ఆస్ట్రేలియాను తక్కువ అంచనా వేయడానికి వీల్లేదు.