ODI World Cup 2023: 2003(World Cup 2003)లో టీమిండియా(Team India) ఫైనల్లోకి దూసుకెళ్లి ఆస్ట్రేలియా(Austelia) చేతిలో పరాజయం పాలైంది. అది జరిగి 20 సంవత్సరాలు గడిపోయింది. అయినా క్రికెట్‌ ప్రేమికుల మనసుల్లో ఆ ఫైనల్‌ చేదు జ్ఞాపకాలు ఇంకా మరుగనపడలేదు. అయితే 2003కు 2023కు ఉన్న పోలికలను ఒకసారి పరిశీలిస్తే ఈసారి కప్పు మనదే అని చాలామంది అంచనా వేస్తున్నారు. అప్పుడు జరిగింది ఇప్పుడు జరిగింది ఒకేలా ఉందని చెబుతున్నారు. వీరి అంచనాలు నిజమైతే ముచ్చటగా మూడోసారి టీమిండియా కప్పు గెలవడం ఖాయమే. ఇంతకీ 2003కు 2023కు ఉన్న పోలికలేంటంటే...

 

అప్పడు ఇండియా.. ఇప్పుడు ఆస్ట్రేలియా..

 

 2003 ప్రపంచకప్‌ ఫైనల్లో టీమ్‌ఇండియా భారీ అంచనాలతో ప్రపంచకప్‌ బరిలోకి దిగింది. కానీ రెండో మ్యాచ్‌లో ఆస్ట్రేలియా చేతిలో 125 పరుగులకే కుప్పకూలి ఘోరంగా ఓడిపోయింది. ఈ పరాజయంతో అభిమానుల ఆగ్రహం కట్టలు తెంచుకుని మన జట్టుపై తీవ్రంగా విమర్శలు చేశారు. ఈ ప్రపంచకప్‌లో లీగ్‌ మ్యాచ్‌లో ఆస్ట్రేలియా తొలి మ్యాచ్‌లోనే భారత్‌ చేతిలో ఓడిపోయింది. 2003 ప్రపంచకప్‌ లీగ్‌ మ్యాచ్‌లో కంగారుల చేతిలో టీమిండియా ఓడిపోతే... 2023 ప్రపంచకప్‌ లీగ్‌ మ్యాచ్‌లో రోహిత్‌ సేన చేతిలో ఆస్ట్రేలియా ఓడిపోయింది. 2003 ప్రపంచ కప్‌లో ఓటమి తర్వాత టీమిండియా వరుస విజయాలతో ఫైనల్‌కు దూసుకొచ్చింది. ఈ ప్రపంచకప్‌లోనూ తొలి రెండు మ్యాచుల్లో పరాజయం పాలైన తర్వాత ఆస్ట్రేలియా వరుస విజయాలు సాధించి ఫైనల్‌ చేరింది. 

 

2003  ప్రపంచకప్‌లో ఫైనల్లో విజయం సాధించి మూడోసారి ఆస్ట్రేలియా ప్రపంచకప్‌ను కైవసం చేసుకుంది. ఇప్పుడు 2023లో కప్పు కైవసం చేసుకుంటే టీమిండియా మూడోసారి ఆ ఘనత సాధిస్తుంది. అంటే ఈసారి ఆస్ట్రేలియాపై టీమిండియా విజయం సాధిస్తే ముచ్చటగా మూడోసారి కప్పు భారత జట్టు వశమవుతుంది. 2003 ప్రపంచకప్‌లో ఆస్ట్రేలియా ఒక్క పరాజయం కూడా లేకుండా పైనల్‌ చేరి కప్పును దక్కించుకుంది. ఈసారి రోహిత్‌ సేన ఒక్క పరాజయం లేకుండా తుదిపోరుకు చేరుకుంది. అంటే 2003లో ఒక్క ఓటమి లేకుండా ఆస్ట్రేలియా కప్పు గెలిస్తే 2023లో రోహిత్ సేన కూడా అదే స్థితిలో ఉంది. అప్పుడు ఆస్ట్రేలియా గెలిస్తే... ఇప్పుడు రోహిత్‌ సేన గెలిచేందుకు సిద్ధంగా ఉంది.

 

కానీ ఇప్పుడు 2003 నాటి పరిస్థితులు మారాయి. టీమిండియా అప్పటి ఆస్ట్రేలియా జట్టు కంటే దుర్బేద్యంగా కనిపిస్తోంది. ఈ ప్రపంచకప్‌లో రోహిత్‌ సేన ఒక్క మ్యాచ్‌లో కూడా పరాజయం పాలు కాలేదు. అన్ని విభాగాల్లో బలంగా ఉన్న మన జట్టు.. అప్పటి ఆస్ట్రేలియా తరహాలోనే పక్కా ప్రణాళికతో ఆడుతోంది. బ్యాటింగ్‌లో ఎదురుదాడికి దిగుతూ బౌలింగ్‌ ఆరంభం నుంచే ప్రత్యర్థులను దెబ్బ కొడుతూ ముందుకు సాగుతోంది. 

 

ఆటగాళ్ల అద్భుత ప్రదర్శనతో రోహిత్‌ సమర్థ సారథ్యంలో టీమిండియా దుమ్మురేపింది. ఒక్క పరాజయం లేకుండా అప్రతిహాత విజయాలతో తుదిపోరుకు సిద్ధమైంది. లీగ్‌ దశ నుంచి న్యూజిలాండ్‌తో సెమీఫైనల్‌ వరకు భారత్‌ విజయాలన్నీ ఏకపక్షమే. సెమీఫైనల్లో కివీస్‌ కాస్త కలవరపెట్టినా 70కుపైగా  పరుగుల తేడాతో ఘన విజయం సాధించి ఆస్ట్రేలియాతో తుది పోరుకు సిద్ధమైంది. లీగ్‌ దశలో మొత్తం తొమ్మిది మ్యాచ్‌లో రోహిత్‌ సేన సాధికార విజయాలు సాధించింది.