ODI World Cup 2023: రోహిత్ వ్యక్తిగత రికార్డుల కోసమే ఆడి ఉంటే ఈ ప్రపంచకప్‌లో కనీసం 5 శతకాలు సాధించి ఉండేవాడేనని సునీల్ గవాస్కర్, నాసిర్ హుస్సేన్, రవిశాస్త్రి, గౌతం గంభీర్ సహా ఎందరో దిగ్గజాలు అభిప్రాయపడ్డారు. దీనినిబట్టి చెప్పేయొచ్చు జట్టును గెలిపించేందుకు రోహిత్‌ ఎంతలా తపనపడుతున్నాడో.  ప్రపంచకప్ వేటలో భారత్ అసలు సిసలు హీరో... ఖచ్చితంగా సారధి రోహిత్‌ శర్మనే. ఆరంభంలోనే దూకుడుగా బ్యాటింగ్ చేసి..... జట్టు భారీ స్కోరు చేసేందుకు హిట్‌ మ్యాన్‌ బలమైన పునాదిని వేస్తున్నాడు. రికార్డులు, శతకాల గురించి ఆలోచనే లేకుండా భారత్‌కు ప్రపంచకప్‌ అందించడమే లక్ష్యంగా ధాటిగా బ్యాటింగ్‌ చేస్తున్నాడు. రోహిత్‌ శర్మ విధ్వంసంతోనే టీమిండియా వన్డే ప్రపంచకప్ టైటిల్ కు భారత్ అడుగుదూరంలో నిలిచింది. పది వరుస విజయాలతో మూడోసారి ట్రోఫీ అందుకోడానికి ఉరకలేస్తోంది.


భారత్ ఈ జైత్రయాత్ర వెనుక రోహిత్‌ త్యాగం అంతాఇంతా కాదు. రికార్డులతో పని లేకుండా అర్ధ సెంచరీకి ముందు కూడా రోహిత్ భారీ షాట్లు ఆడుతూనే ఉన్నాడు. ఏ దశలోనూ బౌలర్‌ పైచేయి సాధించకుండా చూస్తూనే ఉన్నాడు. అందుకే గత మ్యాచుల్లో టీమిండియా భారీ స్కోరు సాధించింది. లక్ష్యాలను సునాయసంగా ఛేదించింది.


 ప్రపంచకప్ లో 10జట్ల లీగ్ దశ నుంచి సెమీఫైనల్స్ నాకౌట్ పోరు ముగిసే వరకూ అత్యంత విజయవంతమైన జట్టుగా భారత్ నిలిచిందంటే అది రోహిత్‌ చలవే. ఈ గెలుపుల వెనక ఉన్నది కచ్చితంగా రోహితే. లీగ్ దశలో తొమ్మిదికి తొమ్మిది మ్యాచ్ లూ నెగ్గడంతో పాటు సెమీఫైనల్‌లో న్యూజిలాండ్ ను 70 పరుగుల తేడాతో చిత్తు చేయడం ద్వారా భారత్ నాలుగోసారి ప్రపంచకప్ ఫైనల్లో అడుగుపెట్టింది.  భారత విజయపరంపర వెనుక జట్టు సమష్టి కృషి ఉంది. కెప్టెన్ రోహిత్ శర్మ చాతుర్యం, సమర్థత భారత్ ను అత్యంత విజయవంతమైనజట్టుగా నిలిపాయి. వన్డే క్రికెట్ చరిత్రలోనే మూడుసార్లు డబుల్ సెంచరీలు, ఒకే ప్రపంచకప్ లో ఐదుశతకాలు బాదిన ఏకైక క్రికెటర్ గా రోహిత్ శర్మ ప్రపంచ రికార్డులు నెలకొల్పాడు. ప్రస్తుత ప్రపంచకప్ లో మాత్రం రోహిత్ ఇప్పటి వరకూ ఆడిన 10 మ్యాచ్ ల్లో ఒకే ఒక్క సెంచరీతో పాటు 3 హాఫ్ సెంచరీలు మాత్రమే సాధించగలిగాడు. జట్టు ప్రయోజనాల కోసమే నిస్వార్థంగా ఆడుతూ సైలెంట్ హీరోగా తన పాత్ర నిర్వర్తిస్తున్నాడని రోహిత్‌ను ఇంగ్లండ్‌ మాజీ కెప్టెన్‌ నాసిర్ హుస్సేన్ ఆకాశానికి ఎత్తేశాడు. 


మొదటి పవర్ ప్లే ఓవర్లలోనే రోహిత్ శర్మ తన వికెట్ ను, వ్యక్తిగత రికార్డులను పక్కనపెట్టి భారీషాట్లతో ప్రత్యర్థి బౌలర్లపై విరుచుకు పడుతున్నాడు. ఈ కారణంతో తర్వాత వచ్చే బ్యాటర్లకు ఎలాంటి ఒత్తిడి ఉండడం లేదు. కెప్టెన్ రోహిత్ శర్మ తన వ్యక్తిగత రికార్డుల స్వార్థాన్ని పక్కనబెట్టి..ప్రపంచకప్ కోసం వెంపర్లాడుతున్నాడని పలువురు మాజీ క్రికెటర్లు పొగడ్తల వర్షం కురిపిస్తున్నారు. మొత్తం  10 మ్యాచ్ లు ఆడిన రోహిత్ 120 స్ట్రయిక్ రేట్ తో 550 పరుగులు సాధించాడు. ఇందులో 131 పరుగుల శతకంతో పాటు ..మూడు అర్థసెంచరీలు మాత్రమే ఉన్నాయి. పవర్ ప్లేలో 300కు పైగా పరుగులతో పాటు అత్యధికంగా 21 సిక్సర్లు బాదిన ఏకైక ఓపెనర్‌గా రోహిత్ నిలిచాడు.