IND vs AUS Final: క్రికెట్ ప్రపంచకప్‌లో మహా సంగ్రామానికి రంగం సిద్ధమైంది. 5సార్లు ప్రపంచ ఛాంపియన్ ఆస్ట్రేలియాతో రెండుసార్లు టోర్నీ విజేత భారత్ అమీతుమీ తేల్చుకోనుంది.మధ్యాహ్నం రెండు గంటలకు మొదలయ్యే ఈ మ్యాచ్ కోసం కోట్లాది క్రికెట్ అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అహ్మదాబాద్ వేదికగా జరిగే ఈ పోరులో కచ్చితంగా విజయం సాధించాలని టీమిండియా పట్టుదలగా ఉంది. 2003 ప్రపంచకప్ ఫైనల్ పరాభవానికి బదులు తీర్చుకోవాలని కసిగా కనిపిస్తోంది. ఈ టోర్నీ మొత్తం ఆడిన 10 మ్యాచ్‌ల్లోనూ ప్రణాళికబద్దంగా ఆడిన భారత్ ఫైనల్‌లోనూ అదే కొనసాగించాలని భావిస్తోంది. అయితే ఆస్ట్రేలియాకు అనుకూలంగా ఓ సెంటిమెంట్ ఉండడం సోషల్ మీడియాలో ట్రెండింగ్‌గా మారింది. ఈ పెళ్లిళ్ల సెంటిమెంట్ ఏంట్రా అని నెటిజన్లు ఫన్నీగా కామెంట్లు చేస్తున్నారు. ఎన్ని సెటిమెంట్లు ఉన్నా టీమిండియా కప్పు కొట్టడం ఖాయమని ఢంకా భజాయించి మరీ చెప్తున్నారు. ఇంతకీ ఈ పెళ్లిళ్ల సెంటిమెంట్ ఏంటంటే..
2002లో ఆస్ట్రేలియా కెప్టెన్ రికీ పాంటింగ్ పెళ్లి చేసుకోగా 2003లో ప్రపంచకప్ గెలిచాడు. 2010లో టీమిండియా కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ వివాహం చేసుకోగా 2011లో భారత జట్టు వరల్డ్‌కప్‌ను దక్కించుకుంది. 2018లో ఇంగ్లండ్ కెప్టెన్ ఇయాన్ మోర్గాన్ వివాహం చేసుకోగా 2019లో బ్రిటీష్ జట్టు ఈ మెగా కప్‌ను అందుకుంది. . ఇప్పుడు తాజాగా 2022లో ఆస్ట్రేలియా కెప్టెన్ ప్యాట్ కమిన్స్ పెళ్లి చేసుకోగా ఈ ఏడాది ఆస్ట్రేలియాకు కప్ అందిస్తాడని ఆస్ట్రేలియా అభిమానులు కామెంట్ చేస్తున్నారు. అయితే ఈ కామెంట్లకు టీమిండియా అభిమానులు ఫన్నీగా కామెంట్లు చేస్తున్నారు. ఎవరెన్ని పెళ్లిళ్లు చేసుకున్నా గెలిచేది టీమిండియానేనని స్పష్టం చేస్తున్నారు. ఇప్పటికే న్యూజిలాండ్‌తో సెమీస్‌లో ఇలాంటి రికార్డులను చరిత్రలను రోహిత్ సేన కాలగర్భంలో కలిపేసిందని ఇప్పుడు మరోసారి అదే రిపీట్ అవుద్దని మరీ చెప్తున్నారు.
ఫైనల్లో భారత జట్టు ఏమాత్రం ఏమరపాటుగా ఉన్నా భారీ మూల్యం చెల్లించకతప్పదని రోహిత్ సేనను క్రికెట్ దిగ్గజం సునిల్ గావస్కర్ హెచ్చరించాడు. టోర్నీలో ఇప్పటి దాకా అపజయమన్నదే ఎరుగని టీమిండియా ఫైనల్లో కూడా దానిని కొనసాగించాలని హితబోధ చేశాడు. టీమిండియా అద్భుతంగా ఆడుతోంది కాబట్టే టైటిల్ ఫేవరెట్‌గా ఉందని, మరోసారి రోహిత్ సేన స్థాయికి తగ్గ ప్రదర్శన చేస్తే తిరుగులేకుండా గెలుస్తుందని గవాస్కర్ తెలిపాడు. ఆసిస్‌ను తక్కువగా అంచనా వేస్తే భారీ మూల్యమే చెల్లించాల్సి వస్తుందని సునిల్ గావస్కర్ వ్యాఖ్యానించాడు.
స్వయం తప్పిదాలు తప్ప రోహిత్ సేనను ఈసారి ట్రోఫీ గెలవనీయకుండా అడ్డుపడే శక్తి వేరే ఏదీ లేదని స్టార్ ఆల్‌రౌండర్ యువరాజ్ సింగ్ ధీమా వ్యక్తం చేశాడు. ఆస్ట్రేలియాను తక్కువగా అంచనా వేసే పరిస్థితి లేదని, తమదైన రోజు వాళ్లు చెలరేగడం ఖాయమన్నాడు. హైవోల్టేజీ మ్యాచ్‌ల్లో ఒత్తిడి జయించడం ఆస్ట్రేలియాకు వెన్నతో పెట్టిన విద్యని యువీ పేర్కొన్నాడు. కాబట్టి ఏమాత్రం ఎమరుపాటుగా ఉండకుండా తుది వరకు పోరాడాలని యువరాజ్ సూచించాడు. తమంతట తాము తప్పు చేస్తే తప్ప ఈసారి టీమిండియా ఓడిపోయే అవకాశాలే లేవని యువీ తేల్చేశాడు. పూర్తి ఆత్మవిశ్వాసంతో కనిపిస్తున్నందున టీమిండియా కచ్చితంగా గెలుస్తుందనే అనిపిస్తోందని అన్నాడు. ఆస్ట్రేలియా అత్యుత్తమంగా రాణించకపోతే టీమిండియాను నిలువరించడం వారికి అసాధ్యమని యువీ స్పష్టం చేశాడు.