ఆస్ట్రేలియాతో జరుగుతున్న కీలకమైన నాలుగో టీ ట్వంటీలో భారత్‌ నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 174 పరుగులు చేసింది. టాస్‌ గెలిచిన ఆస్ట్రేలియా మరోసారి టీమిండియాను బ్యాటింగ్‌కు ఆహ్వానించింది. ఓపెనర్లు యశస్వి జైస్వాల్.. రుతురాజ్‌ గైక్వాడ్‌ శుభారంభం అందించారు. పవర్‌ ప్లేలో ఆరు ఓవర్లలో 50 పరుగులు సాధించారు. యశస్వి జైస్వాల్‌ ఆరంభంలో దూకుడుగా ఆడాడు. 28 బంతుల్లో ఆరు ఫోర్లు, ఒక సిక్సర్‌తో 37 పరుగులు చేసి యశస్వి జైస్వాల్‌ అవుట్‌ అయ్యాడు. రుతురాజ్‌ అవుటైన తర్వాత వరుసగా రెండు వికెట్లు పడడంతో భారత్‌ కష్టాల్లో పడింది. ఈ సిరీస్‌లో తొలిసారి బరిలోకి దిగిన శ్రేయస్స్‌ అయ్యర్‌ తక్కువ పరుగులకే పెవిలియన్‌ చేరాడు. కేవలం ఏడు బంతులే ఎదుర్కొన్న అయ్యర్‌... ఎనిమిది పరుగులు చేసి సంఘా బౌలింగ్‌లో అవుట్‌ అయ్యాడు. అనంతరం కెప్టెన్‌ సూర్యకుమార్‌ యాదవ్‌ కేవలం ఒక్క పరుగుకే వెనుదిరగడంతో టీమిండియా కష్టాల్లో పడింది. కేవలం రెండే బంతులు ఎదుర్కొన్న సూర్యకుమార్‌ యాదవ్‌ ఒక్కే పరుగు చేసి అవుటయ్యాడు. 50 పరుగులకు ఒక్క వికెట్‌ కూడా కోల్పోకుండా పటిష్టంగా కనపడిన టీమిండియా 63 పరుగులకే మూడు వికెట్లు కోల్పోయింది. 13 పరుగుల వ్యవధిలో మూడు వికెట్లు కోల్పోవడంతో స్కోరు వేగం తగ్గింది.



 కానీ గత మ్యాచ్‌ సెంచరీ హీరో రుతురాజ్‌ గైక్వాడ్‌ మరోసారి కీలక ఇన్నింగ్స్‌ ఆడాడు. టీమిండియా సూపర్‌ ఫినిషర్‌గా మారిన రింకూ సింగ్‌తో కలిసి రుతురాజ్‌ స్కోరు బోర్డును ముందుకు నడిపించాడు. కానీ కీలక సమయంలో రుతురాజ్‌ అవుటయ్యాడు. 28 బంతుల్లో 3 ఫోర్లు ఒక సిక్స్‌తో 32 పరుగులు చేసి రుతురాజ్‌... సంఘా బౌలింగ్‌లో అవుటయ్యాడు. దీంతో 111 పరుగుల వద్ద భారత్‌ నాలుగో వికెట్‌ కోల్పోయింది. అనంతరం జితేశ్‌ శర్మతో కలిసి రింకూసింగ్‌  స్కోరు బోర్డును ముందుకు నడిపించాడు. రింకూసింగ్‌ 29 బంతుల్లో 46 పరుగులు చేశాడు. ఇందులో 4 ఫోర్లు 2 సిక్సర్లు ఉన్నాయి. జితేశ్‌ శర్మ కూడా 35 పరుగులతో  రాణించాడు. వీరిద్దరూ రాణించడంతో నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 174  పరుగులు చేసింది. 



 గత మ్యాచ్‌లో 220కుపైగా లక్ష్యాన్ని కాపాడుకోలేకపోయిన టీమిండియా.. ఈ స్వల్ప  లక్ష్యాన్ని కాపాడుకుంటుందేమో చూడాలి. టీమిండియా పేసర్లు గాడిన పడకపోతే ఈ స్కోరు కూడా కాపాడుకోవడం కష్టమే. ఈ మ్యాచ్లో మాక్స్వెల్ ఆడడం లేదు. ఇది టీమ్ ఇండియా కు సానుకూల అంశం. మ్యాక్స్‌వెల్, స్మిత్, జంపా వంటి కీలక పాత్రలు స్వదేశానికి వెళ్లిపోయినా ఆస్ట్రేలియా ఆత్మవిశ్వాసంతో ఉంది. ట్రావిస్‌ హెడ్, కెప్టెన్ మాథ్యూ వేడ్లను భారత బౌలర్లు నిలువరిస్తేనే ఈ లక్ష్యాన్ని కాపాడుకోవచ్చు. కీలక ఆటగాళ్లు స్వదేశానికి వెళ్లిపోయిన కంగారులను తక్కువ అంచనా వేయడానికి ఏ మాత్రం వీల్లేదు. కానీ ఈ సందర్భాన్ని అనుకూలంగా మార్చుకుంటే టీమిండియా సిరీస్ కైవసం చేసుకునే అవకాశం ఉంది. . అయితే టీమ్ఇండియాకు బౌలింగే ఆందోళన కలిగిస్తోంది. యువ బౌలర్లు భారీగా పరుగులు సమర్పించుకుంటున్నారు. నెగ్గాలంటే ఆఖరి ఓవర్ల బౌలింగ్ బాగా మెరుగుపడడం అత్యవసరం. మూడో మ్యాచ్‌లో బౌలర్లు చివరి రెండు ఓవర్లలో 40కి పైగా పరుగులను కాపాడలేకపోయారు. చివరి ఓవర్లో 21 సహా నాలుగు ఓవర్లలో ప్రసిద్ధ్ కృష్ణ ఏకంగా 68 పరుగులిచ్చాడు. ప్రసిద్ధ కృష్ణ పాటు అవేష్ ఖాన్ బౌలింగ్లోనూ వైవిధ్యం లోపించింది. అర్ష్దీప్ సింగ్ కూడా భారీగా పరుగులు సమర్పించుకుంటున్నాడు. తొలి మూడు మ్యాచ్‌ల్లో అతడు 131 పరుగులిచ్చి కేవలం రెండు వికెట్లే పడగొట్టాడు. ఈ ముగ్గురుపేసర్లు గాడిన పడాలని టీమ్ ఇండియా కోరుతుంది. 22 పరుగులు చేసినా ఓడిపోవటం భరత్ ను ఆందోళన పరుస్తుంది. బౌలర్లు పుంజుకోకుంటే భారత్‌కు ఇబ్బందులు తప్పవు.