ICC ODI World Cup 2023 : ప్రపంచంలోనే అతిపెద్ద క్రికెట్‌ స్టేడియమైన గుజరాత్ అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియంలో వన్డే ప్రపంచకప్‌ తుది పోరుకు సర్వం సిద్ధమైంది. అప్రతిహాత  విజయాలతో ఫైనల్‌ చేరిన టీమిండియా... చరిత్ర సృష్టించేందుకు కేవలం అడుగు దూరంలో నిలిచింది. 2003లో కప్పు కలను కూల్చేసిన ఆస్ట్రేలియాపై ప్రతికార విజయం సాధించి  పుష్కర కాలం తర్వాత ప్రపంచకప్‌ను కైవసం చేసుకోవాలని రోహిత్‌ సేన పట్టుదలగా ఉంది. అయితే ఈ నేపథ్యంలో ఫైనల్‌ మ్యాచ్‌కు సిద్ధమవుతున్న టీమిండియా క్రికెటర్లకు మాజీ దిగ్గజ క్రికెటర్లు హితబోధ చేస్తున్నారు. ఆ విషయంలో జాగ్రత్తగా ఉండాలని హెచ్చరిస్తున్నారు. 


ఫైనల్లో భారత జట్టు ఏమాత్రం ఏమరపాటుగా ఉన్నా భారీ మూల్యం చెల్లించకతప్పదని రోహిత్‌ సేనను క్రికెట్‌ దిగ్గజం సునిల్‌ గావస్కర్‌ హెచ్చరించాడు. టోర్నీలో ఇప్పటి దాకా అపజయమన్నదే ఎరుగని టీమిండియా ఫైనల్లో కూడా దానిని కొనసాగించాలని హితబోధ చేశాడు. టీమిండియా అద్భుతంగా ఆడుతోంది కాబట్టే టైటిల్‌ ఫేవరెట్‌గా ఉందని, మరోసారి రోహిత్‌ సేన స్థాయికి తగ్గ ప్రదర్శన చేస్తే తిరుగులేకుండా గెలుస్తుందని గవాస్కర్ తెలిపాడు. ఆసిస్‌ను తక్కువగా అంచనా వేస్తే భారీ మూల్యమే చెల్లించాల్సి వస్తుందని సునిల్‌ గావస్కర్‌ వ్యాఖ్యానించాడు. 


స్వయం తప్పిదాలు తప్ప రోహిత్‌ సేనను ఈసారి ట్రోఫీ గెలవనీయకుండా అడ్డుపడే శక్తి వేరే ఏదీ లేదని స్టార్‌ ఆల్‌రౌండర్‌ యువరాజ్‌ సింగ్‌ ధీమా వ్యక్తం చేశాడు. ఆస్ట్రేలియాను తక్కువగా అంచనా వేసే పరిస్థితి లేదని, తమదైన రోజు వాళ్లు చెలరేగడం ఖాయమన్నాడు. హైవోల్టేజీ మ్యాచ్‌ల్లో ఒత్తిడి జయించడం ఆస్ట్రేలియాకు వెన్నతో పెట్టిన విద్యని యువీ పేర్కొన్నాడు. కాబట్టి ఏమాత్రం ఎమరుపాటుగా ఉండకుండా తుది వరకు పోరాడాలని యువరాజ్‌ సూచించాడు. తమంతట తాము తప్పు చేస్తే తప్ప ఈసారి టీమిండియా ఓడిపోయే అవకాశాలే లేవని యువీ తేల్చేశాడు. పూర్తి ఆత్మవిశ్వాసంతో కనిపిస్తున్నందున టీమిండియా కచ్చితంగా గెలుస్తుందనే అనిపిస్తోందని అన్నాడు. ఆస్ట్రేలియా అత్యుత్తమంగా రాణించకపోతే టీమిండియాను నిలువరించడం వారికి అసాధ్యమని యువీ స్పష్టం చేశాడు.


ప్రపంచకప్‌లో ఇప్పటి వరకు అనుసరిస్తున్న వ్యూహానికే ఫైనల్లో కట్టుబడి ఉండాలని రవిశాస్త్రి టీమిండియాకు సూచించాడు. అందుకు భిన్నంగా చేయాల్సిన అవసరం లేదని స్పష్టం చేశాడు. ఫైనల్లో ఏదీ భిన్నంగా చేయాల్సిన అవసరం లేదని... ఇప్పటి వరకు ఆడుతున్నట్లే.. గత మ్యాచ్‌ను ముగించిన మాదిరే ఆడితే సరిపోతుందని తేల్చేశాడు. భారత జట్టు కప్‌ను అందుకుంటుందని, ఆటగాళ్లు ఒత్తిడిని దరిచేరనీయొద్దని, ఫైనల్‌ కాబట్టి అత్యుత్సాహం ప్రదర్శించొద్దని రవిశాస్త్రి సూచించాడు. జట్టులో ప్రతి ఒక్కరికి వాళ్ల బాధ్యత తెలుసని మాజీ కోచ్‌ అన్నాడు. 


రోహిత్‌ శర్మ అద్భుతమైన నాయకుడని   టీమ్‌ఇండియా మాజీ ఫాస్ట్‌బౌలర్ జహీర్‌ఖాన్ కొనియాడాడు. ఎన్నోసార్లు ఫైనల్‌ మ్యాచ్‌ల్లో కెప్టెన్సీ చేసిన అనుభవం రోహిత్‌కు ఉందని... పెద్ద మ్యాచ్‌ల్లో జట్టును ఎలా ముందుకు నడిపించాలో అతడికి బాగా తెలుసని జహీర్‌ అన్నాడు. మార్పులేమీ చేయకుండా, ఇదివరకు మ్యాచ్‌ల్లో ఆడిన విధంగా ముందుకెళ్తే టీమిండియా గెలిచినట్లేనని జహీర్‌ఖాన్‌ అన్నాడు. ట్రోఫీలు గెలవడానికి ఏం అవసరమో అది రోహిత్‌కు తెలుసని అన్నాడు.